అక్రమార్కుల చెరలో బెలగాం చెరువులు: ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు

  • రాజకీయ నాయకుని చెరలో లక్ష్మనాయుడు చెరువు
  • బడా బాబుల కబంధాలలో నలితిమివాని చెరువు (చాకలి చెరువు)
  • చోద్యం చూస్తున్న అధికారులు

పార్వతీపురం బెలగాంలోని కబ్జాకు గురవుతున్న లక్ష్మునాయుడు చెరువు, నలితిమి వాని చెరువు (చాకలి చెరువు) చెరువులను పరిరక్షించాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. ఆదివారం ఆ సమితి పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరియు జనసేన నాయకులు వంగల దాలి నాయుడు, పట్టణ అధ్యక్షులు శిగడం భాస్కర రావు, మండల అధ్యక్షులు బలగ శంకరరావు తదితరులు విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం జిల్లా కేంద్రం అయ్యాక స్థలాలకు విపరీతంగా ధరలు పెరిగాయన్నారు. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా పార్వతీపురం బెలగాం రైల్వే గేటు పక్కనే ఉన్న సర్వే నెంబర్ 550లో గల, 2.38 ఎకరాల విస్తీర్ణము 6.57 ఎకరాల ఆయ కట్టు కలిగిన లక్ష్యంనాయుడు చెరువును ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేశాడని ఆరోపించారు. దీనిలో భాగంగా చెరువులో పట్టాలను కూడా తీసుకున్నట్లు ఆరోపించారు. అలాగే రైల్వే పట్టాలు పక్కనే ఉన్న 557-2 సర్వే నెంబర్ లో గల, 3.81 ఎకరాల విస్తీర్ణం, 14.50 ఎకరాల ఆయకట్టు కలిగిన నళితిమి వాని చెరువు (చాకలి చెరువు) కూడా గత రెండు రోజులుగా మరో బడా వ్యక్తి ఆక్రమణకు పాల్పడుతున్నారన్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. తక్షణమే అక్రమార్కులు చెరనుండి ఆ రెండు చెరువులను రక్షించాలన్నారు. కళ్ళముందే చెరువులు చదును చేసి, మట్టి పోసి కబ్జా చేస్తుంటే సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, సచివాలయ అధికారులు సిబ్బంది చోద్యం చూస్తున్నారనన్నారు. చెరువులను కబ్జా చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో పార్వతీపురంలో అతి విలువైన కోట్లాది రూపాయలు విలువచేసే చెరువులు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాదారుల కబంధాల నుండి చెరువులను రక్షించి, చెరువుల ద్వారా పర్యావరణాన్ని భూగర్భ జలాలను రక్షించాలని కోరారు.