గాఢ నిద్రలో ఉన్న సీఎంను మేల్కొలుపుతాం

* #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో రహదారులు ఎంత గొప్పగా ఉన్నాయో చూపిస్తాం
* ఈ నెల 15, 16, 17 తేదీల్లో మరోసారి రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్
* రోడ్ల మరమ్మతుల కోసం కేటాయించిన రూ.వేల కోట్లు దారి మళ్లుతున్నాయి
* సామాన్యుడి నుంచి వసూలు చేసే రోడ్ సెస్ ఏమైపోయింది?
* తెనాలి మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై జనసేన పార్టీ మరోసారి డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించబోతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ఈ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉంటూ.. కలలు కంటున్నారు.. ఆయన్ని మేల్కొలిపి రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తాం అన్నారు. ముఖ్యమంత్రి గారిని నిద్ర లేపే కార్యక్రమం కాబట్టి “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అని నామకరణం చేశామని తెలిపారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని, ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించీ, #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ గురించీ తెలిపేందుకు మంగళవారం ఉదయం తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంది. కేవలం సంక్షేమం అనే గోబెల్స్ ప్రచారంతో రాష్ట్ర పరిస్థితిని ఈ ముఖ్యమంత్రి అథోగతి పాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో కలిపి దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ. 22,675 కోట్లు కేటాయించారు. అధికారంలోకి వస్తే రాష్ట్రం పరిధిలో ఉన్న రహదారులను డబుల్, నాలుగు వరుసల రహదారులుగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి… ఇవాళ ప్రధాన రహదారుల్లో అడుగుకో గుంత ఉంటే తట్టడు మట్టి వేయలేదు.
* సీఎం గారూ.. మీ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నాం
రాష్ట్ర పరిధిలో 32 వేల కిలోమీటర్ల రోడ్లు ఉంటే… రూ. 2100 కోట్లతో దాదాపు 8 వేల కిలోమీటర్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ కల్లా మరమ్మతులు పూర్తి చేసి, 15వ తేదీకల్లా ఆ రోడ్ల ఫోటోలు అఫ్లోడ్ చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు చేసిన ఛాలెంజ్ ను జనసేన పార్టీ తరుఫున స్వీకరిస్తున్నాం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో మరోసారి రాష్ట్ర రహదారుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కళ్లు తెరిపిస్తాం. చిధ్రమైన రోడ్ల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని #JSPForAP_Roads అనే హాష్ ట్యాగ్ తో గత ఏడాది సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ చేసింది. ఆ మూడు రోజులు దేశంలోనే నెంబర్ 1గా ట్రెండింగ్ లో నిలిచింది ఆ క్యాంపెయిన్. ఎంతోమంది యువకులు, వీర మహిళలు తమ గ్రామాల్లో రోడ్ల దుస్థితిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయినా ముఖ్యమంత్రి మత్తు నిద్ర వీడలేదు. రోడ్ల మరమ్మతు పనులు చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్లు పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ జిల్లా కా జిల్లా కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పనులు చేయకూడదని తీర్మానాలు చేసుకుంటున్నారు.
* సామాన్యుడి సొమ్ము ఎక్కడికి పోయింది?
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాదితో పోలిస్తే 43 శాతం ఎక్కువ నిధులు కేటాయించింది. అలాగే రోడ్ల మరమ్మతుల కోసం అని చెప్పి ఎక్కువ వడ్డీలకు నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయని ఎవరైనా ప్రశ్నిస్తే సంక్షేమ పథకాల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. మనం కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ పై రహదారుల మరమ్మతుల కోసం సెస్ పేరిట ఏటా రూ. 750 కోట్లు వసూలు చేస్తున్నారు. వీటిని చూపించే అప్పులు తీసుకొస్తున్నారు. రోడ్ సెస్ చూపించి రూ.6 వేల కోట్ల అప్పులు తెచ్చిన మాట వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే రహదారుల మరమ్మతుల పేరిట తీసుకొచ్చిన అప్పులు, సెస్ పేరిట వసూలు చేసిన సొమ్ము ఎలా ఖర్చు చేశారో రాష్ట్ర ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేయాలని” డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు. విలేకర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నేతలు బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, రమణారావు, మధు పాల్గొన్నారు.