భారత్‌కు అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టిని నామినేట్‌ చేసిన బైడెన్‌

భారత్‌కు అమెరికా రాయబారిగా లాస్‌ ఏంజెల్స్‌ మేయర్‌ ఎరిక్‌ గార్సెట్టిని అగ్ర రాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్‌ చేశారు. గత అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హయాంలో భారత రాయబారిగా సేవలందించిన కెన్నెత్‌ జస్టర్‌ స్థానానికి నామినేట్‌ చేసినట్లు సెనేట్‌ ధ్రువీకరించింది. ఈ వారంలో జస్టర్‌ను కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌లో ప్రత్యేక విధికి నియమించారు. ఇతర దేశాల రాయబారులతో పాటు ఆయన పేరును కూడా నామినేట్‌ చేశారు. 2013 నుండి లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌గా ఎరిక్‌ వ్యవహరిస్తున్నారని, 12 ఏళ్ల పాటు సిటీ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్నారని శ్వేత సౌధం తెలిపింది. పశ్చిమంలో ఉన్న రద్దీగా ఉంటే కంటైనర్‌ పోర్టును మేయర్‌గా పర్యవేక్షించేవారు. మూడు దశాబ్దాల అనంతంరం తిరిగి అమెరికా గడ్డపై వేసవి ఒలంపిక్‌ క్రీడలను తీసుకువచ్చేందుకు ఆయన కృషి చేశారు. ఆయన ప్రస్తుతం దేశంలో రెండవ అత్యంత రద్దీగా ఉండే రవాణా ఏజెన్సీ లాస్‌ఏంజెల్స్‌ మెట్రోకు అధ్యక్షత వహిస్తున్నారు. పారిస్‌ ఒప్పందంలో అమెరికాను భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు.