ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి ది విచిత్ర ధోరణి… కపట మనస్తత్వం: మీడియా సమావేశంలో నాదెండ్ల

*సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకొంటారు
*సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారు
*సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి?
*విశాఖ రమ్మని పిలుస్తున్న ముఖ్యమంత్రికి అమరావతి గుర్తుకు రాలేదా?
*సినిమా టిక్కెట్ల కోసం కేటాయించిన సమయాన్ని సమస్యల పరిష్కారం కోసం కేటాయించరా?
*సామాన్యుడి అర్జీకి సీఎం కార్యాలయం స్పందించే పరిస్థితి లేదు.
*ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందల కోట్లు మాయం చేశారు.
*పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లబ్ది కోసం మాట్లాడే వ్యక్తి కాదు.
*మంగళగిరిలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

సమస్యను సృష్టించడంలో తానే ప్రధాన కారకుడై, దాన్ని జఠిలం చేసి చివరికి తనను బతిమలాడుకునే పరిస్థితి తీసుకురావడం, దానికో అద్భుతమైన పబ్లిసిటీ స్టంట్లు చేయడం ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి కే చెల్లిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది విచిత్ర ధోరణి, కపట మనస్తత్వం. అని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయన్నారు. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటని జనసేన పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. ఉద్యోగుల విషయంలోనూ కించపరచేలా వ్యవహరించారు.. కాబట్టే ఉద్యోగ సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి అన్నారు. సర్వశాఖలు అప్పగించిన ఓ మహాసలహాదారుడు ఆధ్వర్యంలోనూ చర్చలు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున మీడియాతో ఆయన మాట్లాడతారు అన్నారు. సినిమా టిక్కట్ల కోసం కేటాయించిన సమయాన్ని అమరావతి రైతుల కోసం, గోతులమయంగా మారిన రహదారుల కోసం, రోడ్డెక్కిన రైతాంగం కోసం ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ మాట్లాడుతూ.. “నిన్న సినీ ప్రముఖుల్ని పిలిపించి ముఖ్యమంత్రి గారు పబ్లిసిటీ ఎక్సర్ సైజ్ చేశారు. మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనుకుంటే పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి. నిన్నటి రోజున సినీ ప్రముఖుల్ని ముఖ్యమంత్రి నివాసానికి పిలిపించారు. మనది చాలా టాలెంట్ కలిగిన ఇండస్ట్రీ. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన వ్యక్తులు వారు. యువకులు ఒక హీరోని చూసి మన ప్రయాణం ఇలా ఉండాలి అని మారిన పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా లోపల జరిగిన కొన్ని సంభాషణలు వింటుంటే చాలా బాధ కలుగుతోంది.

*అమరావతి రైతులతోనూ మాట్లాడవచ్చు కదా

టాలెంట్ ఉన్న వ్యక్తుల్ని మీరు పిలిచి విశాఖలో ఏర్పాటు చేసుకుందాం రండి అన్నప్పుడు మీకు అమరావతి గుర్తుకు రాలేదా? అమరావతి సమస్య సమస్య కాదా? పక్కనే ఉన్న రైతుల్ని పిలిపించుకుని రాజధాని సమస్యపై మాట్లాడలేరా? ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా మంది త్యాగాలు చేశారు. అటువంటి వ్యక్తుల్ని ఎందుకు ఆహ్వానించలేదు. ఎందుకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించలేదు. ఇది కేవలం ఈ ముఖ్యమంత్రి పని తీరు. సొంత పబ్లిసిటీ కోసం వ్యవస్థలని దుర్వినియోగం చేస్తూ, అక్కడ ఉన్న పెద్ద మనుషుల్ని లొంగ దీసుకుని, భయపెట్టి సమస్య పరిష్కారం నేనే చేస్తాను. నా దగ్గరకు వచ్చి మీరు పూర్తి స్థాయిలో తగ్గాలి అన్న మెసేజ్ తీసుకువెళ్తున్నారు. ఆయనేదో మహారాజులా.. అంతా ఆయన చేతుల మీదుగా జరిగినట్టు చిత్రిస్తున్నారు. జరుగుతున్న పరిస్థితులు చూస్తే బాధ కలిగిస్తోంది. ఇండస్ట్రీలో డిస్టిబ్యూటర్లు లేరా? ఎగ్జిబిటర్లు లేరా? థియేటర్ యజమానులు లేరా? ఎందుకు మీరు వాళ్లతో కూర్చొని చర్చించలేదు. ఎందుకు క్షేత్ర స్థాయిల్లో జరుగుతున్న మీటింగుల్లో మీరు పాలుపంచుకోలేదు. ముఖ్యమంత్రి గారు కేవలం హీరోలతోనే కూర్చుంటారా? మిగిలిన వాళ్లను కూడా పిలిపించి మాట్లాడరా? ఎందుకు మీరు ఈ పబ్లిసిటీ ఎక్సర్ సైజులు చేస్తున్నారు.

*ముఖ్యమంత్రి ధోరణి యువతను నిరాశపరుస్తోంది.

