రాష్ట్ర ప్రభుత్వం తరుఫున శ్రీవారికి పట్టువస్త్రాలు

సీఎం వైఎస్ జగన్ రెడ్డి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున జగన్ శ్రీ వేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు సంప్రదాయ బద్ధంగా సీఎంకు తలపాగా చుట్టారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు.. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారికి జగన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం తరువాత ఈ రాత్రికి శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 6.15 కు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి కర్ణాటక సీఎం యడ్యూర్పతో కలిసి స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాల శంఖుస్థాపన కార్యక్రమంలో యడ్యూర్పతో పాటు జగన్ పాల్గొంటారు. అనంతరం సీఎం అమరావతికి పయనమవుతారు.