విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దు

•ఫ్లెక్సీలతో యూనివర్సిటీని నింపేయడం ఏం సూచిస్తోంది?
విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో ఉన్నాయా అనే సందేహం కలుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చి వేసి, ఆ పార్టీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీలతో ప్రాంగణాలు నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోంది. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందని సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉంది. తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు ఆమోదయోగ్యమైనవి? డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సి.ఆర్.రెడ్డి లాంటి గొప్పవారు ఉప కులపతులుగా బాధ్యతలు నిర్వర్తించిన సరస్వతి ప్రాంగణం ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఆ విద్యావనం నుంచి ఎందరో మేధావులు వచ్చారు. అలాంటి చోట చిల్లర రాజకీయాలు చేస్తూ, పార్టీ ఫ్లెక్సీలు కట్టించేవాళ్ళు కీలక బాధ్యతల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో అందరూ ఆలోచించాలి. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తోంది. విశ్వవిద్యాలయ ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ, ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించాలని మనవి చేస్తున్నాం. విద్యార్థులను, చిరుద్యోగులను ఒత్తిడి చేసి వేడుకలు చేయించడం.. బలవంతపు పార్టీ మార్పిళ్ళకు పాల్పడటం విడిచిపెట్టాలి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి. విశ్వవిద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్నినిలువరించి, విశ్వ విద్యాలయ అభివృద్ధి కోసం ఉప కులపతులు బాధ్యతగా పని చేయాలని
పవన్ కళ్యాణ్ హితవు పలికారు.