విశాఖ పెట్టుబడుల సదస్సు అంకెల గారడీ… అభూత కల్పన…

• ప్రారంభమైన కంపెనీలనే మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపారు
• సదస్సుకి వచ్చిన రిలయన్స్ అధినేత శ్రీ ముకేష్ అంబానీ ఏం హామీ ఇచ్చారు?
• ఈ అభూత కల్పనల్ని జనసేన పార్టీ తప్పుబడుతోంది
• రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులంటూ అబద్దాలు చెబుతున్నారు
• రాజధాని లేని రాష్ట్రం.. నాయకత్వం లేని ముఖ్యమంత్రి పెట్టుబడిదారుల్లో నమ్మకం ఎలా కలిగిస్తారు
• సీ ఫుడ్ జాబితాలో ఏకంగా గుడ్లు కూడా కలిపేసి భారీగా ఎగుమతులు చేశామంటూ లెక్కలు చెబుతున్నారు
• ఐటీ శాఖ మంత్రి కోడి గుడ్డు కథలకు ఇది కొనసాగింపు
• రాజమండ్రి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు అంతా అంకెల గారడీ.. ప్రజల్ని మోసం చేసే అభూత కల్పనల కార్యక్రమం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చేసిన హడావిడి మొత్తం మోసపూరితమన్నారు. ప్రజల్ని మభ్యపెట్టడం, అంకెల గారడీతో యువతలో ఆశలు రేకెత్తేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలను జనసేన పార్టీ పక్షాన తప్పుబడుతున్నామని తెలిపారు. ఎన్నికల ముందు జగన్ వస్తేనే జాబ్స్ వస్తాయని నమ్మించి యువతను మోసం చేశారు. రాజధాని లేని రాష్ట్రం.. నాయకత్వం లేని ముఖ్యమంత్రి.. ఎవ్వరిలో నమ్మకం కలిగిస్తారని ప్రశ్నించారు. అమరావతి కలను చంపేశారని, ఈ ప్రభుత్వం మీద పెట్టుబడిదారులకు ఏ విధంగా నమ్మకం కలుగుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సు.. రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెబితే రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో రెండు రోజులపాటు ఆ సదస్సుపై రాజకీయపరమైన విమర్శలు చేయరాదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ మొదటి నుంచి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని కోరుకుంటోంది. ఎన్నికల ముందు ఇతర దేశాలకు వెళ్లిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోకి ఎంతో మంది పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్లాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అలాంటి సమయంలో పారిశ్రామికవేత్తలను గౌరవించి వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని జనసేన పార్టీ ఆకాంక్షించింది. అయితే ప్రభుత్వం రెండు రోజుల పాటు రూ.175 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి అంకెల గారడీ చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది. ఎన్నికల ముందు జగన్ వస్తే ఉద్యోగాలు వస్తాయని.. పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవంతో ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తెస్తారని ప్రజలు నమ్మారు. నాలుగేళ్ల పాలనలో అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు చివర్లో ప్రజాధనం వృధా చేసి సాధించింది ఏంటి?
• ముఖ్యమంత్రి అవగానే రిలయన్స్ మీద కక్ష తీర్చుకున్నారు
శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే దేశంలోనే అతిపెద్ద కార్పోరేట్ కంపెనీ రిలయన్స్ మీద కక్ష కట్టారు. తిరుపతిలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వారు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. వారికి కేటాయించిన భూమి కూడా వెనక్కి తీసేసుకున్నారు. అదే రియలయన్స్ కి సంబంధించిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారు. మొన్న శ్రీ ముకేష్ అంబానీ విశాఖ వచ్చారు. ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ఎక్కడైనా తన ప్రసంగంలో చెప్పారా? పెట్టుబడి ప్రణాళికలు ఏమైనా చూపారా? అలాంటిదేమీ లేదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. క్లీన్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, రెన్యువబుల్ ఎనర్జీ గురించి అద్భుతంగా భారత దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా ముందుకు దూసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. హైకోర్టు ఈ విషయంలోనే కదా అక్షింతలు వేసింది. రాయలసీమలో సోలార్ ఎనర్జీ సంస్థలకు డబ్బులు చెల్లించకుండా రెండున్నరేళ్లు ఇబ్బందిపెడితే.. వారు హైకోర్టును ఆశ్రయిస్తే.. హైకోర్టు వారికి బిల్లులు క్లియర్ చేయమని చెప్పింది. అటువంటిది ఈ రోజున కొత్త ఒప్పందాలు చూపించుకుంటున్నారు. ఇందులో వేటికీ పర్యావరణ క్లియరెన్సులు లేవు. ఎగువ సీలేరు, దిగువ సీలేరుల్లోనే కేటాయింపులు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యావరణ అనుమతులు వస్తాయా? ఎవర్ని మభ్యపెడుతున్నారు? అదానీకి అక్కడ ఇచ్చేశాం.. త్వరలోనే రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటనలు చేసుకుంటుంటే వాటి గురించి ప్రస్తావించాల్సి వస్తోంది.
• ఐటీ మంత్రి కోడి గుడ్డును మర్చిపోలేకపోతున్నారు
ఐటీ శాఖ మంత్రి కోడి గుడ్డును మర్చిపోలేకపోతున్నారు. వారి శాఖ విడుదల చేసిన ప్రకటనలో సీ ఫుడ్ లో కోడి గుడ్లను కూడా కలిపేశారు. సీ ఫుడ్ అంటే చేపలు, రొయ్యలు అని మనకు తెలుసు. మరి కోడి గుడ్డు ఆ జాబితాలోకి ఎలా చేరింది? భారతదేశంలోనే సీ ఫుడ్ ఎక్స్ పోర్టులో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని చెబుతున్నారు. ఇటువంటి మంత్రులు, శాఖల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.
* ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీలను కొత్తగా చూపిస్తున్నారు
విశాఖ సదస్సుని మరింత లోతుగా చూస్తే ఫిబ్రవరిలో జరిగిన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీట్ లో ఎన్టీపీసీ రూ. లక్షా 17 వేల కోట్లు 2027 నాటికి రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని ప్రకటన చేశారు. దాన్ని పెట్టుబడుల సదస్సులో రూ.2 లక్షల 37 వేల కోట్లుగా చూపారు. టూరిజం సెక్టార్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిమిత్తం తిరుపతి, విశాఖల్లో ఒబెరాయ్ సంస్థకు ఇప్పటికే భూములు కేటాయించారు. గోడలు కూడా కట్టేశారు. విశాఖలో ఎంఓయూ చేశారనీ.. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు అని ప్రకటనలు చేస్తున్నారు. బ్లూస్టార్ సంస్థకు సంబంధించిన యూనిట్ శ్రీ సిటీ ఎస్ఈజెడ్ లో ఇప్పటికే నడుస్తోంది. వీటినీ ప్రారంభోత్సవ, ఒప్పంద జాబితాలో చూపించారు. శ్రీ సిటీ తెచ్చిన పెట్టుబడులు ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసిన 14 ప్రారంభోత్సవాల్లో 8 శ్రీ సిటీలోవి. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి చేస్తున్న ప్రయత్నం. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ కోసం నాలుగో కృష్ణున్ని తీసుకువచ్చారు. ఆ జిందాల్ వేరు. కృష్ణపట్నం జిందాల్ వేరు. వీళ్ళు రూ. 7,300 కోట్లతో కృష్ణపట్నం దగ్గర స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నామని చెప్పి రెండున్నరేళ్ల క్రితమే ఒక ఎంఓయూ చేశారు. అదే స్టీల్ ప్లాంటుని మరోసారి చూపించారు.
* షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు ముందు వెనక ఎవరున్నారు?
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ సెప్టెంబర్ 5 2022లో రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 1600 మందికి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. దాన్ని మళ్లీ మార్చి డిసెంబర్ లో అదే పెట్టుబడితో 2100 మందికి ఉపాధి అన్నారు. ఈ సంస్థకి ముందు, వెనక ఎవరున్నారు? చెప్పాలి. నిన్నటి సమ్మిట్లో మరొక్కసారి 8,850 కోట్ల పెట్టుబడితో 5050 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటన చేశారు. వాస్తవాలు ఏంటి? ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.
• మొదటి నుంచి ప్రయత్నిస్తే 10 వేల మందికి అయినా ఉపాధి దక్కేది
ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన జాబితాలో విజయవాడ అవేరా ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని ఉంది. ఇది నున్నలో ఉంటుంది. 2016లో శంకుస్థాపన చేసి 2018లో ప్రొడక్షన్ మొదలు పెట్టారు. దాన్ని నిన్న మరోసారి ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తూ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీగా ఉంటే ఖచ్చితంగా మన ప్రాంతంలో మనకి, మన బిడ్డలకు అవకాశాలు దొరుకుతాయి. ప్రభుత్వంలో చిత్తశుద్ది లేనప్పుడు. నాలుగున్నరేళ్ల నుంచి శ్రీ జగన్ రెడ్డి నిద్రపోయారు. దావోస్ లో ఇదే అదానీతో ఇంకొన్ని సంస్థలతో సంతకాలు పెట్టారు. అదేదో ఇక్కడే చేసుకునే వారు కదా. ఎందుకు ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టి 24 నెలల్లో ప్రొడక్షన్ ప్రారంభిస్తామన్నారు. గతంలో ఎందుకు ఈ విధంగా అవకాశాలు కల్పించలేకపోయారు. మీరు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రయత్నం చేస్తే కనీసం 10 వేల మందికి అయినా ఉద్యోగాలు వచ్చేవి. యువత ఉపాధి అవకాశాల కోసం ఎందుకు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. వీరి ప్రయత్నాన్ని కచ్చితంగా అంతా ప్రశ్నించాలి.
• చిత్తశుద్దితో ప్రయత్నిస్తే సహకరిస్తాం
ఒక్క రోజు సమ్మిట్ లో హేమీ హేమీలను తీసుకువచ్చి రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేస్తున్నాయని చూపించే ప్రయత్నాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలి. ముందుగా పెట్టుడిదారుల్లో నమ్మకం కలిగిస్తే ఖచ్చితంగా మెరుగైన అవకాశాలు ఉంటాయి. అందుకు తగ్గ వనరులు మనకి ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తుల గురించి మాట్లాడరు. ఐటీ ఎగుమతుల గురించి ఎవరూ మాట్లాడరు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం చివరి స్థానంలో ఉంది. మీ ప్రభుత్వం పరిపాలన మీద పెట్టుబడిదారులకు నమ్మకం ఎలా కలుగుతుంది. మీరు చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ మీకు సహకరిస్తుంది” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, పార్టీ నాయకులు శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ శ్రీ తుమ్మల రామస్వామి, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీ చెరుకూరి రామారావు, శ్రీ తేజోమూర్తుల మూర్తి, శ్రీ జామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.