బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం..

బద్వేలు ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి పోలింగ్‌ సామగ్రి మొదలుకొని బారికేడ్ల ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. అయితే ప్రజాప్రతినిధుల ఎన్నికలో కీలక భాగస్వామ్యం ఓటరుదే కనుక ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు కూడా బద్వేలు ఎన్నికల్లో ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాయి. 2019 ఎన్నికల కంటే కూడా ఈసారి అధికంగా ఓటింగ్‌ శాతం నమోదయ్యేలా అధికారులు ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో 100 శాతం పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఓటర్లలో చైతన్యం తెస్తున్న అధికారులు

బద్వేలు అసెంబ్లీకి ఉప ఎన్నిక నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. అందుకోసం కళాజాత ద్వారా పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, గోపవరం, కాశినాయన, కలసపాడు ఇలా అన్ని మండలాల్లోనూ కళా రూపాల ద్వారా ఓటు విలువ తెలియజేస్తున్నారు. ఓటే వజ్రాయుధం కనుక ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

2019లో 77.64 శాతం పోలింగ్‌

2019 సార్వత్రిక ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 77.64 శాతం పోలింగ్‌ నమోదైంది. అప్పట్లో 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 77,466 మంది, 81,394 మంది మహిళలు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో 77.64 శాతం నమోదైంది. ప్రస్తుతం బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 2,15,292 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 22 మంది ఉన్నారు.

పోలింగ్‌కు సమాయత్తం

బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి శనివారం జరిగే పోలింగ్‌కు అధికారులు సమాయత్తమవుతున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రి బద్వేలుకు తరలించారు. శుక్రవారం ఉద యం నుంచి ఎన్నికల సామగ్రిని సంబంధిత పోలింగ్‌ అధికారులకు అందజేసి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. ఎన్నికలకు విధులు కేటాయించిన పోలీసు యంత్రాంగమంతా బద్వేలు చేరుకుంది. ప్రశాంత పోలింగ్‌కు అటు పోలీసు అధికారులతోపాటు ఇటు ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.