బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ..!

• టోఫెల్ ఒప్పందం సీఎం కార్యాలయం పరిధిలోనే సాగింది
• సంబంధిత మంత్రి శ్రీ బొత్సకు తెలియకుండా ఒప్పందం జరిగి ఉండొచ్చు
• ఆయన 54 పేజీల ఒప్పందాన్ని చదివి వస్తే చర్చకు మేం సిద్ధం
• ప్రజాధనం లూటీ విషయంలో వైసీపీ రూటే సపరేటు
• జనసేన పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతుంది
• వైసీపీ… ఓ తాడు బొంగరం లేని పార్టీ
• ఆ పార్టీకి అధ్యక్షుడెవరో తెలీదు… క్రియాశీలక సభ్యులూ లేరు
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడాను. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి ఒప్పందాన్ని చదివి, విషయాన్ని అధ్యయనం చేసి వస్తే చర్చించేందుకు మేము సిద్ధమే. ఆ ఒప్పందంలో పేర్కొన్న ప్రతి పేరా, క్లాజుపై చర్చించేందుకు, దీనిలో ప్రభుత్వ అసమర్ధత, ప్రజాధనం దుర్వినియోగంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సవాల్ విసిరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ ప్రతి అంశం మీదా స్పందించే ముందు నిజానిజాలు తెలుసుకొని, పూర్తి ఆధారాలతో మాట్లాడుతుంది. కేవలం సమస్య గురించి మాట్లాడటమే కాకుండా, దానికి పరిష్కార మార్గాలను చూపేలా మాట్లాడటం అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు సూచించిన మార్గం. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ప్రజోపయోగ విషయాల మీద స్పందిస్తుంది. ప్రజాధనం వృథా, అవినీతి అంశాలను బయటపెడుతుంది. విపక్ష పార్టీగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాల మీద ప్రశ్నించే బాధ్యత మాపైన ఉంది. జరుగుతున్న పొరపాట్ల మీద ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేం మాట్లాడుతాం.
• లొసుగులమయం టోఫెల్ ఒప్పందం
విద్యా శాఖలో సంస్కరణల పేరుతో, పేద విద్యార్థులకు మేలు చేస్తున్నామన్న పేరుతో వైసీపీ ప్రభుత్వం 2024 నుంచి 2027 వరకు తీసుకురావాలని భావిస్తున్న టోఫెల్ పరీక్ష విధానంలోని లొసుగుల గురించి మేం మాట్లాడాం. దీనిలో ఎంత మేర ప్రజాధనం వృథా అవుతుందనేది లెక్కలతో వివరించాం. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధారాలు లేకుండా మాట్లాడుతోందని, పూర్తిగా అవగతం చేసుకొని మాట్లాడాలని చెప్పారు. మేం అన్నీ పరిశీలించి.. అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడుతున్నాం అనేది మంత్రి గారు తెలుసుకోవాలి. 3 రోజుల క్రితం టోఫెల్ పరీక్ష కోసం ఈ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి తెలిసిన వివరాలను ప్రజల ముందు తెలియజేశాం. ఎలాంటి ప్రయోజనం లేని పరీక్ష కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టడం సబబు కాదని చెప్పాం. దీనిపై సరైన సమాధానం చెప్పలేక, సరిదిద్దుకునే శ్రద్ధ లేక సీనియర్ మంత్రి శ్రీ బొత్స జనసేన మీద ఇష్టానుసారం మాట్లాడారు. దీనిపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుపెడుతున్నాం.
• పాపం.. మంత్రికే చెప్పలేదు
ఏదైనా ప్రైవేటు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే ముందు ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్, రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్, ప్రైస్ డిస్కవరీ అనేవి ముఖ్యం. కానీ ఈ ఒప్పందంలో అవేవీ కనిపించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో చాలా హడావుడిగా ఈ ఒప్పందం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కీలకమైన అంశాలను వదిలేసి, పెద్ద స్థాయి వ్యక్తులు దీనిలో ఉండి ముందుకు నడిపించినట్లు అర్ధం అవుతోంది. పాపం విద్యాశాఖ మంత్రికి కూడా ఈ విషయం చెప్పి ఉండకపోవచ్చు. మీరు చెప్పిన ప్రతి మాటకు మా దగ్గర లెక్క ఉంది.
• బొత్స గారు… మీ మాటలకు ఇవే మా సమాధానాలు..
