వైసీపీలో వర్గపోరు తీవ్రం!

*ఎంపీ, ఎమ్మెల్యేల కీచులాటలు నిత్యకృత్యం
*అవధులు దాటుతున్న ఆధిపత్య పోరు
*చక్కదిద్దే పనిలో అధిష్టానం సతమతం

ఆంధ్రప్రదేశ్‌లోని పాలకపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, కీచులాటలు భగ్గుమంటున్నాయి. ఇటీవల కృష్ణా జిల్లా ముఖ్యపట్నం బందరులో ఈ మధ్యనే మాజీ మంత్రిగా మారిన స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ఉరఫ్‌ నాని అనుచరులకు, అక్కడిక వచ్చిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి మధ్య బహిరంగ కీచులాట సంచలనం సృష్టించింది. బందరులోని ముస్లింల ఖబరస్థాన్‌ పరిశీలనకు వెళ్లిన ఎంపీ బాలశౌరిని స్థానిక వైకాపా కార్పొరేటర్, పేర్ని నాని అనుచరుడు అస్ఘర్‌ అలీ అడ్డుకుని పరుషంగా మాట్లాడడం పార్టీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇక ముందు ఇద్దరు నేతలూ తమ అనుచరులను అదుపులో పెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ఆదేశించింది. అంతేగాక త్వరలో వారిద్దరినీ తాడేపల్లి రప్పించి మాట్లాడాలని కూడా నిర్ణయించారని తెలుస్తోంది. ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు అనేక జిల్లాల్లో అధికారపక్షంలో కనిపిస్తున్నాయి. 2019లో ఎన్నికైన తర్వాత ఇప్పుడు చాలా చురుకుగా వైఎస్సార్పీపీ ఎంపీలు (లోక్‌సభ సభ్యులు) తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో స్థానికి ఎమ్మెల్యేలు లేదా మాజీ మంత్రుల అనుచరులతో తగాదాలు తలెత్తుతున్నాయి. 2019 మే ఆఖరున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఈ పార్టీలో కీచులాటలు మొదట్లో తక్కువేనని చెప్పాలి. కాని, ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లు, లోక్‌సభ నియోజకవర్గాల్లో పట్టుకోసం, పార్టీలో ఆధిపత్యం కోసం పాలకపక్ష లోక్‌సభ సభ్యులు ఒక పక్క ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక పక్క వర్గాలుగా చీలిపోయారు. ఫలితంగా వారి అనుచరులు వీధుల్లో గొడవలకు దిగుతున్నారు. రెండేళ్ల దూరంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఉండడం…. ఏడాది ముందే ఏపీ శాసనసభ ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వ్యాపించడంతో పార్టీ చట్టసభ సభ్యుల మధ్య పెత్తనం కోసం పోరు వేగం పుంజుకుంటోంది. బాగా ప్రచారంలోకి వచ్చిన బందరు పేర్ని నాని–బాలశౌరి వివాదంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పేచీలు పదునెక్కుతున్నాయని జరుగుతున్న పలు సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.
