బాణాసంచాపై నిషేధం విధించిన సీఎం యడ్యూరప్ప

దీపావళి పండుగ నేపథ్యంలో కరోనా రోగుల ఆరోగ్యాన్ని, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ర్టాలు పటాకుల విక్రయం, వినియోగంపై నిషేధం విధిస్తున్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు దీపావళి పండుగను దీపాలతోనే జరుపుకోవాలని  తాజాగా బాణాసంచాపై కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిషేధం విధిస్తున్నట్లు సీఎం బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. బాణాసంచా పేలుళ్ల వల్ల వాయు నాణ్యత తగ్గుతుందని, అయితే కోవిడ్ వేళ ఆ నాణ్యత తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోస సమస్యలు పెరుగుతాయని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా బాణాసంచా పేలుళ్లతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి చర్చించామని, ఆ తర్వాత బాణాసంచా పేలుళ్ల నిషేధంపై నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యడ్డీ తెలిపారు. నిషేధ ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. ఇప్పటికే బాణాసంచా పేలుళ్లను నిషేధిస్తూ మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. శీతాకాలంలో వాయు నాణ్యత తగ్గే ప్రమాదం ఉందని ఆ రాష్ట్రాలు చెప్పాయి.