నేటితో ముగియనున్న బోనాలు: కాసేపట్లో అమ్మవారికి తొలి బోనం పమర్పణ

ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో నగరంలో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం 5 గంటలకు అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 8 గంటలకు తొలి బోనం సమర్పించనున్నారు.. బోనాల జారత కోసం కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ప్రతి భక్తుడు మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకున్నారు ఆలయ అధికారులు. చివరి ఆదివారం కావడంతో దాదాపు 2 వేలకుపైగా ఆలయాల్లో ఆషాఢ మాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి మహంకాళి, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, కార్వాన్‌ దర్బార్ మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నారు. ఇక సోమవారం నాడు పలు ఆలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. పలహార బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల పూర్తికానున్నాయి.

పాతబస్తీలో బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చార్మినార్‌, మీర్‌చౌక్‌, ఫలక్‌నుమా, బహదూర్‌పుర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ అమలులో ఉండనున్నాయి.