మార్పు కోసం ఎదురు చూస్తున్న యువతను నిరాశ పర్చే ధోరణిని ఈ ప్రభుత్వం అవలంబిస్తోంది. ఇసుక పాలసీ గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా? విద్య, వైద్యపరమైన సమస్యల గురించి చర్చించారా? అన్నింటికన్నా ప్రధాన సమస్యగా సినిమా టిక్కెట్ల వ్యవహారాన్ని చిత్రించి హడావిడిగా అందర్ని పిలిపించుకుని సమస్య పరిష్కారం నా చేతుల మీదుగా జరగాల్సిందే అంటున్నారు. పరిపాలన అందరికీ సమానంగా జరగాలి. సామాన్యుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆర్టీ ఇస్తే కార్యాలయం ఏ విధంగా స్పందిస్తోంది? ఆరోగ్యశ్రీకి సంబంధించి లక్షల మందికి వైద్య సదుపాయం అందించాల్సిన పరిస్థితుల్లో మీ కార్యాలయం ఎందుకు పని చేయడం లేదు? ముఖ్యమంత్రి సహాయ నిధిలో రూ. వందల కోట్ల స్కామ్ ఎందుకు జరిగింది? బాధ్యులు ఎవరు అని జనసేన ప్రశ్నిస్తోంది.

*అందర్నీ కించపరచడమే ప్రభుత్వ అజెండా

దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ మెజారిటీతో వచ్చిన ప్రభుత్వం ప్రజల పక్షాన, రైతులపక్షాన, సామాన్యుల పక్షాన నిలచి మంచి పాలన అందిస్తారని అంతా ఎదురు చూశారు. అలా జరగలేదు. సమస్య సృష్టించడంలో ముఖ్యమంత్రే ప్రధాన కారకుడు. సమస్యల పరిష్కారం కోసం అనేక మంది సలహాదారుల్ని ఏర్పాటు చేసుకున్నారు. మంత్రుల్ని పెట్టుకున్నారు. అధికారుల్ని తనతో పెట్టుకున్నారు. అంతిమంగా సమస్య పరిష్కరించారు… అందరినీ కించపరిచే విధంగా వ్యవహరించడమే ఈ ప్రభుత్వం విధానం.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వైసీపీ ప్రభుత్వం సృష్టించడం వల్లే వచ్చాయి. సర్వ శాఖల్నీ కలిగిన ఒక మహా సలహాదారు ఆయన ఆధ్వర్యంలోనే అన్ని చర్చలు జరిగాయి. ప్రభుత్వం అంటే అధికారులు, ఉద్యోగులతో కలసి పని చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో పాలసీలు, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, పరిపాలన అన్నీ కింద స్థాయి వరకు వెళ్లడంలో ఉద్యోగులు భాగస్వాములని మీకు తెలియలేదా? రెండు నెలలుగా వారిని హింసించి, కించపరిచారు.

*రైతు భరోసా కేంద్రాలు పెద్ద స్కామ్

రైతుల విషయంలోనూ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. యూరియా సరఫరా లేక సాగు కోసం రైతులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రైతు భరోసా కేంద్రాలు అనేవి పెద్ద స్కామ్. ఒక దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి గ్రామంలో విత్తనాల సరఫరా నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ఎక్కడికి వెళ్లనవరం లేదన్న ముఖ్యమంత్రి గారు ఎందుకు యూరియా కోసం రైతులు రోడ్డెక్కి పరిస్థితి తీసుకువచ్చారు. గుండెల మీద చెయ్యేసుకుని నిజాయతీగా చెప్పండి.. యూరియా సరఫరా చేస్తే రైతులు ఎందుకు ఆర్.బి.కె.ల దగ్గర ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? అధికారులతో స్టేట్మెంట్లు ఇప్పించి ఎక్కడా కొరత లేదు అద్భుతంగా ఉందని చెప్పిస్తే అది నిజం అయిపోతుందా? రాష్ట్రంలో మనకి సమస్యలు చాలా ఉన్నాయి.. నిజాయతీగా బాధ్యతగా పనిచేస్తే పరిష్కారం అయ్యేవి. ఈ రోజుకి పోలవరం కోసం ఎదురు చూస్తున్నాం. ఆర్ధిక వనరులు సరిగా లేవు. వైసీపీ ప్రభుత్వం కేంద్రంతో బలంగా మాట్లాడి అధికంగా నిధులను ఎందుకు తీసుకురాలేకపోతోంది. దీన్ని కచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి కపట మనస్తత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఆయ్న మాట్లాడే ఏ అంశంలోనూ నిజాయతీ లేదు. ప్రజల ముందుకు రారు. మూడేళ్లలో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే. ఎందుకు పరిపాలన చేయలేకపోతున్నారంటి ఆయన ధోరణి కారణం.

•అందరికీ ఉపాధి బాగుండాలన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచన

టిడ్కో గృహాల గురించి, లే అవుట్లు చేసిన జగనన్న కాలనీలను పరిశీలించేందుకు త్వరలో క్షేత్ర స్థాయిలో పర్యటించబోతున్నాం, ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు మేలు జరిగేలా సామాన్యుడికి అంద టులో ఉండే విధంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తుంది.

పవన్ కళ్యాణ్ కోట్లు వదులుకోవడానికి కూడా వెనుకాడని మనిషి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ కోసం అందరికీ ఉపాది బాగుండాలన్న పెద్ద మనసుతోనే ఆయన మాట్లాడారు. వ్యక్తిగత లబ్ది కోసం ఏ రోజు ఆయన మాట్లాడరు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆయన నిలబడతారు” అన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కార్యక్రమాల నిర్వహణ విభాగం చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, రాష్ట్ర కార్యదర్శులు నయూబ్ కమాల్, అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.