విధ్వంసమే వైసీపీ సిద్ధాంతం

* కక్షగట్టి మరీ ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లు ధ్వంసం
* బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు… ఆ పేరుతో ఇళ్ళు కూల్చివేత
* గ్రామస్తుల సొంత డబ్బులతో నిర్మించ తలచిపెట్టిన ఆడిటోరియానికి వైఎస్సార్ పేరు ఎందుకు?
* జనసేన ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారని అక్కసు
* ఇప్పటం గ్రామస్తులకు జనసేన అండగా ఉంటుంది
* 5వ తేదీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన
* రాజమండ్రి ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ఈ ప్రభుత్వానికి అది తప్ప మరేం తెలుసు.. అడ్డొచ్చిన వారిని భయపెట్టో, బెదిరించో, అంతమొందించో దారిలోకి తెచ్చుకోవాలన్న రాక్షసత్వం మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి తెలుస’ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం స్వచ్ఛందంగా స్థలాలు ఇచ్చిన ఇప్పటం గ్రామస్తులపై వైసీపీ నాయకులు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముఖ్యమంత్రి గారు ఉండే తాడేపల్లికి సమీపంలోనే ఇప్పటం ఉంది. ఆ ఊరికి కనీసం బస్సు కూడా లేదు. కానీ, ఊళ్ళో 100 అడుగుల రోడ్డు వేసి డివైడర్లు నిర్మిస్తారట. గ్రామానికి రోడ్లు వెడల్పు పేరుతో జనసేన మద్దతుదారులు, సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. బస్సు లేని గ్రామానికి 100 అడుగుల రోడ్డు ఎందుకు? ఇప్పుడు ఉన్న రోడ్డే ఆ గ్రామానికి సువిశాలంగా ఉంది. కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చారనే కక్ష కట్టి గ్రామస్తులను రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది. ఇటీవల ఇప్పటం గ్రామస్తులు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కమ్యూనిటీ హాలు కట్టి దానికి ఇప్పటం కమ్యూనిటీ హాల్ అని పేరు పెడితే… దానిని సహించలేని వైసీపీ నాయకులు వెంటనే దాన్ని మేం నిర్మిస్తామని చెప్పి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆడిటోరియంగా పేరు మార్చారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇవ్వద్దని రాత్రికి రాత్రి ఆ ప్రాంత ఎమ్మెల్యే వెళ్లి బెదిరించినా దారిలోకి రాలేదని అక్కసుతోనే ఇవన్నీ చేయిస్తున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం ఉదయం సుమారు 200 మంది పోలీసులు, జేసీబీలు తీసుకువెళ్లి ఇప్పటం గ్రామంలో ఉన్న ఇళ్లను ధ్వంసం చేసే పని మొదలు పెట్టారు. దీనిపై గౌరవ హైకోర్టు మధ్యాహ్నం స్పందించి, వెంటనే పనులను నిలుపుదల చేయాలని చెప్పడం శుభపరిణామం. న్యాయస్థానాలు లేకపోతే ఈ ప్రభుత్వం మరింత రెచ్చిపోయేది. కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఎంతకాలం ఈ పాలన సాగిస్తారో ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలంతా ఉమ్మడిగా తిరగబడితే ఈ ప్రభుత్వం మనుగడ కూడా ఉండదు. కేవలం ఇప్పటం గ్రామస్తులకే ఈ సమస్య వచ్చిందని భావించకుండా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మిగిలిన వారు మద్దతుగా నిలవకపోతే ఈ ప్రభుత్వం దాష్టీకాలు మరింత పెచ్చుమీరుతాయి. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరగడంతోనే ఇలాంటి దాడులకు సిద్ధమయ్యారు. ఐదు రోజుల క్రితం నేను ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్న సమయంలోనూ విద్యుత్ సరఫరా నిలుపుదల చేసి వారి నైజాన్ని బయటపెట్టారు. ఇప్పుడు మరింత రెచ్చిపోయి వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారు.
* ఇప్పటం రానున్న శ్రీ పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాలు ఇచ్చిన వారిని గుర్తు పెట్టుకొని మరీ ఈ ప్రభుత్వం వేధిస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం సాగించిన కక్ష సాధింపు చర్యలకు నిరసనగా, ఇప్పటం గ్రామస్తులకు అండగా నిలిచేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం గ్రామానికి రానున్నారు. గ్రామస్తులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని బెదిరింపులు వచ్చినా జనసేన పార్టీకి అండగా నిలబడిన ఇప్పటం గ్రామస్తులకు అవసరమైన ఏ సాయం చేయడానికి అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు” అని చెప్పారు. సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ నేతలు శ్రీ అత్తి సత్యనారాయణ, శ్రీ మేడా గురుదత్ ప్రసాద్, శ్రీ వేగుళ్ల లీలా కృష్ణ, శ్రీ శెట్టిబత్తుల రాజబాబు, శ్రీ తుమ్మల బాబు, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ బండారు శ్రీనివాసరావు, శ్రీ వై.శ్రీనివాస్, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి గంటా స్వరూప తదితరులు పాల్గొన్నారు.
* బీమా చెక్కులు అందజేత
రాజమండ్రి నగరంలోని క్వారీ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త శ్రీ పతివాడ మధు కుటుంబానికి పార్టీ తరఫున ప్రమాద బీమా చెక్కును శ్రీ మనోహర్ గారు అందజేశారు. ఇంటికి వెళ్లి వారి కుటుంబంతో మాట్లాడి మధు భార్య శ్రీమతి సరోజినీకి రూ. 5 లక్షల చెక్కు అందజేసి, కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ధవళేశ్వరానికి చెందిన క్రియాశీలక కార్యకర్త శ్రీ సింగింశెట్టి సురేష్ ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన తల్లి శ్రీమతి భూలక్ష్మికి ప్రమాద బీమా చెక్కును శ్రీ మనోహర్ గారు అందజేశారు. వారి ఇంటికి వెళ్లి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.