ఎస్సీ, ఎస్టీలకు పంగనామాలు!

* ఉపప్రణాళిక నిధుల మళ్లింపు
* జనాభా ప్రాతిపదికను విస్మరించిన ప్రభుత్వం
* వాగ్దానాలు నెరవేర్చని జగన్‌ సర్కార్
* ఉన్న పథకాలకూ మంగళం

”నా ఎస్సీలు… నా ఎస్టీలు…” అంటూ పాదయాత్రలు చేస్తూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రేమ కురిపించినప్పుడు వాళ్లంతా మురిసిపోయారు.
ఆయన ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు బాగుపడతాయని ఆశపడ్డారు.
ఇది గతం!
జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయి మూడున్నరేళ్లు గడిచిపోయాయి. ఇంతకీ ఏం ఒరిగిందని తరచి చూసుకుంటే…
”నా ఎస్సీల నిధులు… నా ఎస్టీల నిధులు…” అనుకున్నంత స్వేచ్ఛగా తమకు దక్కాల్సిన నిధుల్ని ఆయన స్వతంత్రంగా దారి మళ్లిస్తుంటే వాళ్లంతా హతాశులవుతున్నారు. వంచనకు గురైనట్టు భగ్గుమంటున్నారు.
ఇది వర్తమానం!!
ఆ గతానికి, ఈ వర్తమానానికి మధ్య వైకాపా రాజకీయం ఉంది!
షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల ఓట్ల కోసం ప్రయోగించిన కపట ప్రేమ ఉంది!
ఏరు దాటాక తెప్ప తగలేసే దగాకోరు పాలన ఉంది!!
ఆ విషయం ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలకు స్పష్టంగా అర్థమవుతోంది.
అందుకనే వాళ్లంతా ఏక కంఠంతో అంటున్నారు…
”ఇన్నాళ్లూ సమాజం అణచివేతకు గురయ్యాం… ఇప్పుడు ప్రభుత్వ అణచివేతకు గురవుతున్నాం…” అని!!
ఆ మాటల్లో ఆవేదన అర్థం కావాలంటే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఉద్దేశించిన ఉప ప్రణాళిక గురించి తెలియాలి. ఆ ఉప ప్రణాళిక కోసం కేటాయించిన నిధులు ఎలా పక్క దారి పడుతున్నాయో అర్థమవ్వాలి.
ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా రూ.20,000 కోట్లు!
ఇన్ని వేల కోట్ల రూపాయలు నిజంగా ఎస్సీ, ఎస్టీలకు అంది ఉంటే, వాటిని సక్రమంగా వారికే ఖర్చు చేసి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ఎన్నో మౌలిక వసతులు అంది ఉండేవి. ఎన్నో తండాలలో అభివృద్ధి పనులు జరిగి ఉండేవి. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలిగేవి. మరెన్నో కుటుంబాలు ప్రయోజనం పొంది ఉండేవి. కానీ అలా జరగక పోవడానికి కారణం ఏమిటి? అన్ని వేల కోట్ల రూపాయలు ఎస్సీఎస్టీలకు అందక పోవడానికి కారణం ఏమిటి?
