ఫైనల్స్‌కు చేరిన ఢిల్లీ

క్వాలిఫయర్ 2లో ఢిల్లీ ఆదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి ఐపీఎల్ 13వ సీజన్‌లో టైటిల్ బరిలో నిలిచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 17 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వార్నర్ సేన ఓడిపోయింది. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఆరంభంలో తడబడింది. వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ వార్నర్(2), ప్రియం గార్గ్(17), మనీష్ పాండే(21), హోల్డర్(11) నిరాశపరిచారు.

కేన్ విలియమ్సన్(67), సమద్(33) మధ్య ఓవర్లలో మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. 19వ ఓవర్‌లో రబాడా మూడు వికెట్లు తీసి సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో రబాడా 4 వికెట్లు తీయగా.. స్టోయినిస్ మూడు వికెట్లు.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా, అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లకు 189-3 పరుగులు చేసింది. ధావన్(78), హిట్‌మెయిర్‌(42) రాణించారు. ఈ విజయంతో ఢిల్లీ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌లో తలబడనుంది.