రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని జగన్ రెడ్డే: ఆళ్ళ హరి

  • కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్ ను ఢిల్లీలో వేలం వేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసు
  • కాపులు ఎప్పుడో అంబటి రాంబాబుని కులం నుంచి వెలేశారు
  • సత్తెనపల్లిలోనే అంబటికి రాజకీయ సమాధి
  • పవన్ కళ్యాణ్ తోనే కాపులకు , అణగారిన వర్గాలకు మహర్దశ
  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు తిరోగమనంలో పయనిస్తున్నాయని ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని జగన్ రెడ్డేనని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. కాపులకు పట్టిన శని పవన్ కళ్యాణ్ అంటూ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవినీతి కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్ ను ఢిల్లీలో వేలం వేస్తున్నదేవరో రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారన్నారు. ఇన్నాళ్లు తమ రాజకీయ స్వార్ధం కోసం అన్ని పార్టీలు కాపుల్ని బానిసలుగా చూస్తూ వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ రాకతో కాపులకు, అణగారిన వర్గాలకు మహర్దశ రానుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం దిశగా వెళ్తున్న పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విషం కక్కటం దుర్మార్గమన్నారు. బానిసలుగా ఉన్న కులాలు పాలించే స్థాయికి వస్తే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. రెడ్లకు నేను బానిసను అన్న అంబటిని కాపు జాతి ఎప్పుడో కులం నుంచి వెలేసిందన్నారు. జగన్ బూట్లు నాకుతూ కాపులపై కారుకూతలు కూస్తే అంబటికి కాపు యువత తగినరీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపల్లె ప్రజలను మోసం చేసి సత్తెనపల్లిలో మకాం వేసిన అంబటికి స్థానికుల చేతిలో రాజకీయ సంహారం తప్పదన్నారు. సత్తెనపల్లిలోని సత్తెమ్మ సాక్షిగా సత్తు రూపాయలా అంబటి మిగిలిపోయారన్నారు. అంబటి లాంటి నేతల వల్ల సమాజానికి ఉపయోగం లేదు, కులానికి ప్రయోజనం లేదు, మహిళలకు రక్షణా లేదని దుయ్యబట్టారు. అంబటి వల్ల ఆయన్ని కొనుక్కున్న జగన్ రెడ్డికి మినహా ఎవరికి లాభం లేదన్నారు. వైఎస్సార్ మరణానికి కారణమని చెప్పిన రిలయన్స్ కంపెనీకి చెందిన వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయించటం వెనుక ఎన్ని కోట్లు చేతులు మారాయో రాజకీయ అంపశయ్యపై ఉన్న రాంబాబు చెప్పాలన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఎంత ధరకు అమ్ముకున్నారో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రాంబాబు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కు జగన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రక్తాన్ని చెమటగా మార్చి పేదలకు పంచిపెట్టే పవన్ కళ్యాణ్ కు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేదల రక్తాన్ని తాగే జగన్ కు పోలికే లేదన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఊహించటానికే భయపడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజ్ఞులైన ప్రజలు రాష్ట్రంలో రాజ్యాధికార మార్పు కోరుకుంటున్నారని, అందుకే పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారని ఆళ్ళ హరి అన్నారు.