వేలకోట్ల నష్టం – వేదనతో రైతులోకం

*12 జిల్లాల్లో అతివృష్టి… కర్నూలు జిల్లాలో కరవు
*13 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
*కోల్పోయిన పంట విలువ రూ.3300 కోట్లుగా అంచనా

నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలు రైతులను నిలువునా ముంచాయి. 12 జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.30,000 నుంచి రూ.70,000 దాకా నష్టం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం చెల్లింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 12 జిల్లాల్లో 13.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.3,300 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద 12.21 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు దెబ్బతినగా, లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆహార పంటలకు రూ.2,780 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.510 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల వారీగా చూసుకుంటే కడప జిల్లాలో అత్యధికంగా 4.44 లక్షల ఎకరాల్లో ఆహార, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అనంతపురం జిల్లాలో 2.87 లక్షల ఎకరాల్లో వేరుసెనగ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాలో 1.76 లక్షల ఎకరాలు, గుంటూరు జిల్లాలో 1.44 లక్షల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 75,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 65,000 ఎకరాల్లో పంట పాడైపోయింది. దీంతో దిక్కుతోచని లక్షలాది రైతులు ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

*6.10 లక్షల ఎకరాల వరి వరదపాలు
రాష్ట్రంలో 6.10 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలు, గాలులకు వరి పంట నేల వాలింది. వరి కంకులు మొలకలెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షాలు, వరదలకు వరి, వేరుసెగన, మొక్కజొన్న, పత్తి, మిరప, మినుము, ఉల్లి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క కడప జిల్లాలోనే అధిక వర్షాలు, వరదలకు 2 లక్షల ఎకరాల్లో సెగన పంట కుళ్లి పోయింది. ఎకరాకు రూ.10,000 నష్టం వాటిల్లింది. ఈ పంటలను ఇంకా ఈ క్రాప్ కూడా చేయలేదు. దీంతో పరిహారం అందుతుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

*మిరప పంటకు అధిక వర్షాల దెబ్బ

గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 1.70 లక్షల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతింది. అధిక వర్షాలకు తామర పురుగు, జెమినీ వైరస్ తోడు కావడంతో రైతులు మిర్చి పొలాలను దున్ని వేస్తున్నారు. అధిక వర్షాల వల్ల తామర పురుగు అదుపు కావడం లేదని రైతులు చెబుతున్నారు. మిర్చి సాగుకు ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.70 నుంచి రూ.90 వేలు ఖర్చు చేశారు. అనంతపురం జిల్లాలో అధిక వర్షాలకు మిర్చి పంటలు ఉరకేసి పోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రత్నామ్నాయ పంటలు వేసుకునేందుకు రాయితీ ధరలకు విత్తనాలు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.

*ధాన్యం కొనుగోలు నిబంధనలు సడలించాలి

రాష్ట్రంలో 6.10 లక్షల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా ప్రాంతాల్లో కోతకు వచ్చిన వరి పంట నీట మునగడం, బురదలో పడిపోవడంతో ధాన్యం మొలకెత్తి రంగు మారింది. రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు సడలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి ఉదారంగా ఆదుకోవాలని రైతులు విజ్ఙప్తి చేస్తున్నారు.

*కర్నూలు జిల్లాలో అనావృష్టి

రాష్ట్రంలోని 12 జిల్లాలను అధిక వర్షాలు ముంచెత్తగా కర్నూలులో అనావృష్టి నెలకొంది. కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో ఖరీఫ్ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తి, మిర్చి, ఉల్లి రైతులు ఎకరాకు రూ.10,000 నుంచి రూ.50,000 దాకా నష్టాలను చవిచూశారు. కర్నూలు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

*ఎకరాకు రూ.30 వేల పరిహారానికి వినతి

అధిక వర్షాలు, వరదలకు నష్టపోయిన 12 జిల్లాల రైతులతోపాటు, కరవు బారిన పడిన కర్నూలు జిల్లా రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆహార పంటలకు ఎకరాకు రూ.30,000, ఉద్యాన, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50,000 చొప్పున పరిహారం చెల్లించాలని వారు కోరారు. రబీ సెనగ పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, కనీసం ఈ క్రాప్ కూడా పూర్తి చేయలేదని వారు తెలిపారు. పంట నష్ట పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.