ఓటమి భయంతోనే జనసేనానిపై విమర్శలు

  • పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ పై కాశెట్టి సంజీవరాయుడు ఫైర్
  • రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటున్న కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

అనంతపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తే తోలు తీస్తామని జనసేన జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ వైకాపా నాయకులను హెచ్చరించారు. మార్చి 14వ తేదీన జరిగిన జనసేనపార్టీ ఆవిర్భావదినోత్సవ సభను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ వైకాపా ప్రజాప్రతినిధులు గుడివాడ అమర్నాథ్, పేర్ని నానీ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిస్తూ గురువారం అనంతపురం నగరంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవరాయుడు, శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన మాత్రం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ న్ని మాత్రమే టార్గెట్ చేస్తూ కాపు మంత్రులు, నాయకులతో ఆయన్ని తిట్టిస్తూ కుల రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రి శునకానందం పొందుతున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ తను కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రజా సంక్షేమనికి ఖర్చు చేస్తుంటే ఓర్చుకోలేక కొందరు మంత్రులు టిడిపి, బిఆర్ఎస్ పార్టీల దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారిదే ఉందని ఎలాంటి విచారణ చేపడతారో చేపట్టి నిరూపించాలని లేని పక్షంలో పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలని సవాల్ విసిరారు. ఈ నెల 14న మచిలీపట్నం వేదికగా జరిగిన 10వ ఆవిర్భావదినోత్సవ సభకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారహి వాహనంపై కదిలితే ఇసుకేస్తే రాలానంతగా జనం నీరాజనాలు పలుకుతూ స్వాగతం పలికారని, సభా ప్రాంగణానికి జనసేనానిని ఆలస్యంగా చేరుకున్నా మొక్కవోని పట్టుదలతో లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉరకలేసిన తీరుని చూసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఓటమి భయం పుట్టిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జనసేనపార్టీని విమర్శించడం మాని రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితువు పలికారు.