పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ముఖ్యమంత్రి జగన్ కు లేదు: ఆదాడ, జమ్ము

విజయనగరం, రాష్ట్రంలో ఆత్మహత్యల చేసుకున్న కౌలు రైతులకు అండగా నిలుస్తూ.. జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో 30 కోట్ల రూపాయలను నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన 3000 కుటుంబాలకు లక్ష చొప్పున తన వంతుగా చిన్న వెసులుబాటును కల్పించేలా సహాయం చేస్తుంటే.. దాన్ని కుడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విమర్శించడం తన కుసంస్కారాన్ని తెలియజేస్తుందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, జమ్ము ఆదినారాయణ అన్నారు.

బుధవారం ఉదయం కలెక్టరేట్ కూడలిలో ఆదాడ మోహనరావు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వారిరువురు నాయకులు మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ చేస్తున్న సహాయానికి అభినందించాల్సింది పోయి దత్త పుత్రుడు అంటూ మాట్లాడి, అసలు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ సహాయం పొందని ఒక్క కుటుంబాన్ని అయినా గుర్తించారా అని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదంగా ఉందని, ఇచ్చే పరిహారాన్ని తప్పించుకోవాలని అనేక మార్గాలను అన్వేషించి పరిహారం పొందాల్సిన కౌలు రైతు కుటుంబాలను లెక్కల్లో నుంచి తప్పించి ఆ డబ్బుతో నాయకుల జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలన్నిటిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు.