బియ్యం ఎగుమ‌తిలో అవినీతి క‌య్యం!

* విదేశాల‌కు త‌ర‌లుతున్న రేషన్ సరకు
* ఇర‌కాటంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం

-“బియ్యం ఎగుమ‌తుల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ అగ్ర‌స్థానంలో ఉంది!”..
-“కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమ‌తులు రెట్టింప‌య్యాయి!”..
ఈ ప్ర‌క‌ట‌న‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ నేత‌ల మాట‌ల్లో త‌రచు చోటు చేసుకుంటున్న గొప్ప‌లు!
ఇవి విన్న‌వారికెవ‌రికైనా నిజంగానే గొప్ప ప్ర‌గ‌తి ప‌థంలో సాగిపోతున్నామేమోన‌నే అభిప్రాయం క‌లుగుతుంది.
కానీ… అలా ఎగుమ‌తి అవుతున్న బియ్యం పేద‌ల కోసం కేటాయించిన రేష‌న్ బియ్యం అయితే?
రైతుల నుంచి మ‌ద్దతు ధ‌ర క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసిన బియ్యం అయితే?
అప్పుడు అర్థం అవుతుంది, బియ్యం ఎగుమతుల వెన‌క చోటు చేసుకుంటున్న అస‌లు క‌థ‌!
అటు రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లగ‌కుండా, ఇటు పేద‌ల క‌డుపు నింప‌కుండా ఎక్క‌డెక్క‌డో విదేశాల‌కు మ‌న బియ్యం త‌ర‌లిపోతుండ‌డం వెనుక య‌ధేచ్చ‌గా సాగుతున్న అవినీతి క‌థ‌!!
ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌యాంలో ఇదే జ‌రుగుతోంద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు…
దాన్ని స‌హజంగానే అధికార నేత‌లు ఖండిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం బియ్యంపై క‌య్యం జ‌రుగుతోంది.
అయితే ఈ ఆరోప‌ణ‌ల వెనుక ఏం జరుగుతోందో తెలుసుకుంటే నిజానిజాలేంటో ఎవ‌రికైనా అవ‌గ‌త‌మ‌వుతాయి.
అస‌లు సంగ‌తిదీ!
నిజానికి విదేశాల‌కు బియ్యం ఎగుమతులు పెరిగితే అది ఆనంద‌క‌ర‌మైన విష‌యమే. అందులోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ విష‌యంలో మిగ‌తా రాష్ట్రాల‌ను మించిపోయి అగ్ర‌స్థానంలో ఉందంటే అది కూడా సంతోషించ‌ద‌గిన అంశ‌మే.

అయితే ఎప్పుడు?
ఆ ఎగుమ‌తుల వ‌ల్ల ఆరుగాలం క‌ష్ట‌పడి ధాన్యం పండిస్తున్న అన్న‌దాత‌ల‌కు మేలు జ‌రిగిన‌ప్పుడే!
ఎగుమ‌తుల ద్వారా ఆదాయం పెరిగి త‌ద్వారా పేద‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగిన‌ప్పుడే!!
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అలా జ‌రుగుతోందో లేదో తెలియాలంటే బియ్యం ఎగుమ‌తి అవుతున్న ధ‌ర‌వ‌ర‌లేంటో గ‌మ‌నించాలి.
ప్ర‌స్తుతం ధాన్యం పండించే రైతుల‌కు ప్ర‌భుత్వం క్వింటాలుకు 1960 రూపాయ‌ల మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింది. అంటే దానర్థం ఏమిటంటే ఈ ధ‌ర‌కు ధాన్యాన్ని సేక‌రిస్తేనే అది రైతుకు ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని. ఈ ధ‌ర‌కు ధాన్యాన్ని కొని మ‌ర‌ప‌ట్టిస్తే 67 కిలోల బియ్యం వ‌స్తుంది. అంటే కిలో బియ్యం ధ‌ర 29.25 రూపాయ‌లు అవుతుంది. దీనికి మిల్లింగ్ ఛార్జీలు, హ‌మాలీ ఖ‌ర్చులు, ర‌వాణా వ్య‌యాన్ని కూడా క‌ల‌పాల్సి ఉంటుంది. ఇవ‌న్నీ క‌లిపితే ఆ ధ‌ర 33 రూపాయ‌లు అవుతుంది. ఇలా హోల్‌సేల్ వ్యాపారి నుంచి రిటైలు వ్యాపారి వ‌ర‌కు చూసుకున్న‌ప్పుడు మార్కెట్లో వినియోగ‌దారుడికి మంచి బియ్యం కిలో 40 రూపాయ‌ల‌కు అందుతోంది. ఇవ‌న్నీ ఎవ‌రికైనా అర్థం అయ్యే సామాన్య‌మైన విష‌యాలే.
ఈ నేప‌థ్యంలో విదేశాల‌కు ఎగుమ‌తి చేసే బియ్యం ధ‌ర క‌నీసం 33 రూపాయ‌ల‌కు మించి అమ్మితేనే అది స‌క్ర‌మంగా, ప్ర‌యోజ‌న‌క‌రంగా జ‌రిగిన‌ట్టు. ఇలా జ‌రిగిన‌ప్పుడు అన్న‌దాత శ్ర‌మ‌కు స‌రైన విలువ ద‌క్క‌డంతో పాటు, ప్ర‌భుత్వానికి కూడా ఆదాయం ల‌భించిన‌ట్టే.
ఇలా జ‌రిగితేనే బియ్యం ఎగుమ‌తులు పెరిగాయ‌న్నా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అగ్ర‌స్థానంలో ఉంద‌న్నా నిజంగానే గొప్ప‌గా చెప్పుకోవ‌చ్చు. కానీ అలా జరుగుతోందా? ఆ సంగతే చూద్దాం!

ఇవిగో వాస్త‌వాలు…
ఒక‌వైపు బ‌హిరంగ మార్కెట్లో సాధార‌ణ బియ్యం ధ‌ర క‌నీసం 30 రూపాయ‌లు, నాణ్య‌మైన మంచి బియ్యం ధ‌ర క‌నీసం 40 రూపాయ‌లు ఉంద‌న్న సంగ‌తి అందరికీ తెలిసిందే. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న బియ్యం ధ‌ర ఎంతో తెలుసా? కేవ‌లం కిలో 25 రూపాయ‌లు!
అంటే రైతుల‌కు స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించి ధాన్యం కొనుగోలు చేసి, దాన్ని మ‌ర ప‌ట్టించి బియ్యంగా మార్చి, దాన్ని మిల్లుల నుంచి ర‌వాణా చేసి ఎగుమ‌తి చేస్తున్నార‌నుకుంటే కిలోకి క‌నీసం 8 రూపాయ‌లు న‌ష్టం వాటిల్లుతుంది. ఇలా న‌ష్టానికి ఎగుమ‌తి చేయ‌డం సాధ్య‌మేనా అని అడిగితే, కాద‌ని చిన్న‌పిల్ల‌లు కూడా చెబుతారు.

మ‌రి ఏం జ‌రుగుతోంది?
అంటే విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న బియ్యం, రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించి సేక‌రించిన‌ది కాద‌న్న‌మాట‌. అంటే మ‌ద్ద‌తు ధ‌ర క‌న్నా క‌నీసం క్వింటాలుకు అయిదారు వంద‌ల రూపాయ‌లు త‌క్కువ‌కు సేక‌రించిన ధాన్యం అవ్వాలి. ఇలా రైతుల అవస‌రాల‌ను ఆస‌రాగా చేసుకునో, వారిని బెదిరించో ద‌ళారుల ద్వారా సేక‌రించిన బియ్యం అయి ఉండాలి. అప్పుడు ఈ ఎగుమ‌తుల వ‌ల్ల రైతుల‌కు ఏమీ ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌డం లేద‌న్న‌మాట‌.

