వ్యాక్సిన్‌ కోసం 80 వేల కోట్లున్నాయా?

కరోనా వైరస్ వ్యాక్సిన్ సిద్ధమైతే..పంపిణీ కోసం దేశం సిద్దంగా ఉందా..80 వేల కోట్లున్నాయా అంటూ సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దిగ్గజ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వంటి కంపెనీల వ్యాక్సిన్ లు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఏడాది చివర్లో వ్యాక్సిన్ విడుదలపై అవగాహన వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో భారతదేశం వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ మార్గదర్శకాలు తదితర విషయాల్లో ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్న అంశంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  సీఈఓ అదార్ పూణావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”వచ్చే ఏడాది, దేశంలో అందరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ అందించే దిశలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చుచెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా?” అంటూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీలో మొదటి స్థానంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా ప్రశ్నించారు. శనివారం నాడు తన ట్వీట్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను ట్యాగ్ చేస్తూ ఈ ప్రశ్న అడిగారు. ”ఇండియాలోనూ, విదేశాల్లోనూ వ్యాక్సిన్ తయారుచేసేవాళ్లకు ఖర్చు, పంపిణీల విషయంలో మార్గనిర్దేశం చెయ్యాల్సి ఉంటుంది. ఇదే తరువాత మనం ఎదుర్కోబోయే పెద్ద సవాలు” అంటూ అదార్ వివరించారు. “ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.