* పూర్వాపరాలివీ…
దేశవ్యాప్తంగా ఉండే షెడ్యూలు కులాలు, తెగల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌’ (ఎస్సీఏ) కింద ఒక విధానాన్ని 1980ల్లో తీసుకు వచ్చింది. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ బడ్డెట్ల ద్వారా కొన్ని ప్రత్యేక నిధులను కేటాయించాలి. ఆ నిధులకు జతగా కేంద్ర ప్రభుత్వం కూడా మరికొన్ని నిధులను జత చేస్తుంది. ఈ నిధులను విధిగా ఆయా తెగలు, కులాల వారి కోసం ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాలు, ఉపాధి అవకాశాల కోసం ఖర్చు చేయాలి. అలా ఈ విధానాన్ని దేశంలో మొత్తం 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం 2013లో ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ కు చట్టబద్ధత కూడా కల్పించారు. దీని ప్రకారం జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ శాఖల ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలు చేపట్టాలి. ఈ చట్టం పదేళ్ల కాలపరిమితి ముగుస్తుండడంతో దాన్ని జగన్‌ ప్రభుత్వం మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది కూడా. అయితే వాస్తవ స్థితిగతులను పరిశీలిస్తే వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏకంగా రూ. 20 వేల కోట్ల మేరకు ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు పక్కదారి పట్టాయి. అంటే ఆ మేరకు రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలు తమకు దక్కాల్సిన ప్రయోజనాలను కోల్పోయారన్నమాటే.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, నెల నెలా ఉద్యోగుల వేతనాలను సైతం కొత్త అప్పులు చేయందే చెల్లించలేని దుస్థితిలో పడిపోయిన జగన్‌ ప్రభుత్వం ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను కూడా ఓటు రాజకీయాల కోసం ఏర్పాటు చేసిన నవరత్న పథకాల కోసం దారి మళ్లించింది.
‘సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని పొడిగించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఆయా నిధులను పక్కదారి పట్టిస్తుంటే ఎస్సీఎస్టీలకు ఒరిగేదేముంటుందో జవాబు చెప్పాల’ని ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్‌ కుమార్‌, దళిత గిరిజన బడ్జెట్‌ వాచ్‌ రాష్ట్ర కన్వీనర్‌ అల్లాడి దేవ కుమార్‌, దళిత బహుజన సమైక్య యూనియన్‌ ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు వైకాపా ప్రభుత్వ వంచన పూర్వక విధానాలను తూర్పారబడుతూ ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. ”ఇది కచ్చితంగా ప్రభుత్వ అణచివేతే. కల్లబొల్లి కబుర్లతో ప్రభుత్వం మమ్మల్ని వంచించింది. ఉప ప్రణాళికకు నిధులు సరిగా కేటాయించకపోగా, కేటాయించిన వాటిని కూడా వేరే పథకాలకు మళ్లించడం దారుణం…” అంటూ వీళ్లంతా మండి పడుతున్నారు.
* వంచన జరిగిన తీరిదీ…
ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉపాధి పరంగా ఎస్సీఎస్టీలు ముందంజ వేయడానికి దోహద పడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఎస్సీఎస్టీ ఉప ప్రణాళిక నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. కేవలం ఎస్సీఎస్టీల కోసమే కేటాయించాల్సిన నిధులను వేరే ఉమ్మడి పథకాలకు వాడేస్తోంది. అలా వాడేస్తూ కూడా నవరత్న లాంటి ఆయా ఉమ్మడి పథకాల ద్వారా ఖర్చు చేసిన నిధులను ఎస్సీఎస్టీల కోసమే వినియోగించామంటూ అబద్ధపు ప్రచారం చేసుకుంటోంది. దీన్నే ఎస్సీఎస్టీ సంఘాల నేతలు బాహాటంగానే తప్పు పడుతున్నారు.
రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.4 శాతంగా ఉన్నారు. ఏటా బడ్జెట్‌ లో ఆ మేరకు సబ్‌ ప్లాన్‌ నిధులను కేటాయించాలి. మూడేళ్లుగా దానికి కోత పెడుతోంది వైకాపా ప్రభుత్వం. 2019-20లో 11 శాతం, 2020-21లో 11.9 శాతం, 2021-22లో 13.8 శాతం మాత్రమే కేటాయించింది. ఇలా ఈ మూడేళ్లలో రూ. 16 వేల కోట్లు కోత పడింది. ఎస్టీల జనాభా 5.3 శాతం ఉండగా 2019-20లో 3.7 శాతం, 2020-21లో 3.9 శాతం, 2021-22లో 4.9 శాతం కేటాయించింది. అలా ఈ మూడేళ్లలో రూ. 4 వేల కోట్ల మేరకు కోత పడింది. అంటే ఎస్సీ,ఎస్టీలకు చెందాల్సిన మొత్తం 20 వేల కోట్ల రూపాయలు వాళ్లకు అందకుండా పోయాయి. పోనీ కేటాయించిన నిధులనైనా సక్రమంగా ఖర్చు చేసిందా అంటే, అదీ లేదు. సబ్ ప్లాన్‌ చట్టం లోని నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకుంటూ ఇష్టారాజ్యంగా లెక్కలు చూపిస్తోంది. చట్టంలోని సెక్షన్‌ 11ఏ, 11బీ ప్రకారం దళిత, ఆదివాసీలు ఉండే ప్రాంతాలలో నిధులను వంద శాతం వారి కోసమే కేటాయించాలి. అంటే వారికి మాత్రమే ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చే పథకాలు, వారు నివశించే దళిత వాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు, ఇతర అభివృద్ధి పథకాలకు ఖర్చు చేయాలి. ఇక ఇతర ప్రాంతాల్లో పథకాలను అమలు చేసేటప్పుడు అక్కడ ఉండే ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికగా సబ్‌ ప్లాన్‌ నిధులను వెచ్చించవచ్చని సెక్షన్‌ 11సీ, 11డీ నిబంధనలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం సబ్‌ ప్లాన్‌ నిధులను దళిత వాడలు, ఆదివాసీల ప్రాంతాల్లో నూరుశాతం వెచ్చించక పోగా, సబ్‌ ప్లాన్‌ నిధులను వెసులుబాటు ప్రకారం వేరే పథకాలకు వాడేసుకుంటోందని ఆయా సంఘాల నేతలు భగ్గుమంటున్నారు.
వాస్తవం ఇలా ఉండగా, అందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. తమ హయాంలో 2019 నుంచి ఇంతవరకు రూ. 49,700 కోట్ల నిధులను ఖర్చు చేసినట్టు ప్రకటిస్తోంది. అయితే ఈ నిధుల్లో 90 శాతం అందరికీ వర్తించే నవరత్న పథకాలకే కేటాయించారు. ఆఖరికి పింఛన్లు, ఉపకార వేతనాలకు ఇచ్చే సాయాన్ని, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ఖర్చును కూడా ఇందులోనే చూపిస్తున్నారు. ఈ విషయాన్నే ఆయా సంఘాల నేతలు ప్రస్ఫుటంగా ప్రశ్నిస్తున్నారు. ఉప ప్రణాళిక నిధుల్ని ఏ శాఖ ద్వారా ఏ ఏ పథకాలకు కేటాయించారనే విషయాలను పారదర్శకంగా ప్రజలకు తెలియపరచాలనే నిబంధన కూడా ఎస్సీఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే జగన్‌ ప్రభుత్వం దీన్ని కూడా తుంగలో తొక్కింది.
* కపట ప్రేమకు గీటురాళ్లివిగో…
ముఖ్యమంత్రి జగన్‌ పదే పదే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం గురించి భారీగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ప్రత్యేకంగా ఏమీ చేయడం లేదనేది చేదు వాస్తవం. పైగా దశాబ్దాలుగా వారి కోసం అమలవుతున్న 27 పథకాలకు జగన్‌ ప్రభుత్వం మంగళం పాడింది.
+ నిరుపేద ఎస్సీల కోసం కేంద్రం సహకారంతో భూమి కొనుగోలు పథకాన్ని దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు అమలు చేశాయి. ఒక్కో కుటుంబం ఎకరం పొలం కొని, సాగు చేసేందుకు తోడ్పడ్డాయి. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక గ్రాంటుగా 70 శాతం రాయితీ ఇవ్వగా, జాతీయ ఎస్సీల ఆర్థిక అభివృద్ధి సంస్థ 30 శాతం రుణంగా ఇచ్చేది. మూడు దశాబ్దాలుగా వేలాది మందికి అండగా నిలిచిన ఈ పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపేసింది. 2019 బడ్జెట్‌ లో రూ.85 కోట్లు కేటాయించినా ఒక్క ఎకరమూ కొనివ్వలేదనేది కఠోర వాస్తవం.
+ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ, జాతీయ గిరిజనాభివృద్ధి సంస్థ అందించే రుణాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. కేంద్ర నిధులకు జతగా తన వాటాను కలపడం లేదు. రూ. 3 నుంచి రూ. 50 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తే వాటిలో 60 శాతం కేంద్ర సంస్థలు ఇస్తుండగా 35 శాతం నిధులను రాష్ట్రం జత చేయాలి. కానీ రాష్ట్రం తన వాటా ఇవ్వకపోగా ఆ పథకాలనే నిలిపివేసింది.
+ ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందించేందుకు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని గతంలో అమలు చేసేవారు. 2 నుంచి 10వ తరగతి వరకు పిల్లలను కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్చించేవారు. ఆ ఖర్చును ప్రభుత్వాలే భరించేవి. జగన్‌ ప్రభుత్వం ఈ పథకాన్నికేవలం 9, 10 తరగతుల వారికి మాత్రమే పరిమితం చేసింది. పైగా ఆ విద్యార్థులకు అందించాల్సిన బకాయిలను కూడా సరిగా చెల్లించడం లేదు. దాంతో లక్షలాది మంది పిల్లలకు ఈ పథకం ఫలితాలు సక్రమంగా అందడం లేదు.
+ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన విదేశీ విద్య పథకాన్ని వైకాపా ప్రభుత్వం మూడేళ్లపాటు దూరం చేసింది. ఆఖరికి వివిధ సంఘాల ఒత్తిడితో తిరిగి అమల్లోకి తెచ్చినా అర్థం పర్థం లేని కొత్త నిబంధనలతో కొర్రీలు పెడుతోంది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 15 దేశాల్లోని కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అందుకునే అవకాశం దూరమైంది. కేవలం 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాల్లో మాత్రమే సీట్లు సంపాదించాలనే నిబంధనే ఇందుకు కారణం.
+ పేదల ఆర్థికాభివృద్ధికి కీలకమైన స్వయం ఉపాధి రుణాలను సైతం వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో స్థాపించే యూనిట్‌ను బట్టి 40 నుంచి 90 శాతం వరకు రాయితీతో రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు రుణాలుగా ఇచ్చేవారు. ఏటా వేల మంది లబ్ది పొందేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక 2019లో ఈ పథకానికి 3.15 లక్షల మంది ధరకాస్తు చేసుకోగా, వీరికి ఒక్క పైసా రాయితీ రుణం ఇవ్వలేదు. అసలు ఈ ఉపాధి రుణాల ప్రక్రియనే పక్కన పెట్టేశారు.
+ గతంలో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భరోసాగా నిలిచిన స్టడీ సర్కిళ్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చింది. బ్యాంకు, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, డీఎస్సీ, గ్రూప్స్‌ తదితర పరీక్షలకు సిద్ధమయ్యే యువత వీటిలో ఉచితంగా శిక్షణ తీసుకునేది. వైకాపా ప్రభుత్వం తిరుపతి స్టడీ సర్కిల్‌ను బ్యాంకు కోచింగ్‌కు, విశాఖలోని కేంద్రాన్ని సివిల్స్‌కు, విజయవాడ కేంద్రాన్ని గ్రూప్‌ పరీక్షలకు పరిమితం చేసింది. దీనికి సాయం విజయవాడలోని శిక్షణ కేంద్రంలో భవన మరమ్మతుల పేరిట రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసింది. గతంలో ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా సివిల్స్‌ శిక్షణ అందగా వైకాపా సర్కారు వీటినీ ఎత్తివేసింది.
+ కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్రం రూ. 2.50 లక్షల వంతును ఆర్థిక సాయం చేసే పథకాన్ని కూడా జగన్‌ సర్కారు నీరుగార్చేసింది. మూడేళ్లుగా కేంద్రం అందిస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లించిన ఘనత వైకాపాదే.
వాస్తవాలు ఇలా ఉండగా తరచు ‘నా ఎస్సీలు… నా ఎస్టీలు…’ అంటూ జగన్‌ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడాన్ని ఏమనాలి?
కపట ప్రేమ అనాలి! నయవంచన అనాలి! ఓటు రాజకీయం అనాలి!