పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సమావేశమైన టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ రోజు సమావేశమైన టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వుండే ఓ ప్రత్యేక దర్శనం ఇకపై సంవత్సరానికి పది రోజుల పాటు అందుబాటులోకి రానున్నది. ఈ విషయాన్ని టీటీడీ ట్రస్టు బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో డిసెంబర్‌ 5 నుండి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మాలను మీడియాకు వెల్లడించారు.

” తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విజయవంతమైంది.. తిరుమలలో పర్యావరణాన్ని కాపాడటానికి ఎలక్ట్రిక్ బస్సులు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌కు విన్నవించాం.. 100 నుండి 150 బస్సులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.. నడకమార్గంలో ఉన్న గోపురాలకు మరమ్మతులు, పద్మావతి అమ్మవారికి 11 కిలోల బంగారంతో సూర్యప్రభ వాహనంను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రూ.29 కోట్లతో తిరుమలలో కాటేజీల ఆధునీకరణ చేస్తామన్నారు. ఏపీలోని జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు పునఃప్రారంభిస్తామని చెప్పారు. బాలమందిరంలో రూ.10 కోట్లతో అదనపు హాస్టల్‌ భవనంను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.