రాయల్ చాలెంజర్స్ పై ఢిల్లీ ఘనవిజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం దుబాయి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు హోరా హోరీగా తలపడగా 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ బంపర్ విక్టరీ నమోదు చేసింది. ఢిల్లీ నిర్ధేశించిన 197 పరుగుల టార్గెట్‌ను చేధించడంలో ఆర్సీబీ తేలిపోయింది. అన్ని విభాగాల్లో రాణించిన ఢిల్లీ ఐపీఎల్‌లో మరో క్రేజీ విజయాన్ని సొంతం చేసకుంది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్ బాట్స్‌మెన్స్ తీవ్రంగా విఫలమయ్యారు. ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌(4) అరోన్‌ ఫించ్(13) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఒకరి తరువాత ఒకరు వచ్చినట్లే వచ్చి వెంటనే పెవిలియన్ బాట పట్టారు. కెప్టెన్ కోహ్లీ ఒక్కడే 43 ( 39 బంతుల్లో2 ఫోర్లు, 1 సిక్సర్‌) పరుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఏ దశలోనూ ఆర్సీబీ పట్టుచూపించలేదు. దీంతో ఢిల్లీ విజయం ఏకపక్షమైంది. ఢిల్లీ బౌలర్ రబడ నాలుగు వికెట్లు తీసి ఆర్సీబీని కొలుకోలేని దెబ్బతీశాడు. అలాగే నోర్జె, అక్షర్ పటేల్‌లకు చెరో 2 వికెట్లు దక్కాయి. అశ్విన్ 1 వికెట్ తీశాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆ జట్టు 196 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో మార్కస్ స్టాయినిస్ 53 (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే పృథ్వీ షా 42 (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లలు) పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 37 ( 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు, శిఖర్ ధావన్ 32 ( 28 బంతుల్లో 3 ఫోర్లు) సమిష్ఠిగా రాణించారు . దీంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగలిగింది. ఇక బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, మొయిన్ అలీ, ఉదానాలు చెరొక వికెట్ దక్కించుకున్నారు.