జాతీయ నేతలకు కులం ఆపాదించవద్దు

•చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానం కల్పించాలి
•స్వాతంత్ర్య అమృతోత్సవం సందర్భంగా జనసేన తీర్మానాలు

భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ జనసేన పార్టీ రెండు ముఖ్య తీర్మానలను ప్రవేశపెట్టింది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి త్యాగాలు చేసిన జాతీయ స్థాయి నాయకులకు కులాన్ని ఆపాదించరాదని… 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా చట్ట సభల్లో మహిళలకు సముచిత స్థానం ఇస్తూ 33శాతం రిజర్వేషన్ కల్పించాలని తీర్మానాలు చేసింది. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ తీర్మానాలు ఎంతో అవసరమని భావించారు. గత నెల మండపేటలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ గాంధీజీ, నేతాజీ, అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు లాంటి పోరాట యోధులైన జాతీయ నేతలకు కులాన్ని ఆపాదించకూడదు అని చెప్పారు. ఈ అంశంపై తీర్మానం చేయాలని సంకల్పించారు. అదే విధంగా మహిళా శక్తికి సముచిత స్థానం ఇచ్చేలా చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ అవసరం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఇందుకనుగుణంగా తీర్మానాలు ప్రవేశపెడుతున్నాం” అన్నారు. ఈ తీర్మానాలను పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జిలు, వివిధ విభాగాల ఛైర్మన్లు, వీర మహిళ విభాగం ప్రాంతీయ కో ఆర్డినేటర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు :
1)మహాత్మా గాంధీజీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు, ఆంధ్రకేసరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు… ఇలా ఏ జాతీయ స్థాయి నాయకునికిగాని, సమసమాజ స్థాపనకి కృషి చేసిన రాష్ట్ర, స్థానిక నాయకులు, మహిళా నేతలకు కులం అంటగట్టడం భావ్యం కాదు. అలా చేస్తే అది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధంగా భావించాలి. ఈ జాతీయ నాయకులు ఎవరూ ఏ ఒక్క కులం కోసమో ఎప్పుడూ ఆలోచించలేదు. వారు భారతదేశంలోని అన్ని కులాలు, మతాల వారి కోసం పని చేసిన మహానుభావులు. వారి కులం భారతీయం. వారి మతం భారతీయం. వారిని దేశ నాయకులుగా అనుసరిద్దాం. భారత జాతికి నాయకులుగా గౌరవిద్దాం
2)స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యింది. మనం నేడు వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం. అయినప్పటికీ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం ఇప్పటికీ దక్కలేదు. వారికి సమాన స్థాయి కల్పించలేకపోయాం. కనీసం మూడో వంతు ప్రాతినిధ్యం కూడా అందించలేదు. ఈ పరిస్థితి మారాలి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం రానున్న కాలంలో అభిలషణీయమైన స్థాయిలో పెరగాలి. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో 33 శాతం మహిళ రిజర్వేషన్ కు జనసేన కట్టుబడి ఉంది. దీనికి సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదించే వరకు జనసేన కృషిని కొనసాగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *