బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది: పవన్ కళ్యాణ్

భారతీయ చలనచిత్ర సంగీత విభాగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ స్వరకర్త బప్పీలహరి కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. బప్పీ లహరి పాటలు హిందీ సంగీత ప్రియులకు ఎంత చిరపరిచితమో… తెలుగునాట కూడా ఆయన స్వరపరచిన గీతాలు అంతే ప్రాచుర్యం పొందాయి. డిస్కో తరహా పాటలతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు. డిస్కో డ్యాన్సర్ చిత్రంలోని ‘జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా ఆజా..’ పాట నేటికీ రష్యాతో సహా తూర్పు ఐరోపా దేశాల్లో వినిపిస్తుంది. అక్కడి పార్టీల్లో ఈ పాటకు యువత డ్యాన్స్ చేస్తుంటారు. డిస్కో డ్యాన్సర్ హీరో మిథున్ చక్రవర్తి ఆ దేశాలవాళ్ళకు పరిచయమయ్యారంటే అది బప్పీ లహరి బాణీ ప్రభావమే. గాయకుడిగానూ ఈతరం వాళ్ళను శ్రీ బప్పీ లహరి మెప్పించారు. తెలుగు చిత్రాలకు ఎన్నో చక్కటి గీతాలు ఇచ్చారు, అన్నయ్య చిరంజీవి గారు నటించిన ‘స్టేట్ రౌడీ’, ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు శ్రోతలను ఆకట్టుకొన్నాయి. సినీ రంగంలో బప్పీ లహరి బాణీ ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. బప్పీ లహరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.