మేం మనుషులం కాదా??

  • అధికారులను, పాలకులను ప్రశ్నించిన కృష్ణపల్లి చంద్రన్న కాలనీవాసులు
  • గ్రామాన్ని విభజించి పాలించడం సరికాదు
  • చంద్రన్న కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేశాకే జగనన్న కాలనీ ప్రారంభించాలి
  • జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన జనసేన పార్టీ నాయకులు

మేం మనుషులం కాదా…? మా సమస్యలు పరిష్కరించరా…?? పార్టీలు చూడని పాలనన్నారే …? ఇదేనా వైసీపీ పాలనని పార్వతీపురం మండలంలోని కృష్ణ పల్లి గ్రామానికి చెందిన చంద్రన్న కాలనీవాసులు ప్రశ్నించారు. ఆ కాలనీకి చెందిన జి.భాగ్యవతి జి.రమణమ్మ, టి.రాజేష్, డి.అనుష, బి.మంగ, కే.మంగమ్మా, ఏ.మంగ, పి.రమణమ్మ, సిహెచ్.విజయమ్మ, జే.ఆరుద్ర తదితరులు జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురు మణి, బోనెల గోవిందమ్మ, గుండ్రెడ్డి గౌరీ శంకర్రావు, చిట్లి గణేష్, అంబటి బలరాం, కర్రి మణి, వంగల దాలి నాయుడు తదితరులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ని కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017-18 సంవత్సరములో చంద్రన్న కాలనీ గ్రామంలో ఏర్పాటు చేశారన్నారు. వాటికి పునాది బిల్లు తప్ప మిగతా బిల్లు ఎంతవరకు ఇవ్వలేదన్నారు. కాలనీలో 19 ఇల్లు నిర్మించుకొని నివాసముంటే కనీస మౌలిక సౌకర్యాలు అయిన రోడ్లు, కాలువలు, విద్యుత్తు, తాగునీరు తదితర వసతులు కల్పించలేదన్నారు. వసతులు కల్పించాలని పలుమార్లు సంబంధిత పాలకులు, అధికారులు కోరినా ప్రయోజనం లేదన్నారు. నిన్న మొన్న గ్రామంలో చంద్రన్న కాలనీకి పక్కనే నిర్మించిన జగనన్న కాలనీలో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాన్నారు. ఈ విషయమై గ్రామంలో చంద్రన్న కాలనీవాసులను చూసి జగనన్న కాలనీవాసులు ఎద్దేవా చేసే పరిస్థితి నెలకొందన్నారు. గ్రామాన్ని విభజించి పాలించడం పాలకులకు, అధికారులకు తగదన్నారు. తక్షణమే చంద్రన్న కాలనీలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేసి జగనన్న కాలనీ ప్రారంభించాలని కోరారు. చంద్రన్న కాలనీవాసులు సమస్యలు పరిష్కరించమని అడిగితే తెలుగుదేశం పార్టీ వారంటూ ఏర్పాటు వాదంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ వాళ్లకే ప్రభుత్వము, అధికారులు పనిచేస్తారా..? అని ప్రశ్నించారు. తక్షణమే చంద్రన్న కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, బాధితులు పాల్గొన్నారు.