కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో తొలి విజయం

కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణీ కొట్టింది. హైదరాబాద్‌పై కోల్‌కతా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్‌-2020లో భాగంగా శనివారం హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 143 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్ల నష్టానికి 18 ఓవర్లలో ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. కోల్‌కతా విజయంలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్(62 బంతుల్లో 70 పరుగులు) చివరి వరకు నిలకడగా ఆడి క్రీజ్‌లో పాతుకుపోయాడు. లక్ష్యం తక్కువగా ఉండడంతో మోర్గాన్‌(29 బంతుల్లో 42 పరుగులు) కూడా నెమ్మదిగా ఆడాడు. చివర్లో నటరాజన్ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన మోర్గాన్ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో మరో రెండు ఓవర్లు మిగిలుండగానే కోల్‌కతా విజయం సాధించింది. ఇదిలా ఉంటే బ్యాటింగ్, బౌలింగ్.. రెండింటిలోనూ పేలవ ప్రదర్శన చేసిన హైదరాబాద్ వరుసగా రెండో టీ20 ఓటమిపాలైంది. మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది.