ఆక్సిజన్ సరఫరాకు ఆటంకాలు కలిగించవద్దు: సీఎంలతో ప్రధాని

న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాకు రాష్ట్రాలు ఎలాంటి ఆటంకాన్ని కలిగించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలను కోరారు. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలూ కలిసి పనిచేయాలని అభ్యర్థించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశం మొత్తం ఓ సామూహిక శక్తిగా కరోనాతో పోరాడితేనే విజయం సాధిస్తామని, వనరులకు ఎలాంటి కొరతా లేదన్నారు. వివిధ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసే సమయంలో ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏర్పాట్లు చేయాలని మోదీ సూచించారు.

ఇలా చేయడం ద్వారా అవసరమున్న ఆస్పత్రులకు తొందరగా ఆక్సిజన్ సరఫరాను చేసిన వారమవుతామని మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని, అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా తక్షణ అవసరాల నిమిత్తం పారిశ్రామిక ఆక్సిజన్‌ను కూడా మళ్లించామని ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంల దృష్టికి తీసుకొచ్చారు.