‘రాజధాని’ పాదయాత్రకు సిపియం మద్దతు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ తలపెట్టిన పాదయాత్రకు సిపియం మద్దతు తెలిపింది. ఈ మేరకు పార్టీ కార్యదర్శి పి మధు ప్రతికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో…. ప్రతిపక్షంలో ఉండగా వైయస్సార్‌ పార్టీ అమరావతి రాజధానికి మద్దతు తెలిపింది. ఎన్నికల సందర్భంలో తాము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం కంటే మరింత మెరుగ్గా అమరావతిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. మూడు రాజధానుల పేరుతో వివాదాన్ని తెచ్చింది. ఫలితంగా అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. అభివృద్ధి స్తంభించింది. వేలాది మంది ఉపాధి కోల్పోయారు. రాజధాని చిట్టడివిలాగా మారింది. పూలింగ్‌ చట్టంలో రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. రైతులకు కౌలు కూడా సకాలంలో చెల్లించడం లేదు. రైతులకిచ్చిన ప్లాట్లు అభివఅద్ధి చేయలేదు. పేదలకు పెన్షన్‌ పెంచుతామని మాట ఇచ్చి నయా పైసా కూడా పెంచలేదు. ఐదు నెలలుగా పెన్షన్‌ కూడా ఇవ్వకుండా పెండింగులో పెట్టింది. ఇటువంటి స్థితిలో అమరావతి రైతులు, ప్రజలు గత 680 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. న్యాయస్థానాల్లోకెక్కారు. అయినా వైఎస్సార్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రాజధాని అభివృద్ధి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు కోరుతూ అమరావతి నుండి తిరుపతి వరకు పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్రకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్తి మద్దతును తెలుపుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాజధానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. అమరావతి విషయంపై పూటకొక మాట మాట్లాడుతూ… ప్రజలను మభ్య పరుస్తోంది. ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమాన్ని పాశవికంగా అణచివేస్తోంది. హౌదా, విభజన హామీలు అమలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి హాని చేస్తోంది. ఇటువంటి బిజెపిని కలుపుకొని అమరావతి కొరకు ఉద్యమం చేస్తే కీడు తప్ప మేలు లేదు. అమరావతి జేఏసి నాయకులు ఈ విషయాన్ని గమనించి రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి అమరావతిని నిలబెట్టుకోవాలి. హామీలను నెరవేర్చుకోవాలని మధు పేర్కొన్నారు.