మంత్రి మాట: విద్యాశాఖ మంత్రి హోదాలో శ్రీ బొత్స గారు ప్రెస్ మీట్లో రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న కేవలం 20,70,876 మంది విద్యార్థులకే పరీక్ష నిర్వహిస్తున్నాం అని చెప్పారు. దీనిలో ప్రతిభ చూపే 80 వేల మందికి జూనియర్ లెవెల్ పరీక్ష నిర్వహిస్తామని, జనసేన చెప్పిన లెక్క తప్పు అని మంత్రి చెబుతున్నారు.
జనసేన సమాధానం: రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్ష ఒప్పందంలో 2023-24 విద్యా సంవత్సరానికి గ్యారంటెడ్ మినిమం పర్చేజ్ అనే క్లాజును ఒప్పందంలో పెట్టారు. అంటే ఎట్టి పరిస్థితులోనూ కచ్చితంగా తగిన మొత్తంలో పిల్లలంతా దీనిలో ఉండాలని ఈ క్లాజులో ఉంది. ఒప్పందంలోని ఛాప్టర్ నంబరు 3లోని ఆర్టికల్ నంబరు 1లో టోఫెల్ గ్యారెంటెడ్ మినిమం పర్చేజ్ కింద 2023-24 విద్యా సంవత్సరంలో 21,87,876 మంది విద్యార్థులు, 2024-25లో 25,40,440, 2025-26లో 29, 28,000, 2026-27లో 29,32,000 మొత్తంగా 1,06,00,312 మంది కోసం ఒప్పందం చేసుకున్నారు.
మంత్రి మాట: 80 వేల మందికి మాత్రమే జూనియర్ లెవెల్ పరీక్ష పెడుతున్నాం అన్నారు. కోటి మందికి పైగా విద్యార్థులకు పరీక్ష లేదని ఆయన వాదిస్తున్నారు.
జనసేన సమాధానం: మంత్రి చెబుతున్నట్లు కేవలం 80 వేల మందిని మాత్రమే జూనియర్ లెవెల్ పరీక్షకు తీసుకుంటే మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి..? అసలు ప్రతిభ చూపే వారు 80 వేల మంది మాత్రమే ఉంటారని మీకెవరు చెప్పారు..? ప్రభుత్వ బడుల్లో 3వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు 30 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే మీరు 80 వేల మందికి జూనియర్ లెవల్ అని ఏ పద్ధతిన గుర్తించారు..?
మంత్రి మాట: ఈ ప్రొగ్రాం కింద కేవలం రూ.146 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నాం అని చెబుతున్నారు. విద్యార్థికి సుమారు రూ.7.50 పైసలు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నారు.
జనసేన సమాధానం: కేవలం ఈ టోఫెల్ ప్రొగ్రాం కింద రూ.146 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నాం అన్న మాటకు మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు బాధ్యత వహించాలి. ప్రభుత్వం తరఫున ఈ మాటకు కట్టుబడతారా..? ఒప్పందం కోసం విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తే… సగటున ఒక్కో విద్యార్థికి కేవలం ఫీజు రుసుము కింద రూ.1000 చెల్లించాల్సి వస్తుందని నివేదిక ఇచ్చారు. రూ.540 నుంచి రూ.2500 వరకు ఫీజులు కట్టాల్సి వస్తుందని, సగటున ఒక్కో విద్యార్థికి రూ.వేయి వరకు రుసుము అవుతుందని చెప్పడం నిజం కాదా..?
మంత్రి మాట: ఈ పరీక్ష మొత్తం ఆన్ లైన్ లో జరుగుతుంది. దీనికి పెద్ద ఖర్చు ఉండదు. ప్రత్యేకంగా దీనిపై మెటీరియల్ అక్కర్లేదు. పిల్లలకు మొత్తం ఆన్ లైన్ లోనే పాఠాలుంటాయి.
జనసేన సమాధానం: ఒప్పందంలోని ఛాప్టర్ నంబరు 1లోని పేరా 15.1ను పరిశీలిస్తే ఈటీఎస్ చెప్పిన అసలు విషయాలు తెలుస్తాయి. మెటీరియల్ ఎలా ఉండాలి..? ఏ పేపర్ దానికి వాడాలి…? ఏ యంత్రంతో ముద్రించాలి, ఏ ప్రింటర్ తో ఒప్పందం చేసుకోవాలనేది స్పష్టంగా ఉంది. దీన్ని పూర్తిగా ఈటీఎస్ చెప్పిన సూచనల మేరకు ముద్రించాల్సి ఉంటుంది. మరి దీనికి ఖర్చు లేదని చెబుతారేంటి..? అంటే ఈ సమాచారం అసలు ముఖ్యమంత్రి కార్యాలయం మీకు అందించలేదా..?
