పాలన చేతగాక, మానసిక స్థితి సరిగా లేక… సీఎం దిగజారి మాట్లాడుతున్నారు

• శ్రీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేస్తూ మహిళల్ని కించపరుస్తున్నారు
• ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణలు చెప్పాలి
• స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వీర మహిళలతో కార్యక్రమాలు
• నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి మహిళలే సమాధానం చెప్పాలి
• ప్రభుత్వ వేదికలపై ప్రతిపక్షాలపై విమర్శలు సిగ్గుచేటు
• రుషికొండ విధ్వంసం వెనుక అసలు కుట్ర బయటపడింది
• చీకటి జీవోలతో ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం
• దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన అని చెప్పగలరా..?
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత కంటే దిగజారిపోడు అనుకున్న ప్రతిసారీ మా నమ్మకాన్ని వమ్ము చేస్తూనే ఉన్నాడు. మేము ఊహించిన దాని కంటే దారుణంగా దిగజారిపోయి జగన్ మాట్లాడుతున్నాడు. భార్య అనే బంధాన్ని కించపరిచేలా సంబోధించే విషయంలో కానీ, పెళ్లి గురించి మాట్లాడే సమయంలో కానీ మహిళల మనోభావాలు, ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి తీరు జుగుప్సాకరంగా ఉంది. రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న ఈ వైసీపీ ముఖ్యమంత్రి ప్రతిసారీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల విషయంలో మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తోంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రతి మాటకు పరిధి ఉంటుంది. అలాగే ప్రతి వ్యాఖ్యను ఎదుర్కోవడానికి కూడా సహనం ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ప్రతిసారి బుద్ధి వస్తుందని ఇన్ని రోజులు ఎదురు చూశాం. ముఖ్యమంత్రి ప్రసంగం స్ఫూర్తివంతంగా ఉండాలి. రాష్ట్రం గురించి వివరించాలి. సమస్యలను పరిష్కరిస్తూ ఎలా ముందుకు వెళతాం అనేది చెప్పాలి. కానీ వైసీపీ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రికి పాలన చేతగాక, మానసిక స్థితి సరిగాలేక ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వ పాలనలో ఎంత మంది నష్టపోయారో, ఎంత మంది ఉపాధి లేక వలస వెళ్లిపోయారో లెక్క లేదు.
• జగన్ సంతకం చేస్తే రూ.కోట్లలో అవినీతి
ప్రజాధనంతో నిర్వహించే సభలో రాష్ట్ర భవిష్యత్తుపైనా, యువతకు కల్పించాల్సిన అవకాశాలు, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల గురించి మాట్లాడాల్సిన జగన్, వాటిని వదిలేసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందులోనూ మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తీరును ఖండిస్తున్నాం.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ ల గురించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం విచిత్రంగా ఉంది. సినిమా షూటింగ్ అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి శ్రమ, ఆయన చేసే పని. అక్కడ సంపాదించిన డబ్బుతోనే నిజాయతీగా ప్రజల కోసం పార్టీ నడిపిస్తున్న గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీలా రూ.వేల కోట్లు అక్రమ ధనం, అవినీతి ధనం ఆయన దగ్గర లేదు. ప్రతి రూపాయి కష్టపడి, షూటింగ్ లో స్వేదం చిందించి ప్రభుత్వానికి పన్ను కట్టి మరీ సంపాదించిందే. ఆ డబ్బుతోనే ఆయన రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్నారు. ఆయన సినిమా షూటింగుల గురించి సీఎంకు ఎందుకు..? శ్రీ పవన్ కళ్యాణ్ గారు సినిమా కెరీర్ లో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. జగన్ మాదిరి సంతకం చేసి అవినీతి చేయలేరు. టోఫెల్ పరీక్ష పేరుతో ఒప్పందం చేసుకొని రూ.వేల కోట్ల అవినీతి చేశారు. ముఖ్యమంత్రి ఒక హద్దు దాటి ప్రతిపక్షాలపై చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మా పార్టీ నాయకులు కూడా పలుమార్లు ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలపై ఆవేశపడి, ఏదైనా చేయాలి అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారే వారిని వద్దని వారిస్తారు. వారు చేసిన తప్పు మనం కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పేవారు. అయితే ముఖ్యమంత్రి తీరులో మార్పు వస్తుందని ఇంతకాలం ఎదురుచూశాం. రాన్రాను ఆయన తీరు మరింత దారుణంగా దిగజారిపోతోంది.
• అహంకారంతో పేట్రేగిపోతున్నారు
సీఎం ప్రసంగించే వేదిక ముందు మహిళలు ఉన్నారా.. పిల్లలు ఉన్నారా అనేది చూడకుండా ఇష్టానుసారం, నోటికి ఎంత వస్తే అంత సీఎం మాట్లాడుతున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని కించపరుస్తున్నారు. దీనిపై కచ్చితంగా వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతాం. త్వరలో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా చేయబోయే కార్యక్రమాలతో ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా ప్రయత్నం చేస్తాం. మహిళల పట్ల ఎంత హుందాగా నడుచుకోవాలో, ఎంత గౌరవంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాలో తెలిసేలా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిసారీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూనే, మహిళలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సీఎం భంగం కలిగిస్తున్నారు. దీనిపై మహిళలే ఆయనకు సద్భుద్ధి కలిగించేలా కార్యక్రమాలను రూపొందిస్తాం. మహిళలే ఈ ముఖ్యమంత్రికి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. మహిళల ఆత్మగౌరవం దిగజార్చేలా మాట్లాడుతున్న ఈ ముఖ్యమంత్రి వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ప్రతిసారి ఎందుకు మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారో ఆయన వివరణ ఇవ్వాలి. సీఎంను చూస్తూ ఆయన బాటలోనే జిల్లాల్లోని వైసీపీ నేతలు సైతం విపక్ష నాయకులు, మహిళలపై ఇష్టానుసారం విరుచుకుపడుతున్నారు. చెప్పుకోలేని విధంగా దూషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి 5 నెలలే సమయం ఉంది. అహంకారంతో పేట్రేగిపోతున్న వైసీపీ నాయకులకు తగిన విధంగా గుణపాఠం చెబుతాం.
