అగ్రనాయకత్వానికి శుభాకాంక్షలు

• విజేతలందరికీ అభినందనలు
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసిన బీజేపీ అగ్ర నాయకత్వానికి, విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు నా శుభాభినందనలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేడు కౌటింగ్ జరిగిన నాలుగు రాష్ట్రాలకుగాను మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం భవిష్యత్తు ఫలితాలకు గొప్ప దిక్సూచిగా భావిస్తున్నాను. రాజస్థాన్ లో వెల్లువలా సాధించిన విజయం, మధ్యప్రదేశ్ లో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్ గఢ్ రాష్ట్రంలో పూర్వపు వైభవం పుణికి పుచ్చుకోవడం బీజేపీ అగ్ర నాయకుల దూరదృష్టి, పటిష్టమైన వ్యూహం, ముఖ్యంగా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడమే కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, హోంశాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారు దేశానికి అందిస్తున్న విశేష సేవలు ఈ విజయానికి దోహదపడ్డాయని భావిస్తూ వారిరువురికీ ప్రత్యేకంగా గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జె.పి.నడ్డా గారికి, ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్ధులకు అభినందనలు తెలియచేస్తున్నాను.
• తెలంగాణ ఓటర్లకు ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికలలో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులతోపాటు విజేతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. బీజేపీ – జనసేన కూటమిని గౌరవించి, ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పోటీ జనసేనకు ఒక ప్రత్యేక మైలు రాయిగా నేను భావిస్తున్నాను. ఇదే నేలపై జనసేన ఆవిర్భావం జరిగిన సంగతి మీకు తెలిసిందే. ఆనాటికి రమారమి 18 శాతం ఓటు బలం ఉన్న సంగతి విజ్ఞులైన వారికి విదితమే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రాజకీయ వెసులుబాటు కోసం ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా నిలిచిన జనసేన తన తొలి అడుగును ఈ ఎన్నికలతో ప్రారంభించాలని సంకల్పించి అభ్యర్థులను బరిలో నిలిపాము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో యువత త్యాగాలు సమున్నతమైనవిగా నేను భావించాను. అందువల్ల ఈ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కొందరు యువకులకు అవకాశం కల్పించి పోటీకి నిలబెట్టాను. వారిలో ఎక్కువ మంది బడుగు బలహీనవర్గాలకు చెందిన చిన్న మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు. వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా నేను వారిని పోటీకి నిలిపాను. నా నిర్ణయాన్ని అభినందించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పోటీ జనసేన రాజకీయ నాయకత్వ నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. ఏ లక్ష్యంతో అయితే తెలంగాణ ఆవిర్భవించిందో ఆ లక్ష్య సాధనకు జనసేన అవిరళ కృషి జరుపుతుందని ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సాధికారతకు వారిని ముఖ్యమంత్రి పీఠంపై నిలిపే వరకు జనసేన కృషి నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రజలెప్పుడూ మేలైన తీర్పునే ఇస్తారని నేను విశ్వసిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవశం చేసుకున్న కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నాను. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందజేస్తాం. ఈ ఎన్నికలలో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ నా పక్షాన, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.