శ్రమదానం స్పూర్తిని కొనసాగించండి: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారి నిత్య జీవనంలో ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్ళను దూరం చేసేలా ఉండాలని పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుగా సమస్యను అందరి దృస్టికి తీసుకువెళ్ళి కనీసం మరమ్మత్తులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అప్పుడే శ్రమదానం ద్వారా మరమ్మత్తులను జనసేన పార్టీ చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూసారన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని… శ్రమదానం స్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కావచ్చు, జిల్లా, మండల స్థాయిలో ఏ కార్యక్రమం నిర్వహించినా ముందుగా ఆ పరిధిలో దెబ్బ తిని ఉన్న ఒక రోడ్డుకు మరమ్మత్తు చేయాలని సూచించారు. ఆదివారం ఉదయం నుండి హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అద్యక్షుల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “సగటు మనిషి అభివృద్ధి తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది మన పార్టీ లక్ష్యం. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం. ఎవరికి భయపడేది లేదు. ఏ అంశాన్నయినా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దాం ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్సు సిధ్ధం చేస్తున్నాం. జిల్లకు వెళ్ళినపుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తాను” అన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ శ్రేణులను జిల్లా అద్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేసుకుంటూ మన అద్యక్షుల వారి ఆలోచనలను ముందుకు తీసుకువెళ్ళాలి. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలని” చెప్పారు. పార్టీ మండల, గ్రామ స్థాయి కమిటీల నియామకానికి సూచనలు, సలహాలు ఇచ్చారు.