విద్యార్థులకు నష్టం కలగని రీతిలో పరీక్షలు నిర్వహించాలి: అధికారులకు జగన్ ఆదేశం

ఏపీలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత వ్యాక్సిన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు నష్టం కలగని రీతిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎక్కడా నిర్లక్ష్యం చూపరాదని పేర్కొన్నారు.

తగినన్ని కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, వాటిలో అవసరమైన సదుపాయాలు నెలకొల్పాలని స్పష్టం చేశారు. 104 కాల్ సెంటర్ మరింత సమర్థవంతంగా పని చేయాలని, ప్రతి జిల్లాలో ఒక జేసీకి దీని బాధ్యతలు అప్పగించాలని సూచించారు.

కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ వైపు తరలిపోకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్, రెమ్ డెసివిర్ ఇంజక్షన్లను ముందు స్థానిక అవసరాలకే వినియోగించాలని, లేని పక్షంలో ఇక్కడ కేసులు పెరిగితే ఆ సంస్థలే మూతపడే పరిస్థితి వస్తుందని సీఎంజగన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కేంద్రానికి అర్థమయ్యేట్టు చెప్పాలని అధికారులకు స్పష్టం చేశారు.