పంచాయితీ నిధుల పక్క దారి!

* వైకాపా ప్ర‌భుత్వ హ‌స్త‌లాఘ‌వం
* గ్రామ సర్పంచుల గ‌గ్గోలు
* మూడేళ్ల‌లో రూ.11,660 కోట్ల మ‌ళ్లింపు
* 13,371 పంచాయితీల్లో నిధులు హుళ‌క్కి

– “రుణ ప‌రిమితుల‌ను పెంచి రాష్ట్రాన్ని ఆదుకోండి”… ఇది ఇటీవ‌ల ప్ర‌ధాన మంత్రిని క‌లిసిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ విన్న‌పం!
– “మా పంచాయితీలో నిధుల‌ను మ‌ళ్లించ‌డం అత్యంత దారుణం”… ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామ పంచాయితీ స‌ర్పంచుల ఆక్రోశం!
… ఈ రెండు అంశాల‌ను ప‌రిశీలిస్తే చాలు ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితులు ఎంత అస్త‌వ్య‌స్తంగా ఉన్న‌యో చెప్ప‌డానికి.
తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని… నెల నెలా జీతాల‌ను, పింఛ‌న్ల‌ను సైతం చెల్లించ‌డానికి క‌ట‌క‌ట‌లాడుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌నితీరు ఎలా ఉందో చూడాలంటే ఏ గ్రామానికి వెళ్లి చూసినా స‌రిపోతుంది.
అలా వెళితే… ఓ స‌ర్పంచ్ బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను ముష్టెత్తుతూ క‌నిపించ‌వ‌చ్చు!
మ‌రో స‌ర్పంచ్ వీధుల్లో బిక్షాట‌న చేస్తూ క‌నిపించ‌వ‌చ్చు!
ఇదంతా గ్రామ పంచాయితీల ఖాతాల నుంచి సొమ్ములు ఉన్న‌ట్టుండి మాయ‌మైన నేప‌థ్యంలో ఆయా స‌ర్పంచుల ఆక్రోశం నుంచి వెల్లువెత్తిన ఆందోళ‌న‌ల దృశ్యాలు!
“వైకాపా ప్ర‌భుత్వం మూడేళ్ల‌లో రూ.11, 660 కోట్ల రూపాయ‌ల‌ను దోచుకుంది” అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయితీ రాజ్ ఛాంబ‌ర్ రాష్ట్ర అధ్య‌క్షుడు వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ లెక్క‌ల‌తో స‌హా చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
“ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స‌ర్పంచ్‌ల‌కు నిధులు లేవు. అధికారాలు లేవు. పాతికేళ్లుగా పోరాడి సాధించుకున్న అధికారాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాల‌రాస్తోంది” అంటూ ఆయ‌న ఆరోపిస్తున్నారు.
* అక్క‌డ యాత‌న‌… ఇక్క‌డ యాచ‌న‌
ఓప‌క్క ముఖ్య‌మంత్రి రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ఢిల్లీలో యాచిస్తుంటే, ఇక్క‌డ గ్రామ సర్పంచులు ఏకంగా ప్ర‌జ‌ల‌నే యాచిస్తున్న విచిత్ర ప‌రిస్థితులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెల‌కొని ఉన్నాయ‌ని గ‌త కొంత కాలంగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. “ఈ ప‌రిస్థితికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అస్త‌వ్య‌స్త విధానాలే కార‌ణం. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ను దారుణంగా ఉల్లంఘించిన చ‌ర్య‌ల ఫ‌లిత‌మే ఇది” అంటూ ఆర్థిక నిపుణులు, సామాజిక ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
ఈ అభిప్రాయం ఎంత స‌త్య‌మో ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మొత్తం 13,371 పంచాయితీల్లో ఏ ఒక్క గ్రామంలోకి వెళ్లినా ఇట్టే అర్థ‌మైపోతుంది. ఎందుకంటే ఏ గ్రామంలోనూ ప్ర‌జ‌ల క‌నీస అవ‌స‌రాల‌ను సైతం తీర్చ‌డానికి సైతం దారి లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గ్రామాల్లో పారిశుధ్యం ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డ స్తంభించాయి. కొన్ని గ్రామాల్లో క‌నీసం బ్లీచింగ్ పౌడ‌ర్ జ‌ల్లించ‌డానికి కూడా దిక్కులేని స్థితి దాపురించింద‌ని స‌ర్పంచ్‌లు వాపోతున్నారు. చెత్త నిర్వ‌హ‌ణ‌, తాగానీటి స‌ర‌ఫ‌రా, వీధిదీపాల ప‌నుల‌ను చేయించ‌డానికి కూడా నిధులు లేని ప‌రిస్థితి గ్రామాల్లో క‌నిపిస్తోంది.
