తక్షణమే చార్జీలు తగ్గించాలని అవనిగడ్డ జనసేన డిమాండ్

కృష్ణాజిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట జనసేన, బీజేపీ ధర్నా నిర్వహించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, గుడివాక శేషుబాబు మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందన్నారు. పేదలపై ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు, చెత్తపన్ను భారం వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.5లక్షల కోట్లు అప్పు చేసి, లక్షన్నర కోట్లు పథకాలకు ఇస్తే మూడున్నర లక్షల కోట్లు ఎక్కడని ప్రశ్నించారు. అప్పులు, ఖర్చులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా అని సీఎం జగన్మోహనరెడ్డిని ప్రశ్నించారు. ఐదు నిముషాలు నిరసనకే పోలీసులు వచ్చేశారని, ఇది పోలీసు రాజ్యమా.. రాజారెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. వైసీపీ దోపిడీ ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకలిద్దామన్నారు. ఈ అసమర్ద పాలకులు పుట్టబోయే బిడ్డపై కూడా రెండు లక్షలు అప్పు చేశారన్నారు. తక్షణమే ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు తగ్గించాలని, చెత్త పన్ను రద్దు చేయాలని జనసేన, బీజేపీ డిమాండ్ చేశారు.