యువతలో భగవద్గీత పఠనం పెంచాలి

యువతలో భగవద్గీత పఠనం పెరిగేలా ప్రోత్సాహం అందించాలని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జీవితంలో ఏ సమస్య నుంచైనా అధిగమించడానికి, నిరాశ నిస్పృహాలను బయటపడటానికి భగవద్గీత దారిచూపుతుందన్నారు. గురువారం రాజ్‌భవన్‌ నుంచి ప్రజ్ఞాభారతి, ఇంపాక్ట్‌ ఫౌండేషన్‌ సహకారంతో సంస్కృతి భారతి నిర్వహించిన గీతా జ్ఞాన సప్తాహం ప్రారంభోత్సవంలో గవర్నర్‌ మాట్లాడారు. మహాత్మాగాంధీతోపాటు స్వామి వివేకానందతో సహా పలువురు భగవద్గీత నుంచి ప్రేరణ పొందారని గుర్తు చేశారు. గీత వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే గ్రంథమన్నారు. గీతాజ్ఞాన సప్తాహం నిర్వహించడం ద్వారా భగవద్గీత పఠనాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థలను గవర్నర్‌ అభినందించారు.