* నిధులు మాయం
గ్రామ పంచాయితీల‌కు ప్ర‌త్యేక‌మైన ఖాతాలుంటాయి. కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని ప‌థ‌కాల నిమిత్తం జ‌మ చేసే నిధులు నేరుగా ఈ ఖాతాల్లో జ‌మ అవుతుంటాయి. అలాగే పంచాయితీలు ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసే ఇంటి ప‌న్ను, చెత్త ప‌న్ను, న‌ల్లా పన్నుల్లాంటివి కూడా ఖాతాల్లోకి ప‌డుతుంటాయి. ఇలా రాష్ట్రంలోని 13,371 పంచాయితీల్లో ఒకో దాంట్లో స్థాయిని బ‌ట్టి రెండు ల‌క్ష‌ల నుంచి 20 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు నిధులు ఉంటూ ఉంటాయి. కొన్ని పెద్ద పంచాయితీల్లో కోట్ల‌లో కూడా నిధులు ఉంటాయి. అయితే ఈ పంచాయితీల ఖాతాల్లోంచి ఎప్పుడు నిధులు హుళ‌క్కి అయిపోతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి ఇప్పుడు దాపురించింది. కార‌ణ‌మేమిటంటే ఆయా ఖాతాల్లోంచి రాష్ట్ర ప్ర‌భుత్వం ఎప్పుడైనా నిధుల‌ను ఆన్‌లైన్ నిర్వ‌హ‌ణ ద్వారా తీసుకునే అవ‌కాశం ఉండ‌డ‌మే. ఈ విష‌యం క‌నీసం స‌ర్పంచ్‌ల‌కు సైతం తెలియ‌కుండా జ‌రిగిపోయే వెసులు బాటు ఉండ‌డంతో గ్రామాల్లో అయోమ‌య స్థితి నెల‌కొని ఉంది. ఉన్న‌ట్టుండి ఖాతాల్లో బ్యాల‌న్స్ సున్నా చూపిస్తుంది. విష‌యం బ‌య‌ట‌కి పొక్కి ఆందోళ‌న‌లు జ‌ర‌గుతున్న‌ప్పుడు మ‌ళ్లీ నిధులు క‌నిపిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల బిక్షాట‌న‌లు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి నిధులు క‌నిపించాయి. అయితే ఈ ఖాతాల నుంచి నిధులను ఎవ‌రు తీసుకుంటున్నారో, ఎంత తీసుకుంటారో, అలా మాయ‌మైన నిధులు తిరిగి ఎప్పుడు జ‌మ అవుతాయో, ఎంత జమ అవుతాయో తెలియ‌ని అగ‌మ్య‌గోచ‌ర స్థితి గ్రామాల‌లో నెల‌కొని ఉంది. ఇందువ‌ల్ల ఏ పనులు చేప‌ట్టాల‌న్నా వీలుకాని దుస్థితిలో స‌ర్పంచ్‌లు ప‌డిపోతున్నారు. “గ్రామ పంచాయితీల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి 14వ‌, 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 7,660 కోట్ల రూపాయ‌లు జ‌మ అయ్యాయి. అలాగే ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన ప‌న్నుల రూపేణా దాదాపు 4000 కోట్ల రూపాయ‌లు ప‌డ్డాయి. మూడేళ్లుగా ఇలా జ‌మ అయిన దాదాపు 11,660 కోట్ల రూపాయ‌ల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం దారి మ‌ళ్లించింద‌”ని రాష్ట్ర పంచాయితీ రాజ్ ఛాంబ‌ర్ అధ్య‌క్షుడు రాజేంద్ర‌ప్ర‌సాద్ చెబుతున్నారు.
“రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి నిధుల‌న్నింటినీ కేంద్రం తీసేసుకుని మీకేం కావాలో చెప్పండి మేమే ప‌నులు చేప‌డ‌తాం అని అంటే ఎలా ఉంటుంది? అది సాధ్య‌మ‌య్యే ప‌నేనా? కానీ ప్ర‌స్తుతం ఆంధ్ర ప్ర‌దేశ్ పంచాయితీల విష‌యంలో ఇదే జ‌రుగుతోంది” అంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
* చేష్ట‌లుడిగిన కొత్త స‌ర్పంచ్‌లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక ఎన్నిక‌ల అనంత‌రం పంచాయితీల్లో స‌ర్పంచ్‌లు ఏడాది క్రితం కొత్త‌గా కొలువ‌య్యారు. ఈ ఏడాది కాలంలో చూస్తే పంచాయితీల నుంచి 2000 కోట్ల రూపాయ‌లను జ‌గ‌న్ ప్ర‌భుత్వం దారి మ‌ళ్లించింది. ఏడాదిగా కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రూ.1245 కోట్లు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో ఇంటి న‌ల్లా, ఇత‌ర ప‌న్నుల‌ను వ‌సూలు చేయాల‌ని హుకుం జారీ చేయ‌డంతో పంచ‌యితీల్లో ఆ నిధులు కూడా జ‌మ అయ్యాయి. అయితే ఈ నిధుల‌న్నీకూడా ఖాతాల నుంచి మాయ‌మ‌వ‌డంతో స‌ర్పంచులు హ‌తాశుల‌య్యారు. ఆర్థిక సంఘం నిధుల‌ను విద్యుత్ ఛార్జీల కింద రెండు విడ‌త‌లుగా రాష్ట్ర ప్ర‌భుత్వం తీసేసుకుంది. ఇవి కాక 2021-22 సంవ‌త్సారానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడ‌త నిధులు దాదాపు 960 కోట్ల రూపాయ‌లు కేంద్రం నుంచి మార్చినెలాఖ‌రులోగానే విడుద‌ల కావాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ నిధుల‌ను కేంద్రం ఇచ్చిందా, ఒక‌వేళ ఇచ్చినా రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌య‌ట పెట్ట‌డం లేదా అనే సందిగ్ఘ‌త స‌ర్పంచుల‌లో నెల‌కొని ఉంది. నిధుల విష‌యంలో ఇంత‌టి గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో చాలా మంది సర్పంచులు గ్రామాల్లో ఎలాంటి ప‌నులు చేప‌ట్ట‌డానికి కూడా వీలు కాకుండా ఉంది. మ‌ర‌మ్మ‌తుల లాంటి కొన్ని అత్య‌వ‌స‌ర ప‌నుల‌ను స‌ర్పంచులు త‌మ సొంత ఖ‌ర్చుతో చేయిస్తున్నారు. అయితే ఆ బిల్లుల బ‌కాయిలు ఎప్పుడు వ‌సూలు అవుతాయో కూడా తెలియ‌ని దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో కొత్త‌గా కొలువైన సర్పంచ్‌లు ఉన్నారు.
* ఇది సైబ‌ర్ నేర‌మే…
“ఒక‌రి ఖాతాలోని నిధుల‌ను వేరొక‌రు దారి మ‌ళ్లించ‌డం సైబ‌ర్ నేర‌మైతే, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఆ నేరానికే పాల్ప‌డుతున్న‌ట్టు లెఖ్ఖ‌…” అంటూ స‌ర్పంచ్‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ గ‌డ్డు ప‌రిస్థితుల‌కు రాష్ట్ర వ్యాపంగా ఉదాహ‌ర‌ణ‌లు కోకొల్ల‌లు. కృష్ణా జిల్లా కంకిపాడు మండ‌లం ఉప్పులూరు పంచాయితీలో 60 ల‌క్షల రూపాయ‌లు ఒక్కాసారిగా మాయం అయ్యాయి. దాంతో అక్క‌డి మ‌హిళా స‌ర్పంచ్ ప్ర‌జ‌ల విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతున్నారు. అలాగే ప్ర‌సాదంపాడులో రూ. 15 ల‌క్ష‌లు ఖాళీ అయ్యాయి. విద్యుత్ ఛార్జీల‌ బ‌కాయిల కింద రూ.75 ల‌క్ష‌ల‌ను మ‌ళ్లించ‌డంతో ఇప్పుడక్క‌డ తాగునీటి కోసం త‌ల‌పెట్టిన బోర్ల ప‌నులు ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యాయి. క‌ర్నూలు జిల్లా కోడుమూరులో రూ. 