ఇప్పటంపై అక్కసు….

• జనసేన ఆవిర్భావ దినోత్సవానికి స్థలం ఇచ్చిన నాటి నుంచి వేధింపులు
• రోడ్డు విస్తరణ పేరిట ఇళ్లు కూల్చేస్తున్నారు
• 100 ఇళ్లు పగలకొడతామంటూ నోటీసులు
• ఇళ్లు మొత్తం జనసేన మద్దతుదారులవే

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామంపై వైసీపీ ప్రభుత్వం కత్తికట్టింది. ఆ గ్రామం మొత్తం జనసేనకు మద్దతు ఇస్తుండడంతో దీనిని అదునుగా తీసుకొని వేధింపులు మొదలు పెట్టింది. సభకు స్థలం ఇచ్చిన సమయంలోనే అధికార పార్టీ నాయకులతో పాటు స్థానిక శాసనసభ్యుడి నుంచి ఇప్పటం గ్రామానికి హెచ్చరికలు జారీ అయ్యాయి. వాటిని ఖాతరు చేయకుండా శ్రీ పవన్ కళ్యాణ్ సభ

నిర్వహించుకునేందుకు ఆ గ్రామ రైతులు తమ భూములు ఇచ్చారు. సభ పూర్తయిన నాటి నుంచి రోడ్డు విస్తరణ అంటూ జనసేన పార్టీ మద్దతుదారులకు చెందిన ఇళ్ల కూల్చివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి ఇప్పటికే 70 అడుగుల రోడ్డు ఉంది. ఇప్పుడు ఇంకా రోడ్డు విస్తరించాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఏప్రిల్ నెలలో నోటీసులు ఇచ్చారు. స్థానిక ప్రజా ప్రతినిధి గారు 70 అడుగులు ఉన్న ఆ రహదారిని 120 అడుగులు చేస్తారంట.. కక్ష సాధింపు ధోరణితో ఇప్పటంకు అదనపు హంగులు దిద్దుతారంట. అంతేకాదు ఇప్పటం గ్రామాభివృద్ధికి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ. 50 లక్షలను కూడా సచివాలయంలో జమ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
మూడు రోజుల క్రితం ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగా విద్యుత్ కట్ చేసి గ్రామం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. గ్రామస్థులు సెల్ ఫోన్ల వెలుగులో ఆయన సభను దిగ్విజయంగా పూర్తి చేశారు. దీంతో మరోసారి వైసీపీ

 సర్కారు కన్నెర్ర చేసింది. శుక్రవారం ఇప్పటం గ్రామానికి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు….

అధికారులు,పోలీసులతో కలసి వచ్చి ఇళ్ల కూల్చివేత కార్యక్రమం మొదలు పెట్టారు. ముందుగానే ఇప్పటం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. మంగళగిరి జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ తో పాటు జిల్లా నాయకత్వం హుటాహుటిన ఇప్పటం చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడి ఇళ్ల కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటం గ్రామంపై వైసీపీ అక్కసు వెళ్లగక్కడాన్ని పలువురు ఇప్పటికే ఖండించారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు.