జగనన్న కాలనీల్లో అవినీతి జలం!

* ఒక్క వర్షానికే మునక
* లబ్దిదారుల గగ్గోలు
* రూ. వేల కోట్లు వృధా
* కాలనీల పేరుతో కుంభకోణం
* డిజిటల్‌ సమరానికి ప్రజలు ఆయత్తం

‘పేరు ప్రజలది! షేరు నేతలది!’… ఇదే వైకాపా ప్రభుత్వం పనితీరు. ఏ పథకాన్ని తీసుకున్నా దాన్ని ప్రజల కోసమేనంటూ ప్రచారం చేసుకోవడం, లోపాయికారీగా దాని పేరిట వైకాపా నేతలు కోట్లు దండుకోవడం అనేది నిత్యసత్యమని చెప్పడానికి ఒక్క ‘జగనన్న కాలనీలు’ పేరిట జరుగుతున్న వ్యవహారమే ప్రత్యక్ష సాక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు చాలా చోట్ల జగనన్న కాలనీలు జలమయమై, జగన్‌ ప్రభుత్వం నిర్వాకాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. జగన్‌ హామీల్లో డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
ఒక్క వర్షానికే మునకేసిన ఈ కాలనీల పేరిట జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెట్టడానికి ‘జనసేన’ ఆధ్వర్యంలో డిజిటల్‌ సమరానికి జనం ఆయత్తమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల దుస్థితిని ఫోటోలు, వాస్తవాలతో సహా వెలికితీయడానికి జనం సైతం ఉవ్విళ్లూరుతున్న వేళ… అసలు జగన్‌ హామీలేంటో, అవి నీరుగారిన తీరేంటో… ఓసారి చూద్దాం!
* ప్రచారం ఘనం… ఆచరణ హీనం
”ఇది గృహనిర్మాణ రంగంలోనే అపురూపం. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం ఇళ్లు కాదు… ఏకంగా ఊళ్లనే నిర్మించబోతున్నాం” అంటూ ముఖ్యమంత్రి జగన్‌ ఊదరగొట్టారు. బడుగుల సొంత ఇంటి కలను సాకారం చేయడం కోసమే అవతారమెత్తినట్టు భారీ ప్రచారం చేసుకున్నారు.
పేదల్లో ఆశలు రేకెత్తించిన ఆ హామీల ప్రకారం చూస్తే… రాష్ట్ర వ్యాప్తంగా 17,000 ప్రాంతాల్లో జగనన్న కాలనీలను నిర్మించబోతున్నట్టు సొంత దినపత్రిక సహా అనేక ప్రచార మాధ్యమాల ద్వారా ఘనంగా ప్రకటించారు. ఈ కాలనీల్లో ఏకంగా 31 లక్షల ఇళ్లను నిర్మిస్తామంటూ జబ్బలు చరుచుకున్నారు. ఆ తర్వాత పలు చోట్ల శంకుస్థాపనలు చేశారు. పనులు సైతం మొదలు పెట్టారు. అలా వేర్వేరు చోట్ల వివిధ దశల్లో ఉన్న ఈ కాలనీల్లో అధికశాతం ఇప్పుడు నీట మునిగి జలాశయాలను తలపిస్తున్నాయి.
* కుంభకోణం అడుగుజాడలివిగో…
జగనన్న కాలనీల గురించి సామాన్య జనం కలలు కంటుండగానే, మరో వైపు వీటి పేరు చెప్పి కోట్లాది రూపాయల ప్రజల సొత్తును దండుకోడానికి రంగం సిద్ధమైంది. జగన్‌ కాలనీలను నిర్మించాలంటే స్థలాల సేకరణ జరగాలి కదా? ఇక్కడే వైకాపా నేతలు చకచకా పావులు కదిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోరంబోకు స్థలాలు, నిరుపయోగంగా ఉన్న స్థలాలను ముందుగానే అతి తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ భూములనే ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్మి తద్వారా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్లయితే ఆఖరికి చెరువుల స్థలాలను కూడా చవక ధరలకు కొని ఆపై వాటినే ప్రభుత్వానికి ఎక్కవ ధరకు అమ్ముకున్నారనేది ఆయా ప్రాంతాల్లో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యంగా మారింది. ఇదంతా పేదల పేరిట, వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వడమనే హామీ పేరిట జరిగిన భారీ కుంభకోణమని ప్రతిపక్షాలు సహా అనేక మంది నిరసనలు తెలిపినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ముందుకు సాగింది. అలా అవకతవకల మయంగా జరిగిన స్థలాల సేకరణ కారణంగా ఇప్పుడవన్నీ కాస్తంత వర్షానికే మునిగిపోయి వైకాపా ప్రభుత్వం నిర్వాకాన్ని నిలువెత్తు నీటిలో ప్రతిబింబిస్తున్నాయి. ఇక ఈ కాలనీల్లో నిర్మాణ కాంట్రాక్టులన్నీ వైకాపా నేతల బినామీ పేర్ల మీదనే జరుగుతున్నాయనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాంట్రాక్టులు అందుకున్న నేతలు నాణ్యత లేకుండా అరకొరగా పనులు చేయడంతో చాలా చోట్ల రోడ్లు సైతం కొట్టుకుపోయాయి. ఇక ఇతర సదుపాయాల గురించి చెప్పేదేముంటుంది? అలా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ. 89 వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటనల ద్వారా ప్రచారం చేసుకుంటోంది. ఈ మధ్యనే ఈ కాలనీలను మెరక చేయడానికి రూ. 2200 కోట్లను ఖర్చు చేసినట్లు కూడా ప్రచారం చేసుకున్నారు. మరి అన్ని వేల కోట్ల రూపాయలు పోసి మెరక చేస్తే ఇప్పుడు వర్షాలకు ఎందుకు మునిగిపోయాయనేది జవాబు లేని ప్రశ్నగానే మిగులుతోంది. ఇక కాలనీల్లో రోడ్లు, వీధిదీపాలు, పార్కులు, లైబ్రరీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పుతామని ప్రచారం చేసుకున్నా, చాలా చోట్ల వాటి జాడే కానరావడం లేదు. పైగా కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణానికి కొంత వాటా చెల్లించాలంటూ స్థానిక నేతలు లబ్దిదారులపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే, అసలు పట్టాలనే రద్దు చేయగలమనే బెదిరింపులకు కూడా నేతలు ఒడిగడుతున్నారని చాలా చోట్ల లబ్దిదారులు వాపోతున్నారు.
* కాలనీల్లో కన్నీటి ఆనవాళ్లు…
రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జగనన్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని లేఅవుట్లన్నీ నీట మునకేశాయి. ఆఖరికి ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా ప్రారంభించిన తూ.గో.జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో స్థలాలు సైతం ఎక్కడేవి ఉన్నాయో తెలియనంతగా ముంపులో మునిగితేలుతున్నాయంటే పరిస్థితిని వేరే చెప్పక్కరలేదు. ఈ జిల్లాలో మొత్తం 373 లే అవుట్లు ఉండగా వీటి చదును పేరుతో రూ. 350 కోట్లు వెచ్చించారు. మొత్తం లే అవుట్లలో 64,276 ఇళ్లలో పూర్తయినవి కేవలం 18 వేలు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలను రూ. 800 కోట్లు పెట్టి సేకరించారు. ఇందుకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటుగా సేకరించారు. ఈ క్రమంలో వైకాపా నేతలు కారు చౌకగా ఎకరం రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు కొనుగోలు చేసి అవే భూములను ప్రభుత్వానికి ఏకంగా రూ. 42 లక్షల మేరకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. తీరా ఇప్పుడు చూస్తే కరప, సామర్లకోట, పిఠాపురం, తుని, ఏలేశ్వరం, పెదపూడి, కాజులూరు, రౌతులపూడి, తుని మండలాల్లో ఏ లే అవుట్‌ చూసినా నీళ్లతో నిండిపోయి జలాశయాలను తలపిస్తున్నాయి. ఒక్క ఈ జిల్లాలో పరిస్థితిని బట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు కనిపిస్తోంది.
* శ్రీకాకుళం జిల్లాలో 834 లే అవుట్లలో 74,811 ఇళ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించారు. అయితే ఇవన్నీ కొండలు, గుట్టలు, చెరువులకు ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోవే కావడంతో దాదాపు అన్నీ వర్షం నీటికి మునిగిపోయి కనిపిస్తున్నాయి.
* మచిలీపట్నం సమీపంలోని కరగ్రహారంలో 354 ఎకరాల్లోని లే అవుట్లలో మోకాటి లోతున నీరు చేరడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
బందరు మండలం రుద్రవరం కాలనీల్లో దారులన్నీ నీటిలో ఉన్నాయి.
* గుడివాడ మున్సిపాల్టీ పరిధిలోని మల్లాయపాలెంలో 108 ఎకరాల్లో అరగజం లోతున నీరు చేరడంతో లబ్దిదారులు నానా పాట్లూ పడుతున్నారు.
* గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో 70 ఎకరాలకు పాతిక ఎకరాలు మునకేశాయి.
* ఏలూరు దగ్గరి కైకలూరు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక చిన్న వర్షానికి సైతం నీరు నిలిచిపోతోంది. ఇక్కడ 2500 గృహాలకు 650 పూర్తయ్యాయి.
* ఇలా దాదాపు ఏ జిల్లా చూసినా జగనన్న కాలనీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. విజయనగరం, కృష్టా, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలోని జగనన్న కాలనీల్లో కూడా ఇదే దుస్థితి. అనేక చోట్ల కాలనీల దగ్గరకు వెళ్లే దారి కూడా లేకుండా పోయింది. నీరు లాగితేనే కానీ పునాదులు, నిర్మాణాలు ఏ స్థితిలో ఉన్నయో తెలియనంతగా ముంపు ఉంది.
* సమరానికి జనసేన సై…
ఈ నేపథ్యంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవినీతిని, కాలనీల దుస్థితిని బయటపెట్టడానికి డిజిటల్‌ సమరానికి జనసేన పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల దగ్గరకు జనం చేరుకుని ఫొటోలను తీసి సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేయాలని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశించారంటూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించి ప్రజా సమరానికి తెరతీశారు.