మ‌రి ఇందులో గొప్ప‌గా చెప్పుకోవ‌ల‌సింది ఏముందీ?
ఇలా రైతుల నుంచి మ‌ద్ద‌తు ధ‌ర క‌న్నా త‌క్కువ ముట్ట‌జెపుతూ సేక‌రించిన బియ్యంతో పాటు మ‌రో ప్ర‌త్యామ్నాయం ఏముందీ అని ఆలోచిస్తే దానికి దొరికే జ‌వాబే రేష‌న్ బియ్యం. నిరుపేద‌లు క‌డుపునిండా అన్నం తిన‌డానికి, ఓ పూట ఏ కూలి ప‌నో దొర‌క్క‌పోయినా ప్రాణం నిలుపుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తూ ప్ర‌త్యేక ప‌థ‌కాల పేరుతో రేష‌న్ బియ్యాన్ని అతి చౌక‌గా అందిస్తున్నాయి. అలాగే క‌రోనా నేప‌థ్యంలో పేద‌ల‌కు ఉచితంగా కూడా ప్ర‌భుత్వాలు పేద‌ల‌కు బియ్యాన్ని అందించాయి. ఇలా అతి చౌకగా అందించే రేష‌న్ బియ్యాన్ని సేక‌రించి, వాటిని మ‌ర ప‌ట్టించి విదేశాల‌కు ఎగుమ‌తి చేస్తే అది లాభ‌దాయ‌కం. ఇలా ల‌భించే బియ్యాన్ని ఎగుమ‌తి చేస్తున్నారంటే ప‌రోక్షంగా పేద‌ల క‌డుపు కొడుతున్నార‌నే అర్థం. పైగా పేద‌ల కోసం ప్ర‌భుత్వాలు కేటాయిస్తున్న కోట్లాది రూపాయ‌ల‌ను దోచుకుంటున్న‌ట్టే లెక్క‌.
ఇక్క‌డే పేద‌ల కోసం కేటాయించిన రేష‌న్ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఊతంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తూ ప‌ట్టుబడిన కేసులు త‌ర‌చు బ‌యట‌ప‌డుతున్నాయి.
ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని నిశితంగా విశ్లేషిస్తే… రాష్ట్రంలో ద‌ళారుల దందా య‌ధేచ్చ‌గా సాగుతోంద‌ని అర్థం అవుతుంది. అటు రైతుల నుంచి మ‌ద్ద‌తు ధ‌ర క‌న్నా త‌క్కువ చెల్లించి వారి శ్ర‌మ‌ను దోచుకోవడం, ఇటు పేద‌లకు చేరాల్సిన బియ్యాన్ని అక్ర‌మంగా త‌ర‌లించ‌డం ద్వారా ద‌ళారుల వ్య‌వ‌స్థ వేళ్లూనుకుని పోయింద‌ని అర్థం అవుతుంది. పేద‌ల‌కు పంపిణీ అయిన బియ్యాన్ని కూడా కిలోకి ఏ ప‌ది రూపాయ‌లో చెల్లించి సేక‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇది కూడా పేద‌ల అవ‌స‌రాన్ని సొమ్ము చేసుకోవ‌డ‌మే.
మ‌రి ఇంత విచ్చ‌ల‌విడిగా బియ్యం సేక‌ర‌ణ జ‌రుగుతుంటే ప్ర‌భుత్వానికి తెలియ‌దా?
తెలిస్తే వెంట‌నే యుద్ధ ప్రాతిప‌దిక‌న రంగంలోకి దిగి ద‌ళారుల వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే సామర్థ్యం ప్ర‌భుత్వానికి లేదా?
ఇక్క‌డే ప్ర‌తి ప‌క్ష నేత‌లు, ప‌రిశీల‌కుల విశ్లేషణ‌కు ఊతం ల‌భిస్తోంది. ఇలా కిలో పాతిక రూపాయ‌ల వంతున బియ్యాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తూ అధికార పార్టీకి చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు వేలాది కోట్ల రూపాయ‌ల‌ను దోచుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.
మ‌రో వైపు ఇత‌ర రాష్ట్రాలు ఎలా బియ్యాన్ని ఎగుమ‌తి చేస్తున్నాయ‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే… గుజ‌రాత్‌, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాలు, ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి ఎగుమ‌తి అవుతున్న బియ్యం ధ‌ర‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కే ఎగుమ‌తులు చేస్తున్నాయ‌నే వాస్త‌వాలు క‌నిపిస్తాయి. మ‌రి ఇత‌ర రాష్ట్రాల క‌న్నా తక్కువ ధ‌ర‌కు ఎలా ఎగుమ‌తి చేయ‌గ‌లుగుతున్నారనే విష‌య‌మే ఆరోప‌ణ‌ల్లో కీల‌క‌మైన‌దిగా క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బియ్యం సేక‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌ని ఎవ‌రికైనా స్పష్టంగా అవ‌గ‌త‌మ‌వుతుంది. స‌క్ర‌మంగా జ‌ర‌గడం లేదంటే అది అక్ర‌మ‌మ‌నే అర్థం. అంటే అనైతిక‌మ‌నేదే అస‌లు అర్థం!
ఇలా ఎగుమ‌తి అవుతున్న బియ్యం వ్యాపారం లెక్క‌ల కేసి దృష్టి సారిస్తే… రాష్ట్రంలో గ‌త మూడేళ్ల కాలంలో దాదాపు 7.15 కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని ఎగుమ‌తి చేయ‌డం ద్వారా సుమారు 18,120 కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రిగింద‌ని తెలుస్తుంది.
అంటే ఇన్ని వేల కోట్ల రూపాయ‌ల ఆదాయం ల‌భిస్తున్నా, రాష్ట్రంలో ఇటు రైతుల‌కు కానీ, అటు పేద‌ల‌కు కానీ ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌నే విషయం చాలా సులువుగా అర్థం అవుతోంది.
మ‌రి ఈ ఎగుమ‌తుల వ‌ల్ల ఎవ‌రి జేబులు నిండుతున్నాయ‌నేదే అతి కీల‌క‌మైన ప్ర‌శ్న‌.
ఈ ప్ర‌శ్న‌ను లేవ‌నెత్త‌డం వ‌ల్ల‌నే రాష్ట్రంలో బియ్యంపై క‌య్యం తారాస్థాయిలో జ‌రుగుతోంది. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు క‌లిసి ప్ర‌తిప‌క్ష‌నేత‌లు, మీడియా క‌థ‌నాల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అయితే ఈ నేప‌థ్యంలో ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌ను మించి తేట‌తెల్లం చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.
అవేంటంటే… ఎగుమ‌తి చేస్తున్న ఇన్ని కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని ఎక్క‌డి నుంచి సేక‌రించారు? ఎంత ధ‌ర‌కు ఎవ‌రి నుంచి తీసుకున్నారు? దాన్ని ఇంత చౌక‌గా విదేశాల‌కు ఎలా ఎగుమ‌తి చేయ‌గ‌లుగుతున్నారు? ఈ ఎగుమ‌తుల వ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లిగింది?
ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాల్సిన బాధ్య‌త వైకాపా అధినేత‌ల‌దే. అయితే ప్ర‌స్తుతం ఆ బాధ్య‌తే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొర‌వ‌డింద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం!