ఈతకోటలో పేట్రేగిపోతున్న ఆక్వా మాఫియా

రావులపాలెం : పచ్చని పైరు భూముల్లో ఆక్వా రంగం కోరలు చాచి చెరువులు త్రవ్వుతుండడంతో పంటలు పండించే అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి కంటి చూపుతప్ప నోటిమాట రానిపరిస్థితులు నెలకొన్నాయి. డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామం పరిధిలో ముమ్మిడివరప్పాడుకు చేర్చి సుమారు యాభై ఎకరాలు పచ్చని పంట భూములు వరిచేలను ఇప్పుడు కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చెరువులుగా మారుస్తున్నారు. మండల, గ్రామ అధికారుల దగ్గర కొన్ని ఎకరాల భూమిని చేపల చెరువులుగా చూపించగా కొందరు అధికారులు పర్మిషన్స్ ఇచ్చేశారు. కానీ ఇక్కడ గమనించదగ్గ అంశం ఇవన్నీ కూడా ఆక్వా రొయ్యల చెరువులు. పంట పొలాల మధ్యలో, గ్రామ నివాసాలకు దగ్గరగా, ఆర్ అండ్ బి ప్రధాన రహదారి పక్కనే అనుమతులు ఎలా ఇచ్చారు అని సంబంధిత అధికారులపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రొయ్యల చెరువులకు ఉప్పునీరు అవసరం, ఉప్పు నీరు వలన చుట్టుపక్కల పంట భూములు చౌడు భూములుగా మారే ప్రమాదం ఉంది. ప్రజలకు కలిగే అనారోగ్యాలు, రాబోయే రోజుల్లో చెరువుల నుంచి వచ్చే వ్యర్ధాలు చెరువు లకు వాడే రకరకాల మందులు చుట్టుపక్కల కిలోమీటర్ వరకు పంట చేలకు, నివాస ప్రజలకు హాని కలిగించవచ్చు. ఇన్ని ఆపదలు ఉన్న ఆ చెరువులకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేది ప్రజలకు ఆశ్చర్యం కలిగించే సందేహం. సంబంధిత అధికారులను అడిగినా ప్రజలకు సమాధానం లేదని,ఉన్నత స్థాయి అధికారులను అడగండి మా చేతుల్లో ఏమీ లేదని దాటేస్తున్నారని, అధికారులు ఎవరికి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో తెలీడం లేదని, భవిష్యత్తులో భావి తరాలను కాపాడుకోవడం ఎలానో తెలియని స్థితిలో స్థానిక ప్రజలు అల్లాడుతున్నారు. చెరువు ను ఆనుకొని ఉన్న పక్క గ్రామమైన ముమ్మిడివరప్పాడు గ్రామ ప్రజలు అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా అనుమతులిచ్చారు అనే అభిప్రాయం కలిగి ఉన్నారని, తాగడానికి నీళ్లు కూడా కరువయ్యే రోజులు రాబోతున్నాయని, ఇప్పటికే కాలుష్యం ఎక్కువై ప్రజల అనారోగ్యం పాలు అవుతున్నారని, మళ్లీ ఈ ఆక్వా చెరువుల వ్యర్ధాలతో కొత్తరకమైన రోగాలను ఎదుర్కోవడానికి ప్రజల సిద్ధంగా ఉండాల్సివస్తుందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. వరి పంట పండించే రైతులు తక్కువైపోయారని, రైతే రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పే నాయకులే వరి పంట లేకుండా ఈ చెరువు న్లతో కాలుష్యంతో నిండిపోయే ఆక్వా వ్యాపారులకు అనుమతి ని ఎలా సహకరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరిచి ఈ ఆక్వా చెరువులను ఆపేయాలని, పంటచేలను కాపాడాలని కోరుతున్నారు.