• దొంగ లెక్కలు.. చీకటి జీవోలు
వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి రాష్ట్ర ప్రజలను దొంగ లెక్కలు, చీకటి జీవోలతో మోసం చేస్తోంది. ప్రజలకు తెలియకుండా రహస్యంగా చీకటి జీవోలను తీసుకొస్తూ, వారికి అర్ధం కాని లెక్కలతోనే పాలన సాగిస్తున్నారు. అక్టోబరు 6వ తేదీన ముఖ్యమంత్రి ఢిల్లీలో పర్యటించి, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో సమావేశంలో రాష్ట్రంలో గతంలో 5 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2 జిల్లాల్లో మాత్రమే ఈ ప్రభావం ఉందని చెప్పుకొచ్చాడు. నిన్న ప్రభుత్వం జారీ చేసిన జీవోలో మాత్రం 5 జిల్లాల్లో మావోయిస్టు ప్రభావం ఉందని చెప్పారు. విశాఖలో పరిపాలన రాజధాని అంటూ రోజుకో మంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెబుతుంటారు.. అదిగో సెప్టెంబరు అంటే ఇదిగో దసరా నుంచి ప్రారంభం అంటూ కథలు చెబుతారు. మీరు ఇచ్చిన ప్రారంభాలు.. తేదీల అమలు మాటే లేదు. మన్యం ప్రాంతంలో 1057 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, దీంతోనే నక్సల్స్ ప్రభావం తగ్గిందని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో గిరిజన ప్రాంతంలో జరిగింది కేవలం అక్రమ బాక్సైడ్ మైనింగ్ మాత్రమే. ఆయా ప్రాంతాల్లో కామ్రేడ్లు ఉండబట్టే కాస్త అయినా వైసీపీ దాష్టీకాలకు అడ్డుకట్ట పడింది. లేకుంటే మొత్తం కొండలు, గుట్టలు ఖాళీ చేసేవారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ.. రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలు పర్యాటకం కోసం అంటూ ఇంతకాలం మభ్యపెట్టి, దబాయించిన వైసీపీ నేతలు ఇప్పుడు అసలు నిజం బయట పెట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం కోసం రుషికొండను బోడిగుండు చేసి… అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. రూ.500 కోట్లతో అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు ఎందుకు..? అంత లగ్జరీగా క్యాంపు కార్యాలయ నిర్మాణం దేనికోసమో ప్రజలకు చెప్పాలి. కేవలం సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించి, అదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మరో కట్టుకథ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అదే ఉత్తరాంధ్ర అభివృద్ధి అని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నాను.. విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా అక్కడి నుంచే పరిపాలిస్తామని ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ఎన్నో వనరులతో కూడిన మన్యం రెండు జిల్లాల నుంచి వైసీపీ పాలనలో 3053 కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. రాష్ట్ర మొత్తం మీద 3.31 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. మన్యంలో మహా విధ్వంసం చేస్తున్న వైసీపీ నాయకులు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చూపుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దీనిపై కచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. మేం సవాల్ చేస్తున్నాం.. జగనన్న కాలనీలకు వెళ్దాం రండీ.. ఎన్ని ఇళ్లు కట్టారో తేల్చుకుందాం రండి. 7 లక్షల ఇళ్లు కట్టామని చెబుతున్నారు.. వాటిలో పూర్తయిన ఇళ్లు ఎన్నో పరిశీలిద్దాం రండీ.
• శ్రీ అమిత్ షాతో శ్రీ లోకేష్ భేటీని స్వాగతిస్తున్నాం
జనసేన ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ. కచ్చితంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే మాటకు కట్టుబడి ఉన్నాం. కేంద్ర హోమ్ శాఖమంత్రి శ్రీ అమిత్ షా గారితో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి భేటీని స్వాగతిస్తున్నాం. సమావేశంలో రాష్ట్ర అంశాలు, రాజకీయ అంశాల గురించి మా దృష్టికి రాలేదు. కచ్చితంగా రాష్ట్రంలో వైసీపీయేతర పక్షాలన్నీ ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనేది మా ఆకాంక్ష. జనసేన- తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీల సమావేశాలు విజయదశమి తర్వాత నుంచి పుంజుకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సంయుక్తంగా చర్చించి ముందుకు వెళతాం. అలాగే జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుంది. పొత్తులు, సర్దుబాట్ల విషయం పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు’’ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ నేతలు శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ నేరెళ్ళ సురేశ్, శ్రీ అక్కల రామ్మోహన రావు, శ్రీ డి.వరప్రసాద్, శ్రీ బండి రామకృష్ణ, శ్రీ బేతపూడి విజయశేఖర్, శ్రీ ప్రకాష్ పాల్గొన్నారు.