కోల్‌కతాపై ముంబై విజయం

దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్-2020 5వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కోల్‌కతాపై ముంబై 49 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే కోల్‌కతాపై ముంబై పైచేయి సాధిస్తూ వచ్చింది. కోల్‌కతా బౌలర్లను రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో ముంబై 20 ఓవర్లలో 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లు వెంటనే అవుట్ కావడం, కెప్టెన్ దినేశ్ కార్తీక్ కూడా ఎక్కువ సేపు పోరాడలేక పోవడంతో విజయానికి నెమ్మదిగా దూరమవుతూ వచ్చింది. రస్సెల్, మోర్గాన్‌ ఆకట్టుకోకపోవడం, మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కోల్‌కతా పరాజయం చవిచూసింది. తొలి మ్యాచ్‌లో చెన్నైపై ఓటమి చవిచూసి ఉన్న ముంబై రెండో మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటింది.

మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ (80 పరుగులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్‌)లు రాణించారు. దీంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. ఇక కోల్‌కతా బౌలర్లలో శివం మావికి 2 వికెట్లు దక్కగా, సునీల్ నరైన్‌, ఆండ్రూ రస్సెల్‌లు చెరొక వికెట్ తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ప్యాట్ కమిన్స్ (33 పరుగులు, 1 ఫోర్‌, 4 సిక్సర్లు), కెప్టెన్ కార్తీక్ (30 పరుగులు, 5 ఫోర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్‌, ప్యాటిన్‌సన్‌, బుమ్రా, చాహర్‌లు తలా 2 వికెట్లు తీశారు. పొల్లార్డ్‌కు 1 వికెట్ దక్కింది.