అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి

• రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి
రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు… ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరం. అనేక గ్రామాల్లో ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళనలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలి. ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలి. ముఖ్యంగా 17 శాతం మించి తేమ ఉండకూడదు అనే నిబంధన ఈ సమయంలో వర్తింపచేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి. అసని ప్రభావం వల్ల పండ్ల తోటలు, ఉద్యాన పంటలు వేసిన రైతులు కూడా దెబ్బ తిన్నారు. పంట నష్ట పరిహారాన్ని తక్షణమే లెక్కించి వాస్తవ నష్టానికి అనుగుణంగా పరిహారం ఇవ్వాలి. తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలి. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని జనసేనాని కోరారు.