• అసలు ఈ టోఫెల్ పరీక్ష ఎందుకు అన్నదే మా ప్రశ్న
విద్యార్థులకు ఎందుకు పనికిరాని టోఫెల్ పరీక్షను విద్యార్థులపై బలవంతంగా ఎందుకు రుద్దుతున్నారు అనేది మా ప్రశ్న. వారిని మరింత మానసిక ఒత్తిడికి గురి చేయడం సరికాదు అనేది మేం మొదటి నుంచి చెబుతున్నాం. ఒప్పందంలోనే ఈటీఎస్ సంస్థ టోఫెల్ పరీక్ష స్కోరు కేవలం రెండేళ్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, తర్వాత దాన్ని భద్రపరచలేమని స్పష్టం చేసింది. అసలు టోఫెల్ పరీక్ష అనేది డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఈ పరీక్ష రాస్తారు. అసలు ఇది 3వ తరగతి విద్యార్థులకు ఎందుకు అనేది మా ప్రశ్న. ఇది ఎలా విద్యార్థులకు ఉపయోగపడుతుంది..? ఇది బలవంతంగా పిల్లలపై ఎందుకు రుద్దుతున్నారు. అసలు ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 40 వేల మంది మాత్రమే విదేశాలకు చదువుల కోసం వెళ్లారు. మరి ఇంతమందికి మాత్రమే అవకాశం ఉంటే అసలు అందరికీ ఈ పరీక్ష ఎందుకు..? అనేది మా ప్రాథమిక ప్రశ్న. దీనికి మంత్రిగా సమాధానం చెప్పండి. అసలు పాఠశాలల్లో తగినంత మంది ఆంగ్ల ఉపాధ్యాయులు లేరని ప్రభుత్వమే ఒప్పుకుంది కదా..? గతంలో ప్రభుత్వమే ఆంగ్ల మాధ్యమం తీసుకురావాలని చూసినప్పుడు ఆంగ్ల మాధ్యమ టీచర్లకు శిక్షణ ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు అత్యవసరంగా ఆంగ్లంలోని టోఫెల్ పరీక్షకు విద్యార్థులు ఎలా సన్నద్ధం అవుతారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అనవసరం అయిన ఈ పరీక్షకు మీరు చెప్పినట్లే అంత మొత్తం ఎందుకు ప్రైవేటు సంస్థకు కట్టబెడుతున్నారో వివరించాలి. గత విద్యా సంవత్సరం 3.88 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాప్ అవుట్ అయితే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఇప్పుడు బలవంతంగా ఈ పరీక్షలు నిర్వహిస్తే మరింత మంది ఒత్తిడిని భరించలేక పాఠశాలలు మధ్యలోనే వదిలి వేసే అవకాశం ఉంది.
• కేంద్ర ఎన్నికల సంఘం తిప్పి కొట్టింది
సీనియర్ మంత్రి అయి ఉండి జనసేన పార్టీని విమర్శించడం విచిత్రంగా అనిపించింది. అసలు వైసీపీ అనే పార్టీకి ఎవరు పూర్తి స్థాయి అధ్యక్షుడో తెలీదు. ఎన్నికల సంఘం సైతం దీనిపై వైసీపీకి ఉత్తరం రాసింది. పాపం.. జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకొని తీర్మానం చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం తిప్పి కొట్టింది. శాశ్వత అధ్యక్షుడి పదవే లేదని, వెంటనే దాన్ని సవరించాలని వైసీపీకి ఎన్నికల సంఘం మొట్టికాయలు వేసింది. అలాంటి పార్టీకి అసలు క్రియాశీలక సభ్యులే లేరు… సభ్యత్వం లేదు. ఓ తాడు బొంగరం లేని పార్టీ. ఓ అధ్యక్షుడే లేని పార్టీ అయిన వైసీపీ నాయకులు కూడా జనసేనను అంటుంటే నవ్వు వస్తోంది. మంత్రి పూర్తిస్థాయిలో ఒప్పందం చదివి మరోసారి మాట్లాడాలని కోరుతున్నాం. ప్రతిసారీ పేదల పేరును ఉపయోగించి, ఇష్టానుసారం నిధులను దుర్వినియోగం చేస్తున్న ఈ వైసీపీ నాయకులు ప్రజాకోర్టులో సమాధానం చెప్పే సమయం వచ్చింది’’ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పార్టీ చేనేత వికాసవిభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, అక్కల రామ్మోహనరావు, బేతపూడి విజయశేఖర్, డా.పాకనాటి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.