బటన్లు నొక్కడం మినహా ఏమీ చేతకాని ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి

• బటన్లు నొక్కడం వల్ల ప్రజలకు ఒరిగిందేంటి?
• కౌలు రైతుల్ని సంక్షేమానికి దూరంగా పెట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇది
• రైతుల కోసం నిలబడిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
• సీఎం సొంత నియోజకవర్గంలో 26 మంది రైతులకు సాయంచేశారు
• తలెత్తుకోలేకే ముఖ్యమంత్రి పరదాల మాటున తిరుగుతున్నారు
• కడియపులంకలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీ నాదెండ్ల మనోహర్

బటన్లు నొక్కడం మినహా ఏమీ చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి బటన్లు నొక్కడం వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన ఉపయోగం ఏంటో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం భరోసా అందని పరిస్థితుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు కులాన్ని అంటగట్టిన వ్యక్తి శ్రీ జగన్ రెడ్డి.. కౌలు రైతుల్ని దూరంగాపెట్టిన దుర్మార్గ ప్రభుత్వం ఇదన్నారు. అలాంటి పరిస్థితుల్లో రైతుల కోసం నిలబడిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారని అన్నారు. వర్థమాన రాజకీయాల్లో రైతుల కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆదర్శవంతంగా ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు ఆయన అని తెలిపారు. కష్టకాలంలో జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్టు చెప్పారు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ద్వారా పులివెందుల సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనసేన పార్టీ బలమైన అడుగు వేసిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియపులంకలో పార్టీ నాయకులు శ్రీ రత్నం అయ్యప్ప నర్సరీలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. పలువురు కార్యకర్తలకు స్వయంగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పారదర్శకంగా ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం అదే కోవకు వస్తుంది. కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అంతా అద్భుతంగా పని చేశారు. ఇప్పుడు మూడో విడత ఈ కార్యక్రమానికి సాంకేతికత జోడించి క్షణాల్లో సభ్యత్వం ఇవ్వగలుగుతున్నాం. ఎంతో మంది కార్యకర్తలు ఆదర్శవంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. 6,900 మంది వాలంటీర్లు అద్భుతంగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈసారి రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. పులివెందుల సహా రాష్ట్రంలో అన్ని చోట్లా మన పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారు.
• రెండు రోజుల్లో రూ.90 లక్షల ఆర్ధిక సాయం
గత రెండు రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంపిన ఆర్ధిక సాయం రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందచేస్తూ భరోసా నింపుతూ వస్తున్నాం. జిల్లా నాయకత్వం మొత్తం కదిలి వెళ్లి మీ బిడ్డల భవిష్యత్తుకు, చదువులకు కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా నింపడం ఎంతో తృప్తినిచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కుటుంబానికి చెక్కు ఇస్తున్న సందర్భంలో ఆమె చెప్పిన విషయం కలచివేసింది. భర్త మరణించిన గంటకు బిడ్డ పుడితే.. అప్పటి నుంచి ఎలాంటి భరోసా లేకుండా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ కార్యక్రమం ఎంతో ధైర్యాన్ని నింపుతుంది. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం కోసం ఎంతో మంది నిజాయతీగా కష్టపడుతున్నారు. రాజానగరంలో ఓ మహిళ 2,300 సభ్యత్వాలు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ రత్నం అయ్యప్ప, అనంతపురంలో శ్రీ భవానీ రవికుమార్ లాంటి వారు వెయ్యికిపైగా సభ్యత్వాలు చేశారు. 30 మంది 500 చొప్పున సభ్యత్వాలు నమోదు చేశారు. అమలాపురానికి చెందిన టాక్సీ డ్రైవర్ శ్రీ వెంకటేష్ 800 మందితో సభ్యత్వాలు నమోదు చేయించారు. వీరంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానాన్ని బలపర్చేందుకు ముందుకు వచ్చారు. క్రియాశీలక సభ్యత్వం కేవలం బీమా పథకం కాదు. మన కుటుంబంలో సభ్యుడికి ఆపద కలిగినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పార్టీలో అందర్నీ సమానంగా చూసే విధంగా, ఒక భరోసా ఇవ్వడం కోసం ఆలోచించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. భారత దేశంలో ఏ పార్టీ కూడా రూ. 5 లక్షల బీమా ఇచ్చిన సందర్భాలు లేవు. ఉభయగోదావరి జిల్లాల్లో రెండు రోజుల్లో రూ. 90 లక్షలు బాధిత కుటుంబాలకు అందించి భరోసా నింపాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏడాది తనవంతు కోటి రూపాయలు ఈ కార్యక్రమానికి అందచేశారు. గత ఏడాది రెండు కోట్లు ఇచ్చారు. రాజకీయాల్లో ఇలాంటి నాయకుడిని మనం ఎక్కడా చూడలేం.
• ముఖం చూపలేకే ముఖ్యమంత్రి పరదాల మాటున తిరుగుతున్నారు
ఎన్నికల ముందు ముద్దులు పెట్టి వాగ్దానాలు ఇస్తారు. ఎన్నికల తర్వాత కనబడకుండా పోతారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రతి గింజా కొంటానన్న ముఖ్యమంత్రి రూ.6,300 కోట్లతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాలు కేవలం దళారులు, వైసీపీ నాయకుల పునరావాస కేంద్రాలుగా మారాయి. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం భరోసా అందని పరిస్థితుల్లో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏదైనా చేయాలన్న నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి రూ. 5 కోట్ల సొంత డబ్బు వెచ్చించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది 30 సంవత్సరాల వయసు వారే కావడం గమనార్హం. ఈ ప్రభుత్వం మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన 26 మంది రైతులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందిస్తే ఈ ముఖ్యమంత్రి ఎలా తలెత్తుకు తిరుగుతారు. అందుకే పరదాలు కట్టుకుని ఎవరికీ కనబడకుండా తిరుగుతున్నారు.
• రాజమండ్రి కవాతుని మించి విజయవంతం చేద్దాం
ఈ పరిస్థితుల్లో నిజాయతీతో కూడిన రాజకీయ ప్రస్థానానికి మనమంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. మార్చి 14వ తేదీ మచిలీపట్నం వేదికగా జరగబోయే పార్టీ 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ద్వారా మీరు పార్టీకి అండగా నిలబడండి. రాజమండ్రి కవాతు స్థాయిలో దేశంలోనే ఓ అద్భుత కార్యక్రమంగా నిర్వహించుకుందాం. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నాం.. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ఎలాంటి ప్రణాళికలు రూపొందించబోతోంది అనే అంశాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభలో తెలియచేస్తారు. ప్రతి జనసైనికుడు, వీర మహిళ సభకు తరలిరావాలి” అన్నారు.
• జనసేనలోకి చేరికలు
ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గం, ఏడిద కొత్తూరు గ్రామానికి చెందిన పలువురు ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. రైతు భరోసా యాత్ర తర్వాత ఏడిద కొత్తూరు గ్రామం మొత్తం జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు ఈ సందర్భంగా శ్రీ లీలాకృష్ణ తెలిపారు. ఆ గ్రామం నుంచి వచ్చిన పలువురికి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ ముత్తా శశిధర్ తో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, పట్టణాధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.