రైతు చిరునవ్వుతో ఉన్న రోజే నిజమైన పండగ

రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు… లాంటివి మంచి నినాదాలుగా మిగిలిపోవడం సరికాదు. అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పాలకులు ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభం దిశగా వెళ్తోంది. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కావడంతో ప్రకృతి విపత్తులు అన్నదాతలను కుదేలు చేస్తున్నాయి. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకొని నష్టపరిహారం ఇచ్చి కోలుకొనేలా చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. తాజాగా మాండౌస్ తుఫాను వల్ల పంటలు దెబ్బ తిన్న రైతాంగం బాధలు వింటే వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్థమవుతోంది. నీట మునిగిన పంట కుళ్లిపోతున్నా అధికార యంత్రాంగం స్పందించలేదు. పంట కాలువల నిర్వహణను విస్మరించారు. రైతు భరోసా కేంద్రాలను ప్రచారం కోసమో, ఇతర అవసరాల కోసం వాడుకొన్నారు తప్ప రైతులకు మాత్రం లబ్ధి చేకూరడం లేదు. ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా లేదు. అమ్మిన ధాన్యానికి ఎప్పుడు డబ్బులు చెల్లిస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వైసీపీ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గతేడాది సంభవించిన జల ప్రళయం వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేస్తే వాటిని తీయించే బాధ్యతను కూడా ఈ ప్రభుత్వం విస్మరించింది. కౌలు రైతులకు అర్హత కార్డులు ఇవ్వడంలోనూ అర్థం లేని నిబంధనాలే. ఫలితంగా వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఈ నష్టాల వల్ల కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారి కుటుంబాలను కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని ప్రచారం కోసం వాడుకొంటోంది తప్ప వారికి చేయూతనిచ్చి నిలబెట్టడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడేలా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. స్వేదం చిందించి నేలపై బంగారం పండించే ప్రతి అన్నదాతను గౌరవించుకోవాలి. అందుకే జనసేన ఈ రోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని రైతులను గౌరవించుకొనే కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయ రంగం వృద్ధి కోసం చర్చలు నిర్వహిస్తోంది. రైతుల ముఖాన చిరునవ్వులు కనిపించిన రోజే నిజమైన పండగ. ఆ రోజు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలి. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతన్నకీ నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ అన్నారు.