*అనకాపల్లిలో ఆది నుంచీ రచ్చే
ఇటీవల జగన్‌ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణతో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌కు, ఆయన పార్టీకే చెందిన అనకాపల్లి లోక్‌సభ సభ్యురాలు డాక్టర్‌ బీసెట్టి వెంకట పద్మావతికి మధ్య దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచీ అనకాపల్లిలో ఆధిపత్య పోరు సాగుతోంది. మొదట్నించీ వారు తమ అధికార కార్యక్రమాలను కలిసికట్టుగా నిర్వహించకుండా సొంత అనుచరులు, కార్యకర్తలతో జరుపుకుంటున్నారు. ఒక గుడి ప్రారంభ కార్యక్రమం సందర్భంగా మంత్రి, ఎంపీ కలిసి పాల్గొన్నారు. తమ మధ్య తేడాలు లేవని బాహాటంగా చెప్పినా ఎవరి వర్గం వారిదే అన్నట్టు అనకాపల్లిలో పూర్తి పట్టుకోసం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని రాజమహేంద్రవరంలో స్థానిక అధికార పార్టీ ఎంపీ మార్గాని శ్రీభరత్‌ రామ్‌కు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మధ్య ఇటీవల ఆధిపత్యం కోసం పోటీ ఎక్కువైందని వార్తలొస్తున్నాయి. అనకాపల్లిలో మంత్రి, ఎంపీ మాదిరిగానే ఈ ఇద్దరు యువ నేతలూ అధికార వైకాపా పార్టీ కార్యక్రమాల్లో ఎవరి దారి వారదన్నట్టు చాలా కాలం వ్యవహరించారు. చివరికి పార్టీ నాయకత్వం ఆదేశంతో ఈ మధ్య కలిసి తిరుగుతున్నాగాని భరత్, రాజా మధ్య విభేదాలు తొలగిపోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇంకా రాజమహేంద్రవరం పరిధిలోని నిడదవోలు, గోపాలపురం ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ ఎంపీ భరత్‌తో సఖ్యతతో లేరు. ఎంపీని తమ కార్యక్రమాలకు పిలవకుండానే పనులు చేసుకుంటున్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధకు, స్థానిక మంత్రి పినిపె విశ్వరూప్‌ వర్గాల మధ్య కూడా విభేదాలు, కీచులాటలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. రాజమండ్రి ఎంపీ స్థానానికి పొరుగున ఉన్న ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పార్టీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌కూ, ఆయన తండ్రి, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు గతంలో ప్రాతినిధ్యం వహించిన చింతలపూడి (ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడ్‌) ఎమ్మెల్యే వీఆర్‌ ఎలిజాకు మధ్య కీచులాటలు బహిరంగ రహస్యమే. ఆరంభంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికల సమయంలో శ్రీధర్, ఎలిజాల మధ్య సహకారం సంతృప్తికర స్థాయిలో ఉండేది. ఒకే పార్టీలో ఉన్నాగాని తర్వాత వారు ఒక తాటిపై నడవడం లేదు. ఈ ఇద్దరు పాలకపక్ష చట్టసభల సభ్యుల కారణంగా ఏలూరు పరిధిలోని ప్రభుత్వ అధికారులు సైతం రెండు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారని వార్తలందుతున్నాయి. ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య వివాదం మొదట్లోనే చెప్పుకున్నాం. నాని అనుచరుడైన కార్పొరేటర్‌ అస్ఘర్‌ అలీ బందరు పట్టణంలో ఎంపీకి అడ్డుతగిలి మాట్లాడడం తీవ్ర సంచలనానికి, వివాదానికి కారణమైంది. మూడేళ్లపాటు పెద్దగా తన నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చురుకుగా పర్యటించని బాలశౌరి ఇప్పుడు నాని మాజీ మంత్రిగా మారిన బందరులో తిరగడం నాని అనుచరుల ఆగ్రహానికి దారితీసింది.
*నర్సరావుపేటలో నిత్యం రగడే
వైఎస్సార్సీపీ టికెట్‌పై మొదటిసారి నర్సరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికైన లావు శ్రీకృష్ణదేవరాయలు, చిలకలూరిపేట ఎమ్మెల్యే, తాజా మంత్రి విడదల రజని అనుచరుల మధ్య ఇటీవల వర్గపోరు వేగం పుంజుకుంది. మొదటిసారి ఎమ్మెల్యే అయిన రజని మంత్రి కాక ముందు నుంచీ తన పార్టీ యువ ఎంపీతో తన ప్రాంతంలో ఆధిపత్యం కోసం పోటీపడుతూనే ఉన్నారు. జగన్‌ కేబినెట్‌ మార్పుల్లో అనూహ్యంగా మంత్రి అవ్వడంతో రజనీ వర్గీయుల దూకుడు పెరిగింది. రజని మంత్రి కావడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఎంపీ అనుచరులు మౌనంగా భరిస్తున్నారు. రజని మంత్రి కాకముందు ఆమె వర్గీయులు పలు కార్యక్రమాల్లో కృష్ణదేవరాయలను అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. కలబడుతున్న రజనీ, లావు అనుచరులను శాంతింప చేయడానికి పోలీసులు కూడా అనేక సందర్భాల్లో జోక్యం చేసుకున్నారు. ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి పదవి రజని అనుచరులకు కొత్త బలం తీసుకొచ్చింది. ఈ ఇద్దరికి సర్దిచెప్పి రాజీచేసే ప్రయత్నాలు పార్టీ నాయకత్వం నుంచి జరగడం లేదు. ఇక ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే, పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, సీఎం జగన్‌తో బంధుత్వం ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య రెండేళ్ల నుంచీ ఆధిపత్యం కోసం పేచీలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు తలెత్తిన సందర్భాలున్నాయి. జర్మనీకి చెందిన ఓ కంపెనీ సహకారంతో ఒంగోలు ప్రాంతంలో విమానాలు నిలిపి ఉంచే వెసులుబాటు కల్పించే ఓ హేంగర్‌ను కొవిడ్‌ సమయంలో ఏర్పాటు చేయించాలని శ్రీనివాసులు రెడ్డి ప్రయత్నించారు. కాని, అప్పట్లో మంత్రి పదవిలో ఉన్న బాలినేని అందుకు సహకరించకపోగా ప్రతిఘటించారట. దీంతో మాగుంట స్వయంగా కలెక్టర్‌ సాయం తీసుకుని తన వైమానిక షెడ్డు ఏర్పాటు ప్రక్రియ కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. మరో పక్క వైఎస్సార్పీపీ ఒంగోలు మాజీ ఎంపీ, జగన్‌ చిన్నమ్మ భర్త వైవీ సుబ్బారెడ్డి ఈ మధ్య టీటీడీ చైర్మన్‌ హోదాలో తరచు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మాగుంటకు టికెట్‌ ఇవ్వరని, సుబ్బారెడ్డి ఒంగోలు నుంచి పోటీకి దిగుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాగుంట కుమారుడు రాఘవరెడ్డి ఈ నియోజకవర్గంలో తరచు పర్యటించడాన్ని రాంబాబు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మొత్తానికి శ్రీనివాసులురెడ్డికి వచ్చే ఎన్నికల్లో పోటీకి టికెట్‌ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది.
*రాయలసీమలోనూ గొడవలు
ముఖ్యమంత్రికి చెందిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరాటాలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురులేని పట్టు ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు ఎస్సీ ఎంపీల జోక్యం అసెంబ్లీ సెగ్మెంట్లలో పెద్దగా లేదు. కాబట్టి కనిపించేంత గొడవలు లేవు. అయితే, గ్రూపు తగాదాలకు పెట్టింది పేరైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం పాలకపక్షం ఎంపీలు, మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. హిందూపురం ఎంపీ డాక్టర్‌ తలారి రంగయ్యకు, నియోజకవర్గ పరిధిలోని కల్యాణదుర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కీవీ ఉషశ్రీ చరణ్‌ వర్గీయుల నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. రంగయ్య అనుచరులు పలువురిపై మంత్రి ప్రోద్బలంతో కేసులు పెడుతున్నారని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది. అంతేగాక తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఉషశ్రీ చరణ్‌ ఎంపీ రంగయ్య కులానికి చెందినవారిని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా లోక్‌సభ నియోజకవర్గాల్లో పాలకపక్షమైన వైఎస్సార్పీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తమ తమ ప్రాంతాల్లో పట్టు కోసం, రాజకీయ ఆధిపత్యం కోసం తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ అంతర్గత కీచులాటలు సమసిపోయేలా చేయడానికి పాలకపక్షం నాయకత్వం మొదట్లో పెద్దగా ప్రయత్నాలు చేయ లేదు. మూడేళ్ల నుంచి పార్టీ నేతల మధ్య స్వల్స విభేదాలను మొగ్గలోనే తుంచి వేసే పని చేపట్టకపోవడంతో పరిస్థితి వీధి పోరాటల వరకూ వచ్చింది. ఇప్పుడు అధిష్టానం తల పట్టుకుంటోంది. ఇకనైనా వైఎస్సార్పీపీ పార్టీ నేతల మధ్య గొడవలు పరిష్కరించకపోతే శాంతి, భద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది.