చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. తొలిసారి టీ20 వరల్డ్‌కప్ కైవసం
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు టీ20 వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా ఈ లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది.
ఆసీస్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. మార్ష్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 77 పరుగులతో అజేయంగా నిలిచాడు. వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (18 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్ ) సైతం దూకుడుగా ఆడడంతో న్యూజిలాండ్ జట్టు టైటిల్ పై ఆశలు వదులుకుంది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ కు రెండు వికెట్లు దక్కాయి.
ఇప్పటివరకు టెస్టుల్లో అగ్రపీఠం, వన్డేల్లో వరల్డ్ కప్ లు అందుకున్న ఆస్ట్రేలియాకు ఇప్పటివరకు అందని ద్రాక్షలా ఊరించిన టీ20 వరల్డ్ కప్ ఇన్నాళ్లకు దక్కింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో ఐదు పర్యాయాలు వరల్డ్ కప్ గెలిచింది. తాజాగా టీ20 ఫార్మాట్లో తొలిసారిగా విజేతగా నిలిచింది.
ఇక, 2019లో వన్డే వరల్డ్ కప్ ను త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్… ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మెట్టుపై నిరాశ పర్చింది.
ఈ మెగా టోర్నీ టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టుకు రూ.11.89 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన కివీస్ జట్టుకు రూ.5.9 కోట్లు దక్కాయి.