ప్రయివేటు టీచర్లకు రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించిన మంత్రి సబిత

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రయివేటు టీచర్లకు 25 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌, ప్రయివేటు టీచర్లు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అందుకున్న టీచర్లు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు టీచర్లకు ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ప్రయివేటు స్కూళ్లలో పని చేసే టీచర్లు, సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది కరోనా వ్యాప్తి మొదలైనప్పుడు వలస కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. వారికి నగదు అందజేసి, రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక రాష్ర్టంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయంతో పాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందజేశామన్నారు.

ఈ క్రమంలో ప్రయివేటు టీచర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఈ విడతలో ఒక లక్షా 24 వేల మందికి 25 కిలోల రేషన్ బియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. నిన్న ఒక్కరోజే ఒక లక్షా 12 వేల మంది టీచర్ల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున నగదు జమ చేశామన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మంత్రి సబిత ఆకాంక్షించారు. ప్రయివేటు టీచర్ల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.