బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సదా ఆచరణీయాలు

*జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో  నాదెండ్ల మనోహర్
భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది అంటే దానికి బాబాసాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆ రోజుల్లో న్యాయశాస్ర్తం చదివి కూడా దేశ సేవ కోసం ఆ వృత్తిని తృణప్రాయంగా వదిలేసిన మహానుభావుడని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతాలను పార్టీ ఏడు మూల సూత్రాల్లో పెట్టారని గుర్తు చేశారు. డా. అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు గౌరవంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఆనాడు శ్రీ అంబేద్కర్ పోరాటం చేశారు. ఆ స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నిలిపే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు.
* అహంకారంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
కులం పునాదులపై ఒక నీతినిగానీ, జాతినిగానీ నిర్మించలేమని అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన రాజ్యాంగం ద్వారా అందించిన విలువలను కాపాడుకుంటే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అలా కాకుండా పదవులు ఉన్నాయనే అహంకారంతో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే భావితరాలకు అన్యాయం చేసిన వాళ్లం అవుతాం. స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు ఎన్నో త్యాగాలు చేశారు. వారి పోరాటాల స్ఫూర్తిని భావితరాల్లో నింపాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా పద్దతులు మార్చుకొని పాలన అందిస్తే కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టిన వాళ్లం అవుతామని, అలా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాన”ని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జు నేమూరి శంకర్ గౌడ్, పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జు రాధారం రాజలింగంతో పాటు పలువురు నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


* శ్రీ నాగబాబు అధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో…
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ నాగబాబు గారు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలను ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పోతిన మహేష్, డా. పాకనాటి గౌతమ్ రాజ్, నయాబ్ కమాల్, చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, శ్రీమతి రావి సౌజన్య, నేరెళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.