అనునిత్యం అపచారం….!

* వైసీపీ పాలనలో తిరుమలలో రోజుకో తప్పు
* ఆగమశాస్త్ర విరుద్ధమైన పనులు
* తిరుమల భద్రత గాలిలో దీపం
*కనీస ప్రమాణాలు పాటించని సిబ్బంది
* దెబ్బతింటున్న హిందూ మనోభావాలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమల కొండపై లెక్కలేనన్నిసార్లు భద్రతా లోపాలు బయటపడ్డాయి. కొండపై జరిగిన అపచారాలకు, తప్పులకు లెక్కేలేదు. అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉన్న తిరుమలను భద్రతాపరంగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం దాదాపు మానేసింది. ఫలితంగా తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. ఓ సంఘటన తర్వాత మరొకటి అన్నట్లుగా తిరుమల కొండపై గతంలో ఎన్నడూ లేనన్ని ఆగమశాస్త్ర విరుద్ధమైన విషయాలు నిత్యకృత్యం అయిపోయాయి. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు కానీ, ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిరుమల ఆలయంలోని దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించిన విజువల్స్ బయటకు వచ్చాయి.
• 2019, ఆగస్టు 23వ తేదీన తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నట్లు బయటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇది మొట్టమొదట బయటపడిన అంశం. తిరుమలకు వెళ్లే బస్సు టిక్కెట్ల మీద అన్యమత సూక్తులను ముద్రించి పంపిణీ చేయడం దుమారం రేపింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు.
• తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు సుమారు 200 మంది వరకు ఉండవచ్చని లెక్క తేలింది. వారిని వెంటనే తొలగించాలని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం కోరినా ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. తర్వాత ఆయననే సైలెంట్ చేశారు.
• తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్ సైట్ లోకి కొన్ని అన్యమత బొమ్మలు ప్రత్యక్షం కావడం సంచలనం అయింది. దీంతో పాటు కొన్ని ఆకారాలను సైతం తిరుమలలో ప్రదర్శించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో బలంగా వచ్చాయి.
• శ్రీవారి లడ్డూల ధరలను భారీగా పెంచారు. దీంతో పాటు స్వామి వారి లడ్డూలను ఎవరికి కావాలంటే వారికి ఆర్డరుపై సప్లై చేస్తామని ప్రకటించడం విమర్శలకు దారి తీసింది. తిరుమలను స్వీటు దుకాణంలా మార్చడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో నిర్ణయం మేం తీసుకోలేదని బోర్డు మాట మార్చింది.
• తరతరాల శ్రీవారి స్థిరాస్తులను అమ్మి వేయాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం పెనువివాదానికి కారణం అయింది. భూములను రక్షించలేకపోతున్నామని, వాటిని అమ్మేసి ఆ డబ్బును శ్రీవారికి జమ చేస్తామని చెప్పడంపై హిందువులంతా ముక్తకంఠంతో ఖండించారు.
• 2022లో ఓ మహిళ తిరుమల కొండపై బహిరంగంగా మద్యం విక్రయించడం, అది మీడియాలో రావడం తిరుమల భద్రతను మరోసారి ప్రశ్నించేలా చేసింది. కనీస తనిఖీలు లేకుండా కొండపైకి పంపడంపైనా అనుమానాలు రేగాయి.
• తిరుమల ఆలయంపై డ్రోన్ ఎగురవేసిన సంఘటన తీవ్ర సంచలనం అయింది. ఈ ఏడాది జనవరి 23న సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన డ్రోన్ విజువల్స్ ఆగమశాస్ర్త నిబంధలకు విరుద్ధంగా ఆలయ పైభాగం నుంచి తీసినవిగా గుర్తించారు. అయితే తిరుమలలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ ఎగురవేసినా సిబ్బంది ఎవరూ చూడకపోవడం విశేషం. దీనిపై భక్తుల నుంచి తీవ్ర నిరసన ఎదురు కావడంతో అప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు.
• గత ఏడాది తిరుమలలోని షికారీ వీధిలో.. కొందరు షికారీలు మాంసం వండి తింటున్నట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు.. అక్కడికి వెళ్లారు. ఇద్దరు షికారీలను అదుపులోకి తీసుకున్నారు. వారికి మాంసం ఎక్కడి నుంచి వచ్చిందో దానిపై విచారణ చేపట్టారు.
• ఈ ఏడాది మార్చి నెలలో తిరుమలలో సిబ్బంది వద్ద గంజాయి పొట్లాలు బయటపడటం నివ్వెరపరిచింది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది జరిపిన తనిఖీల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న గంగాధరం అనే వ్యక్తి వద్ద భారీగా గంజాయిని గుర్తించారు. చిన్న పొట్లాలుగా కట్టి, అతడు విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. గంగాధరం వద్ద సుమారు 125 గ్రాముల చిన్న చిన్న గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటిని చూసి అధికారులు అవాక్కయ్యారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, తిరుమలకు తరచూ అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
• పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల బాలాజీనగర్‌లో ఇటీవల వైసీపీ నేతలు, కార్యకర్తలు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ స్టిక్కర్లు అతికించారు. వైసీపీ బ్యాగులు, కరపత్రాలతో హడావుడి చేశారు. వ్యక్తుల విగ్రహాలు, ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమత ప్రచారానికి సంబంధించిన ప్రచార సామాగ్రిని తిరుమలలో నిషేధించారు. అయినా వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ప్రచారాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోలేదు.