బాపూజీ మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోంది

* పంచాయతీరాజ్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
* ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించడంతో అభివృద్ధి కుంటుపడుతోంది
* వాలంటీర్లు అనే సమాంతరం వ్యవస్థతో సర్పంచులు డమ్మీలుగా మారారు
* స్థానిక సంస్థల బలోపేతానికి జనసేన కట్టుబడి ఉంది
* అధికారంలోకి రాగానే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవం పోస్తాం
* మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ‘పంచాయతీలను కాపాడుకుందాం’ చర్చాగోష్ఠిలో నాదెండ్ల మనోహర్

‘గ్రామాలు గణతంత్రంగా వ్యవహరించగలగాలి. సొంత అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదు. స్వావలంబన సాధించాలి. గ్రామాలు బావుంటేనే దేశం బాగుంటుంది’… గ్రామ స్వరాజ్యం గురించి బాపూజీ మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. సాధారణ అవసరాల సంగతి పక్కనపెడితే… రోడ్లు, మంచినీటి సరఫరా వంటి అత్యంత కీలకమైన పనులు కూడా చేయలేక పంచాయతీలు కునారిల్లుతున్నాయని అన్నారు. ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రం దారిమళ్లించడంతో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని అన్నారు. శనివారం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పంచాయతీలను కాపాడుకుందాం అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సొంత పథకాలకు దారి మళ్లిస్తోంది. దీంతో క్షేత్ర స్థాయిలో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది.
* పంచాయతీరాజ్ వ్యవస్థను బలహీన పరిచారు
కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కొంతమంది శాసనసభ్యులతో కలిసి పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉన్న కేరళ రాష్ట్రంలో పర్యటించాం. అక్కడ ఒక్కొక్క సర్పంచ్ కు దాదాపు 34 శాఖలపై పూర్తి పట్టు ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థను కేరళ తరహాలో బలోపేతం చేయాలని అప్పట్లో ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాలంటీర్లు అనే సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థను పూర్తిగా బలహీనం చేస్తోంది. ఈ సమాంతర వ్యవస్థతో గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచు డమ్మీగా మారిపోతున్నాడు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. అధికారంలోకి రాగానే పంచాయతీ రాజ్ వ్యవస్థకు పునరుజ్జీవం పోస్తాం.
* రాష్ట్ర నిర్వాకం వల్లే ప్రతి ఏడాదీ నిధులు తగ్గుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్ల ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయితీలకు వస్తున్న ఆర్థిక సంఘం నిధులు తగ్గుతున్నాయి. జలజీవన్ మిషన్ కార్యక్రమం భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో అధ్వానంగా ఉందని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కేవలం 17 శాతం నిధులు మాత్రమే ఉపయోగించుకొని సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారని చెప్పారు. 2020-21లో 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రూ. 1837 కోట్లు వస్తే ఈ ఏడాది రూ. 689 కోట్లుకు తగ్గిపోయింది. ప్రభుత్వం ఒక సమాంతర వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచుల ద్వారా జరగాల్సిన కార్యక్రమాల్ని నీరుగార్చేస్తున్నారు. ఆర్ధిక సంఘం నిధులను ఏ అభివృద్ధి కార్యక్రమానికి వినియోగించాలో నిర్ణయాధికారం సర్పంచులకు ఉండేది. ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చిన సమాచారంతో ఎక్కడో కూర్చున్న వారు నిర్ణయం తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే జరగకూడదని ప్రయత్నించిన ప్రభుత్వం ఇది. కేవలం పాలక పక్షం తరఫున నిలబడ్డ వ్యక్తులే సర్పంచులుగా గెలవాలని కుట్ర పూరితంగా వ్యవహరించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నామినేషన్ వేసిన ఇతర పార్టీల సానుభూతిపరులను బెదిరించి, భయపెట్టి నామినేషన్లు ఉహసంహరించుకునేలా చేశారు. సర్పంచుల పోరాటానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది” అని హామీ ఇచ్చారు.