జిల్లా సమస్యలపై సి.ఎం. క్లారిటీ ఇవ్వాలి

  • జంజావతి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయాలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలి
  • పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పాలి
  • ఏనుగుల సమస్య పరిష్కారానికి ఏమి చెస్తారో ప్రజలకు చెప్పాలి
  • చెరువుల కబ్జాలపై క్లారిటీ ఇవ్వాలి
  • విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వెనుకబడిన జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలి
  • గిరిజన అభివృద్ధికి ఏం చేస్తారో గిరిజనులకు స్పష్టత ఇవ్వాలి
  • జనసేన పార్టీ జిల్లా నాయకుల డిమాండ్

పార్వతీపురం: విద్యాదీవెన బటన్ నొక్కేందుకు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం వస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాను వేధిస్తున్న సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ఆ పార్టీ సీతానగరం మండల అధ్యక్షులు పాటి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, బంటు శిరీష్, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, రౌతు బాలాజీ నాయుడు తదితరులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్వతిపురం మన్యం జిల్లాకు అధికార హోదాలో మొదటిసారి వస్తున్నందున జిల్లా వాసులు సమస్యల పరిష్కారానికి ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. దశాబ్దాల కాలంగా స్థానిక నాయకులు ఎన్నికల హామీలకు వాడుకుంటున్న జంఝావతి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణము, పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం, గుమ్మిడిగెడ్డ, వనకాబడి గెడ్డ, అడారుగెడ్డల రిజర్వాయర్ల నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదో..? వాటికి సంబంధించి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. వాటి నిర్మాణాలు ఎప్పటికీ పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అలాగే జిల్లాను వణికిస్తున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం ఇవ్వాలన్నారు. విద్య వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ ఉపాధి తదితర వాటిల్లో వెనుకబడి ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు కనీస మౌలిక సదుపాయాలు రోడ్డు, తాగునీరు, వైద్యం తదితర వాటికి సంబంధించి గిరిజనులకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. జిల్లాలో జరుగుతున్న చెరువులు కబ్జాకు సంబంధించి తీసుకునే నివారణ చర్యలు పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. అలాగే జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణాన్ని వేదిస్తున్న తాగునీటి సమస్య, డంపింగ్ యార్డ్ సమస్య, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. బాగా వెనుకబడిన పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి భవిష్యత్తులో పారిశ్రామిక అభివృద్ధి సంబంధించి కంపెనీల ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.