90 ల‌క్ష‌లు మామ‌మ‌య్యాయి. క‌డ‌ప జిల్లా మెరుగుడిలో రూ.8.4 ల‌క్ష‌ల‌ను మ‌ళ్లించ‌డంతో అక్క‌డ సిబ్బందికి జీతాలు సైతం చెల్లించ‌లేని ప‌రిస్థితి. అలాగే ప్ర‌కాశం జిల్లా వీర‌న్న‌పాలెంలో రూ. 22.98 ల‌క్ష‌లు ఖాళీ అయ్యాయి. తూర్పుగోదావ‌రి జిల్లా మ‌ల్కిపురం మండ‌లం కేస‌న‌ప‌ల్లిలో రోడ్ల కోసం కేటాయించిన రూ.3.5 ల‌క్ష‌ల‌ను తీసేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉండ‌డంతో చాలా మంది స‌ర్పంచులు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఆందోళ‌న‌ల‌కు దిగారు. కొందరు భిక్షాట‌న చేశారు. కొంద‌రు ఆర్టీసీ బ‌స్సులెక్కి జోలె ప‌ట్టి త‌మ ప‌రిస్థితిని ప్ర‌జ‌ల‌కు చెబుతున్నారు. కొంద‌రు స‌ర్పంచులు ఈ దుస్థితిని వివ‌రిస్తూ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ‌లు రాయ‌డానికి పూనుకున్నారు. పంచాయితీల్లోనే కాకుండా కొన్ని మండ‌ల ప‌రిష‌త్‌ల ఖాతాల్లోంచి కూడా నిధులు మాయ‌మ‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. చీరాల నియోజ‌క‌వ‌ర్గంలోని వేట‌పాలెం మండ‌లంలో సాధార‌ణ నిధులు రూ.1.4 కోట్లు, ఆర్థిక సంఘం నిధులు రూ. 70 ల‌క్ష‌లు మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు ఉండ‌గా ఏప్రిల్ 1న ఖాళీ అయ్యియి. ఇలాగే బ‌ల్లికుర‌వ‌లో రూ. 2.88 ల‌క్ష‌లు, మార్టూరు మండలంలో రూ. 85 ల‌క్ష‌లు, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని బాప‌ట్ల‌లో రూ.1.78 కోట్లు దారి మ‌ళ్ల‌డం హ‌తాశుల‌ను చేసింది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనంత‌పురం జిల్లాలో కొంద‌రు స‌ర్పంచులు ఏకంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.
మ‌రో వైపు రాష్ట్ర ప్ర‌భుత్వం పంచాయితీల స్థానంలో గ్రామ స‌చివాల‌యాల‌ను, స‌ర్పంచ్‌ల స్థానంలో స‌చివాల‌య కార్య‌ద‌ర్శుల‌ను, వార్డు స‌భ్యుల స్థానంలో వాలంటీర్ల‌ను ఏర్పాటుచేసి స‌మాంత‌ర వ్య‌వ‌స్థ‌ను నెల‌కొల్పింది.
అయితే ఈ గ్రామ స‌చివాల‌యాల‌పై స‌ర్పంచ్‌ల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ‌, నియంత్రణ అధికారాల‌ను లేకుండా చేసింది. దాంతో గ్రామాల్లో ప‌రిపాల‌న ప‌ర‌మైన‌, నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన గంద‌రగోళం అడుగ‌డుగునా ఏర్ప‌డుతోంది.
* ఇదేం తీరు జ‌గ‌న్‌!
“మా ప్ర‌భుత్వం అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉంది. పంచాయితీల నుంచి రాజ‌ధానుల వ‌ర‌కు అధికార వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల‌నే అభివృద్ధి సాధ్య‌మవుతుంద‌ని మేం న‌మ్ముతున్నాం…” అంటూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న‌నేప‌థ్యంలో సామాన్యుల నుంచి మేధావుల వ‌ర‌కు అంద‌రూ “వికేంద్రీక‌ర‌ణ అంటే ఇదేనా?”అంటూ బాహాటంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. “ఇదేం తీరు?” అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కానీ…చెప్పేదొకటి, చేసేదొక‌టిగా ముందుకు సాగుతున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ఇవేమీ పట్టంచుకోకుండా జ‌గ‌మొండిగా త‌న పంథాలో తాను పోతూనే ఉంది.