బుల్లెట్ బాబులూ జాగ్రత్త.. సౌండ్ ఎక్కువైతే భారీ ఫైన్..

బుల్లెట్‌కు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.. బుల్లెట్ బైక్ చాలామందికి ఇష్టమైన బైక్ అయినప్పటికీ ఆ బైక్ పై ప్రయాణం చేస్తే ఇతరులు ఉలిక్కిపడే పరిస్థితి ఉంటుంది. బుల్లెట్ బైక్ చేసే శబ్దం చాలామందికి చిరాకు, అసహనం తెప్పిస్తుంది. చాలామంది వాహనదారులు బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లలో మార్పులు చేసి ఆ శబ్దం మరింతగా పెరిగేలా చేస్తున్నారు. కానీ, అలా చేస్తే మీ బుల్లెట్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది.. అంతే కాదు.. జేబుకు కూడా చిల్లు పడడం ఖాయం అంటున్నారు పోలీసులు.. ఇష్టానుసారం ‘సైలెన్సర్ల’లో మార్పులు చేసి.. యథేచ్ఛగా, వేగంగా రోడ్లపై తిరుగుతూ శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్నవారిపై కొరడా ఝుళీపిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. పక్క నుంచి దూసుకెళ్తూ ఇతరును ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదులు అందడంతో.. స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ నెల 6 నుంచి 9వ తేదీ మధ్య తనిఖీలు నిర్వహించారు. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే 550 బుల్లెట్లను సీజ్ చేశారు.. సౌండ్‌ ఎక్కువ వచ్చేలా మార్చిన వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసి సీజ్ చేయడమే కాకుండా.. మళ్లీ సైలెన్సర్లను తొలగించి ఆ తర్వాత రవాణా శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు.

అయితే, ఇక్కడ పోలీసుల జరిమానా విధించడంతో పాటు.. రవాణా శాఖాధికారులు కూడా చలానాలు రాస్తున్నారు.. దీంతో.. ఒక్కో బుల్లెట్‌కు రూ.2 వేల నుంచి రూ.10 వేల మధ్య జరిమానా పడుతోంది. బుల్లెట్ బాబులు జాగ్రత్త మరి… సైలెన్సర్లలో మార్పులు చేయించి భారీ శబ్ధం వచ్చేలా చేయించారా..? వెంటనే మళ్లీ మార్పించండి.. లేకపోతే వాహనం సీజ్ అవుతుంది..